calender_icon.png 15 January, 2025 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణమాఫీ చరిత్రలో నిలిచిపోతుంది

18-07-2024 12:40:17 AM

  1. ఇబ్బందులుంటే అధికారులను కలవండి
  2. 62 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు
  3. వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి):  దేశ చరిత్రలోనే ఒక రాష్ర్ట ప్రభుత్వం రూ. 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేయడం చారిత్రాత్మక నిర్ణయమని, ఇది చరిత్రలో నిలిచిపోయే గొప్ప విషయమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రుణమాఫీ చేసిన ప్రభుత్వంలో తానొక మంత్రిగా ఉండడం జీవితంలో అత్యంత సంతోషకరమైన విషయని తెలిపారు. తాను కూడా ఓ రైతు బిడ్డనే అని ఓ రైతుకు ఇంతకంటే సంతోషం ఏముంటుందని అన్నారు.

మొదటగా రూ. 1 లక్షతో రుణ మాఫీ ప్రారంభం అవుతుందని అవగాహన లేని ప్రతిపక్షాలకు తాను విజ్ఞప్తి చేస్తున్నట్లు పొన్నం పేర్కొన్నారు. రూ. 1 లక్ష లోపు వాళ్లందరికీ గురువారం ఒకేసారి నిధులు జమ అవుతాయన్నారు. చివరి వారంలో రూ. 1.50 లక్షల వరకు ఉన్న వాళ్లందరికీ జమవుతాయని తెలిపారు. ఆగస్టులోపు మిగతా వారందరికీ రుణమాఫీ అవుతుందని వెల్లడించారు. ఒకేసారి రైతు పేరు మీద ఉన్న రుణాన్ని 3 పద్ధతుల్లో నేరుగా బ్యాంకుల్లో జమ చేస్తున్నామని.. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని రకాలుగా ఆలోచించి ఇంత గొప్ప నిర్ణయం తీసుకుంటే ప్రశంసించాల్సింది పోయి విమర్శలు చేస్తున్న వారి కుహానా రాజకీయం అర్థం అవుతుందని మండిపడ్డారు. 

ఇప్పటి వరకు 62 కోట్ల మంది మహిళల ఉచిత ప్రయాణం.. 

రాష్ట్రంలో ఇప్పటి వరకు 62 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, ఇది ఎంతో సంతోషకరమైన విషయంగా మంత్రి పొన్నం పేర్కొన్నారు. రూ. 2150 కోట్ల విలువైన ఉచిత ప్రయాణాలను మహిళలకు అందించినట్లు, ఈ నిధులు ఆర్టీసీకి చెల్లించామని పేర్కొన్నారు. హరీష్ రావు, కేటీఆర్ సహా బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాన్ని ప్రశంసించకున్నా విమర్శించవద్దని కోరారు. 2005లో దేశవ్యాప్తంగా రూ. 72,000 కోట్ల మాఫీ చేస్తే.. ఇప్పుడు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం రుణమాఫీ కోసం రూ. 31 వేల కోట్లు ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పక్షాన ప్రతి గ్రామంలో రైతు వేదికల వద్ద రుణమాఫీ వేడుకలు చేయాలని పిలుపునిచ్చారు.