- షరతుల పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టొద్దు
ఎకరానికి రూ.15 వేల భరోసాను త్వరగా అందించాలి
కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో పెరిగిన క్రైమ్ రేటు
సంగారెడ్డి ప్రెస్‌మీట్‌లో మాజీమంత్రి హరీశ్‌రావు
సంగారెడ్డి, జనవరి 1 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హా అమలు చేయకుండా, షరతుల పేరుతో ఇబ్బందులు పెడుతోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ ఆరోపించారు. బుధవారం సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు రైతు భరోసాను ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ప్రకటించి, ఇంత వరకు అమలు చేయలేదన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రైతులకు 11 సార్లు రైతు భరోసా పంపిణీ చేసిందన్నారు. ఎన్నికల్లో రైతులకు రూ. 2 లక్షల పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించి, ఇంతవరకు పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు చెల్లించలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో 54 లక్షల ఉపాధిహామీ జాబ్ కార్డులు ఉన్నాయని, కోటి 4 లక్షల మంది కూలీలు పని చేస్తున్నారని తెలిపారు. వారికి వెంటనే ఏడాదికి రూ.12 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఉపాధి హామీ కూలీలకు మే నెలలో కేంద్ర ప్రభుత్వం రూ. 858 కోట్ల నిధులు విడుదల చేస్తే వాటిని కూలీలకు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు చెల్లించిందని వాపోయారు.
రాష్ట్రంలో పెరిగిన నేరాలు
కాంగెస్ ఏడాది పాలనలో రాష్ట్రంలో నేరాలు బాగా పెరిగాయని, హోం శాఖను పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్ ఏం చేస్తున్నారని హరీశ్‌రావు ప్రశ్నించారు. సైబర్ నేరాలు, అత్యాచారాలు, దోపిడీలు పెరిగాయన్నారు. పోలీస్ స్టేషన్ల నిర్వహణకు నిధులు కేటాయించడం లేదన్నారు.
దీంతో పోలీసులు స్టేషన్‌కు వచ్చిన వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. హోంగార్డులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి ఇంత వరకు అమలు చేయలేదన్నారు. బీహార్ కంటే తెలంగాణలో నేరాలు అధికంగా జరుగుతున్నాయన్నారు.