తెలంగాణలో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిన స్వల్పకాలం లోనే రైతుల రుణమా ఫీని అమలు చేసేందుకు పూనుకుంది. 2 లక్షల రూపాయల లోపు ఉన్న అప్పులను ఒకేసారి మాఫీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్ర భుత్వం సిద్ధంపడటం ఒక రకంగా సాహసోపేతమైన నిర్ణయం. రాష్ట్రంలో అప్పుల తో ఇబ్బంది పడుతున్న రైతాంగానికి ఇది సంతోషాన్ని కలిగించటమేకాక వ్యవసాయ సిజన్‌లో కొత్తగా రుణాలు ఇచ్చేం దుకు రైతులకు ఉపయోగపడుతుంది. సుమారు 7 నెలలుగా అనేక కసరత్తులు చేసి 15.7 2024న ప్రభుత్వం రుణమాఫీ మార్గదర్శకాలను ప్రకటించింది. కొంత ఆలస్యంగానైనా రెండు లక్షల రూపాయల రుణమాఫీని రైతులకు ప్రకటించడం ద్వా రా రైతులలో ఆనందం వెల్లివిరుస్తున్నది.
మచ్చటగా మూడు దశలు
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 40 బ్యాంకులలో నుండి 5,782 శాఖల ద్వారా వివరాలు ముందుగా తీసుకుంది. 2023 డిసెంబర్ 9 నాటికి 41,78,892 మంది రైతుల ఖాతాలకు 42,956 కోట్ల అప్పు ఉం దని తేలింది. ఆడిటింగ్ చేస్తే 2 వేల ఖాతాలలో లొసుగులున్నాయని తేలినట్లు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రైతులు అందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేయడానికి 31 వేల కోట్ల రూపాయలు ఖర్చు కానున్నదని ప్రభుత్వం ప్రకటించింది. 2 లక్షల రుణమాఫీని మూడు దశలుగా విభజించి, అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
మొదటి విడతలో 2024 జూలై 18కి ఒక లక్ష రూపాయలలోపు అప్పుగల రైతులకు రుణమాఫీ చేయాలని, ఇందుకు రూ.6,098 కోట్లు కేటాయించింది. రెండో విడతలో జూలై 30 నాటికి ఒకటిన్నర లక్షల రూపాయలలోపు రుణాలు ఉన్నవారికి రుణమాఫీ చేస్తామని దీనికి రూ.7,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రకటించారు. మూడో విడతన ఆగస్టు 15 నాటికి 2 లక్షలలోపు అప్పు ఉన్న రైతులకు మాఫీ చేసేందుకు రూ.18,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అం చనా వేశారు.
ఆత్మహత్యలలో అగ్రస్థానానికి!
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో రైతుల రుణా లను మాఫీ చేస్తామని వివిధ సందర్భాలలో హామీ ఇచ్చి నామమాత్రంగానే అమ లు చేశారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మూడు విడతలుగా రైతుల రుణాలను మాఫీ చేసేందుకు పూనుకోవడం మంచి పరిణామం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఎలాంటి తాకట్టు పెట్టుకోకుండా రూ. 1,60,000లు బ్యాంకులు లోన్లు ఇవ్వాల్సి ఉంటుంది. వ్యవసాయ రంగానికి రుణాలను ఆర్‌బీఐ సూచనల మేరకు ఇవ్వడం లో బ్యాంకర్లు నిరాకరిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ బ్యాంకుల నుండి పం టలకు అవసరమైన రుణాలను రైతులకు పూర్తిగా ఇవ్వకపోవడం వల్ల వడ్డీవ్యాపారు లు, ప్రై వేటు బ్యాంకులపై ఆధార పడాల్సి వస్తుం ది. నకిలీ విత్తనాలు, పురుగుమందుల బా రిన పడి పంట దిగుబడిరాని పరిస్థితి. దీనికితోడు పండిన పంటలకు గిట్టుబాటు ధర లు లేవు. ఆత్మాభిమానం కలిగిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న దయనీయ స్థితి నెలకొంది. కారణాలు ఏవైతేనేమి, తెలంగాణ రాష్ట్రం రైతుల ఆత్మహత్యలలో దేశంలోనే అగ్రస్థానానికి చేరే పరిస్థితి నెలకొన్నది.
మాఫీ కాని అర్హులు ఎందరో!
రాష్ట్రంలో ఒక లక్ష రూపాయలలోపు అప్పు తీసుకొని అర్హత కలిగిన రైతులందరికీ రుణమాఫీ జరగాల్సి ఉండగా మొదటి దశలో సగానికి పైగా రైతులకు రుణమాఫీ లిస్టులో పేరు రాకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో అర్హులైన రైతులు 42 వేల మంది ఉండగా వారికి లక్షరూపాయల రుణమాఫీ చేస్తే రూ. 162 కోట్లు రుణమాఫీ జరగాల్సి ఉంటుంది. కానీ, 19,542 మం ది రైతులను అర్హులుగా చూపించి రూ.75 కోట్లు మాత్ర మే మాఫీ చేశారు. ఇంకా 22,458 మంది అర్హత కలిగిన రైతులకు మొదటి విడతలో రుణమాఫీ జరగలేదు. అర్హులైన మొ త్తం రైతులలో 45% మందికి మాత్ర మే మాఫీ జరిగింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా లో మొత్తం 51,417 మంది రైతులు అర్హత కలిగి ఉండగా వారికి రూ.236.54 కోట్లు మాఫీ చేయవలసి ఉంది.
కానీ, 20,130 మంది రైతులను అర్హులుగా చూపించి రూ. 92.02 కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ చేశారు. ఈ జిల్లాలో ఇంకా 31,287 మంది అర్హులైన రైతులకు మొదటి విడతలో లిస్టులో పేర్లు లేకుండా అన్యాయం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 75,513 మంది రైతులు అర్హులు కాగా 33,513 మందిని అర్హులుగా చూపించి రూ.143.10 కోట్లు మాత్రమే మాఫీ చేశా రు. ఇంకా 41,600 మంది అర్హులైన రైతులకు మాఫీ లిస్టులో పేర్లు లేకుండా పోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అర్హులైన 57,129 మంది రైతులకు మాఫీ జరగాల్సి ఉండగా లిస్టులో పేర్లు లేకుండా చేసి కేవలం 23,841 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు. ఇంకా 33,288 మంది అర్హులైన రైతుల పేర్లు గల్లంతయినాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నుంచే 1,69,864 మంది రైతులు మొదటి విడత రుణమాఫీకి అర్హత సాధించి ఉండగా వారికి లక్షలోపు రుణమాఫీ చేయడానికి 908.27 కోట్లు మాఫీ కావాల్సింది. కానీ 37,625 మంది రైతులను అర్హులుగా చూపించి రూ. 121.63 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. ఇంకా 1,32, 239 మంది అర్హులైన రైతులు లక్షరూపాయలలోపు రుణాలు తీసుకున్న వారున్నా రు. ఈ రైతులకు రుణమాఫీ చేయాలని జిల్లా వ్యవసా య శాఖ అధికారులను కలిసి పిర్యాదు చేయడంతోసహా హెల్ప్ లైన్‌ను ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు చెందిన రైతులు అర్హత ఉన్నప్పటికీ రుణమాఫీ చేయక పోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
సత్వరచర్యలే సంతోషదాయకం
మొదటి విడతలో రుణమాఫీకి అర్హత కలిగి ఉన్నప్పటికీ కొందరి పేర్లు జాబితాలో ఎందుకు లేకుండా పోయాయి? రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయబడి బ్యాంకుల నుండి సమగ్ర రిపోర్టును తీసుకొని ప్రభుత్వానికి అందించడం లో వ్యవసాయశాఖ అధికారులు తీవ్ర వైఫ ల్యం కారణంగా కనిపిస్తున్నది. ఫలితంగా రైతాంగం రోడ్డునపడి ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు బ్యాం కర్లు సరైన సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా తప్పుదారి పట్టించారా? క్షేత్రస్థాయిలో పరిశీలించి లోపం ఎక్కడ జరిగి నా అర్హులైన రైతులకు రుణమాఫీని చేయాలి.
రైతుల ఆందోళనకు పరిష్కారం వెంటనే చూపని పక్షంలో రుణమాఫీ పథకం వల్ల అర్హులైన రైతులకు నష్టం జరుగుతుంది. లక్ష రూపాయలలోపు అర్హత కలిగిన రైతులకు రెండో విడత వరకు ఆగకుండా ముందుగానే రుణమాఫీని ప్రకటించి వారి ని సంతృప్తి పరచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ‘చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న చందం’గా రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డు ఎక్కి ఉద్యమానికి సిద్ధపడితే జరిగే నష్టం ఎక్కువగా ఉంటుం ది. రెండో దశ, మూడవ దశ అంటూ కాలయాపన చేస్తే ప్రభుత్వం చేపట్టిన రైతు ప్రయోజ నకర రుణమాఫీ పథకంతో రైతు ల విశ్వాసాన్ని పొందడం కన్నా వారి వ్యతిరేకతను మూట కట్టుకోవడం అవుతుందని ప్రభుత్వం గుర్తించి వెంటనే సరిచేయాలి.
వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు.
సెల్: 9490700954.