16-03-2025 01:22:20 AM
రుణమాఫీ పూర్తి కాలేదు!
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): రాష్ట్రం లో వంద శాతం రుణమాఫీ కాలేదని బీఆర్‌ఎస్ ఎ మ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గమైన జనగామలోనూ ఇదే జరిగిందని, ఒకవేళ వందశాతం రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే తాను ముక్కునేలకు రాస్తానని సవాల్ విసిరారు.
ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదానికే కాంగ్రెస్ కారణమని ఆరోపించారు. కృష్ణా జలాల వాటా రాబట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. రాష్ట్ర చిహ్నంలో చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగింపుపై ఆయన అభ్యంత రం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన త ర్వాత వాటిని మళ్లీ తీసుకొస్తామని స్పష్టం చేశారు. బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించారు
రైతులకిచ్చిన ప్రతి పైసా లెక్క చెప్తాం..
హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రూ.20 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. శాసనసభ ప్రాంగణంలోనూ రైతు రుణమాఫీ, రైతు భరోసాకు సంబంధించిన సమాచారాన్ని ప్రదర్శిస్తామని వెల్లడిం చారు. ప్రతి పైసాకు లెక్క చెప్తామని స్పష్టం చేశారు.
శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు సభ్యులు రుణమాఫీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు, విద్య, రుణమాఫీ వంటి అంశాలను లేవనెత్తారు. వాటికి డిప్యూటీ సీఎం భట్టితోపాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు ఘాటుగా సమాధానాలిచ్చారు. తొలుత డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న జనగామ నియోజకవర్గంలో 263 కోట్ల రైతు రుణాలు మాఫీ అయ్యాయని గుర్తుచేశారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం యూనివర్సిటీలను తమకు అనుకూలమైన వారికి ధారాదత్తం చేసిందని ఆరోపించారు. విద్యాశాఖను ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహిస్తున్నారని, సీఎం విద్యాశాఖను పట్టించుకోవడం లేదనడం సరికాదని హితవు పలికారు. వర్సిటీలను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని, తమ ప్రభుత్వం వచ్చాక వర్సిటీలకు 12 మంది వీసీలను నియమించామని గుర్తు చేశారు.
వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ పరిధిలో రూ.540 కోట్లతో భవనాలు నిర్మిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.11వేల కోట్లతో 58 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని వివరించారు. ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపించి, ఆనంద్ మహేంద్ర వంటి పారిశ్రామికవేత్తల సాయంతో యువతలో నైపుణ్యాలు మెరుగుపరుస్తామని తెలిపారు.
11 వేల ఉపాధ్యాయ పోస్టులకు తమ ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించిందని, మరోవైపు 22,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని స్పష్టం చేశారు. మరో 36,000 మంది ఉపాధ్యాయులను బదిలీ చేశామని స్పష్టం చేశారు.