14-04-2025 12:19:44 AM
మంచిర్యాల, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): 85 శాతం మంది రైతులకు రుణమాఫీ జరిగిందని, సన్న ధాన్యానికి బోనస్, ఉచిత బస్సు ప్రయాణం, ఉచితంగా రెండు వందల యూనిట్ల విద్యుత్, ఉచితంగా సన్న బియ్యం పంపిణీతో ప్రజలకు ఆర్ధిక ప్రయోజనం చేకూర్చామని మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు తెలిపారు.
ఆదివారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఉప ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు రానున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనుల నిమిత్తం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ లు సోమవారం మంచిర్యాల కు వస్తున్నారన్నారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఐబీ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబెడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని, రాళ్ళవాగు పక్కన కరకట్ట నిర్మాణం కు శంఖుస్థాపనతో పాటు పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చూడతారని తెలిపారు. వీటితోపాటు మాతా శిశు ఆసుపత్రి నిర్మాణం పనులను పరిశీలిస్తారని చెప్పారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ జీప్ లో పట్టణంలోని వాటర్ ట్యాంక్ ఏరియా, జగదాంబ సెంటర్, మెయిన్ రోడ్, అర్చన చౌరస్తా మీదుగా జిల్లా పరిషత్ బాల్ర పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ స్థలం వరకు ర్యాలీ కొనసాగుతుందని అన్నారు. సభలో కొత్త పథకాలను మంత్రులు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
సుమారు 40 వేల మంది అభిమానులు సభకు హాజరవుతారని తెలిపారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేయడం వల్ల ప్రస్తుత ప్రభుత్వం ఆర్ధికంగా సతమతమవుతుందన్నారు. డంప్ యార్డు సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని భరోసా ఇచ్చారు. వేంపల్లిలో ఇండస్త్రీయల్ పార్కు కోసం బలవంతంగా భూములు లాక్కోవడం లేదని వివరించారు. మహాప్రస్థానం మంగళవారం నుంచి వినియోగంలోకి వస్తుందని, నిరుపేదలకు ఉచితంగా అంత్యక్రియలు జరిగేందుకు వెసులుబాటు ఇస్తున్నామని తెలిపారు. అక్కడే డెత్ సర్టిఫికెట్ ఇస్తారని అన్నారు. తాను చేసే అభివృద్ధి పథకాలను వక్రీకరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీ సీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కాంగ్రె స్ మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.