- రామన్నపేటలో పీఏసీఎస్ భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
- పండించిన ప్రతి ధాన్యం గింజా కొంటాం
- త్వరలో చేనేత రుణాలు మాఫీ
- వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- రామన్నపేటలో పీఏసీఎస్ భవనం ప్రారంభం
నల్లగొండ, నవంబర్ 9 (విజయక్రాంతి): డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలో రైతులందరి రుణాలు మాఫీ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి శనివారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఎమ్మెల్యే వీరేశం అభ్యర్థన మేరకు రామన్నపేట వ్యవసాయ ఉప మార్కెట్ స్థాయిని మార్కెట్ స్థాయికి పెంచుతున్నట్లు ప్రకటించారు.
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నదన్నారు. ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బంది లేకుండా రైస్ మిల్లర్లతో మాట్లాడి ఇప్పటికే మిల్లింగ్ ఛార్జీలు పెంచామని గుర్తు చేశారు. సహకార సంఘాల అధ్యక్షులు రైతులకు ఇబ్బంది లేకుండా పంట ఉత్పత్తులు అమ్ముకునేలా సహకరించాలని కోరారు. త్వరలో చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
చేనేత ద్వారా తెలంగాణ ఆడ బిడ్డలకు నాణ్యమైన చీరెలు అందిస్తామన్నారు. నల్లగొండ జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. కార్యక్రమంలో డీసీఎంస్ చైర్మన్ బోళ్ల వెంకట్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.