calender_icon.png 13 January, 2025 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణమాఫీ మొదలు

19-07-2024 01:03:15 AM

  • రాష్ట్రమంతటా సంబురాలు

లక్ష వరకు మాఫీచేసిన సర్కారు

నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభం

రైతు వేదికల వద్ద ఉత్సవాలు  రేవంత్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు

వరంగల్‌లో అభినందన సభ

  1. 5 లక్షల మందితో ఈ నెలాఖరులో.. 
  2. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ఆహ్వానిస్తాం
  3. నేడో రేపో మంత్రులతో కలిసి ఢిల్లీకి 
  4. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోజీతాలు కూడా ఇయ్యలే
  5. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. మొదటి దఫాలో రూ.లక్షలోపు ఉన్న రుణాలను మాఫీ చేసింది. ఇందుకు సంబంధించిన నిధులను సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. అనంతరం కొందరు లబ్ధిదారులతో సీఎం స్వయంగా మాట్లాడారు. రుణాలు మాఫీ కాగానే రాష్ట్రవ్యాప్తంగా రైతులు, కాంగ్రెస్ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి.

మిఠాయిలు పంచుకొని, సీఎం రేవంత్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. అన్ని జిల్లాల్లో రైతు వేదికల వద్ద రైతులతో సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వరంగల్ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ప్రకటించారు. అదే వరంగల్‌లో ఈ నెలాఖరులో ౫ లక్షల మందితో అభినందన సభ నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి రాహుల్‌గాంధీని ఆహ్వానిస్తామని తెలిపారు. రెండురోజుల్లో మంత్రివర్గ సహచరులతో ఢిల్లీ వెళ్లి రాహుల్‌గాంధీని సభకు స్వయంగా ఆహ్వానిస్తానని చెప్పారు.  

ఒకేరోజు రూ.6 వేల కోట్లు

కాంగ్రెస్ మాట శిలా శాసనమని మరోసారి రుజువైందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో గురువారం ఒకేరోజు రూ.6,098 కోట్లు జమ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహదారు కే కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమక్షంలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. 577 రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల రైతులతో సీఎం స్వయంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

అనంతరం ప్రసంగిస్తూ గత ప్రభుత్వం రుణమాఫీ అమలు చేస్తామని పదేళ్లు కాలయాపన చేసి సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. 2004లో  కరీంనగర్‌లో సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షతనకు తెలుసుని మాట ఇచ్చి పార్టీకి నష్టం జరుగుతుం దని తెలిసి కూడా మాట తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేశారని పేర్కొన్నారు. 2022 మే 6న వరంగల్‌లో లక్షలాది మంది రైతుల సమక్షంలో రాహుల్‌గాంధీ రైతు డ్లికరేషన్ ప్రకటించారని, 2023, 17 సెప్టెంబర్‌లో తుక్కుగూడలో సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారని గుర్తుచేశారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని నాడు సోనియా, రాహుల్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పుడు సచివాలయంలో కూర్చొని ధైర్యంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.6,098 కోట్లు జమ చేశామని తెలిపారు. రుణమాఫీకి సహకరించిన మంత్రులు, అధికారులు, రైతాంగా నికి ధన్యావాదాలు తెలిపారు.

రైతులను మోసం చేసిన బీఆర్‌ఎస్

బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు పర్యాయాలు మాట తప్పిందని సీఎం ఆరోపించారు. మొదటి ఐదేళ్లలో కేసీఆర్ రూ.16 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పి రూ.12 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. రెండోసారి అధికారం చేపట్టిన తరువాత రూ.12 వేల కోట్లకు కేవలం రూ.9 వేల కోట్లు చెల్లించారని, పదేళ్ల పాలనలో రూ.21 వేల కోట్లు కూడా రుణమాఫీ చేయలేదని ధ్వజమెత్తారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నా కేసీఆర్ రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

గత ప్రభుత్వంలో ఉద్యోగులకు వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నదని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలకు ఏడు నెలల్లో రూ.29 వేల కోట్లు ఖర్చు చేశామని, గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కింద ప్రతి నెలా రూ.7 వేల కోట్లు చెల్లిస్తున్నట్లు చెప్పారు. రైతు రుణమాఫీతో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మాడల్‌గా మారబోతున్నదని అన్నారు. రుణమాఫీపై సవాల్ చేసిన నాయకుడిని పదవికి రాజీనామా చేయాలని అడగబోమని ప్రకటించారు. ఇప్పటికైనా గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదనే సంగతి వారు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ధన్యావాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు. 

మరిచిపోలేని రోజు  

తన 16 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో ఇది మరుపురాని రోజు అని, రైతులకు రుణమాఫీ చేసే భాగ్యం కలగటం ఆనందంగా ఉందని సీఎం అన్నారు. కేసీఆర్ కటాఫ్ పెట్టిన తేదీ మరుసటి దినం నుంచే రుణమాఫీ అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన సోనియాగాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 9 వరకు రుణమాఫీ కటాప్‌గా పెట్టామని తెలిపారు. మొదట లక్షలోపు రుణం ఉన్న రైతులకు విముక్తి కల్పించా మని, లక్షన్నర లోపు రుణం ఉన్న రైతులకు ఈ నెలాఖరులోగా రుణ విముక్తి కలుగుతుందని వెల్లడించారు.

ఆగస్టు నెల పూర్తి కాక ముందే రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. కొంతమంది రుణమాఫీకి రేషన్‌కార్డు ఉండాలనే అపొహ సృష్టిస్తున్నారని, రుణమాఫీకి రేషన్‌కార్డు ప్రాతిపదిక కాదని ప్రకటించారు. రుణమాఫీకి పాస్‌బుక్ మాత్రమే కొలమానమని స్పష్టంచేశారు. దొంగలు చెప్పే మాటలు రైతులు నమ్మ వద్దని సూచించారు. రుణమాఫీలో సాంకేతిక సమస్యలు వస్తే బ్యాంక్ అధికారులను సంప్రదించాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతు రుణమాఫీకి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్వయంగా రైతు అని, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క రుణమాఫీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

రైతులకు పెద్ద పండగ: భట్టి

రుణమాఫీ చేసిన రోజు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ దినమని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఒకేసారి రూ.౨ లక్షల రుణమాఫీ చేస్తున్న తెలంగాణ వైపు దేశం మొత్తం ఆశ్చర్యంగా చూస్తున్నదని తెలిపారు. ధనిక రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ చేతుల్లో పెట్టినప్పటికి రూ.లక్ష రుణమాఫీని నాలుగు విడుతల్లో ఐదు సంవత్సరాలు చేసిందని విమర్శించారు. 2018లో మరోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ రూ.లక్ష రుణమాఫీని ఐదేళ్లలో కూడా చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి రూ.7 లక్షల కోట్ల అప్పులతో తమకు అప్పజెప్పినప్పటికీ రూపాయిరూపాయి పొగేసి నిబద్ధతతో ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అమలు చేసి చూపించామని తెలిపారు. ఆగస్టు 15వ తేదీలోపు రూ.2 లక్షలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ చేసిన సవాల్‌కు అన్ని పార్టీల నాయకులు ఆశ్చర్యపోయారని అన్నారు.

లక్ష రుణమాఫీలో ఆందోల్‌దే అగ్రభాగం 

రూ.లక్ష రుణమాఫీలో రాష్ట్రంలో మొదటి స్థానంలో అందోల్ నియోజకవర్గం నిలిచింది.  ఆ తరువాత స్థానంలో హుస్నాబాద్, కల్వకుర్తి నిలిచాయి. రాష్ట్రంలోని 110 నియోజకవర్గాల పరిధిలోని (9 నగర నియోజకవర్గాల్లో రుణమాఫీ లేదు) 10,84,050 రైతు కుటుంబాలకు చెందిన 11,50,193 మంది రైతుల ఖాతాల్లో రూ.6,098.93 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.  అందోల్ నియోజకవర్గంలో 19,186 కుటుంబాలకు చెందిన 20,216 మంది రైతులకు రూ.107.83 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలో 18,101 రైతు కుటుంబాలకు చెందిన 18,907 మంది రైతులకు రూ.106.74 కోట్లు, కల్వకుర్తి నియోజకవర్గంలో 17,270 రైతు కుటుంబాలకు చెందిన 18,196 మంది రైతులకు చెందిన రూ. 103.02 కోట్లు మాఫీ అయ్యాయి.

పదిమంది రైతులకు చెక్కుల పంపిణీ

రూ.లక్ష రుణమాఫీ అయిన 10 మంది రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా చెక్కులను అందజేశారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తొమ్మిది రేకుల గ్రామానికి చెందిన మలిపెద్ది చెన్నమ్మ, జర్పుల శంకర్ (చౌలపల్లి), కందుకూరి మండలానికి చెందిన చింతకింది భిక్షపతి (లేమూరు), బండి జగదాంబ (గూడూరు), ఎర్రా అండాలు (ముచ్చెర్ల), క్యాతరమోని మల్లయ్య (పెద్ద ఎల్కచర్ల), గొడుగు చెన్నయ్య (అగిర్యాల), మారమోని యాదమ్మ (తుమ్మలూరు),  అరకోటం శారద (ముక్తమదారం), విట్యాల అండాలు (ఫరూఖ్‌నగర్), మల్లిగారి మాణిక్యరెడ్డి (గోపులారం) రుణమాఫీ చెక్కులు అందుకున్నారు. 

సీఎంకు రైతుల కృతజ్ఞతలు

రుణమాఫీ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి రైతు వేదికల వద్ద ఉన్న రైతులతో వీడియో కాన్పరెన్స్‌లో మాట్లాడారు. ఖమ్మం జిల్లా బీ వెంకటాయపాలెం నుంచి కుతుంబాక సీతారాం, నాగర్‌కర్నూల్ జిల్లా రామాపురం నుంచి రాములమ్మ, నల్లగొండ జిల్లా నుంచి తిప్పర్తి రాజు, సంగరెడ్డి నుంచి కర్రోళ్ల శివయ్య, నారాయణపేట జిల్లా ధన్వాడ నుంచి కురువ లక్ష్మి, నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి రవి, ఆదిలాబాద్ జిల్లా తాంసీ నుంచి గుర్రి మహేందర్ తదితరులు సీఎంతో మాట్లాడారు. రుణమాఫీ చేసినందుకు సంతోషం వ్యక్తం చేసిన రైతులు,  రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.