- రైతుల సంఖ్యను కుదించేందుకే మార్గదర్శకాలు
- మండిపడ్డ మాజీ మంత్రి సింగిరెడ్ది
హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): రైతులకు ఎటువంటి షరతులు లేకుండా, అందరికీ రుణమాపీ చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ..రుణమాఫీపై ప్రభుత్వ ఉత్తర్వులు లోపభూయిష్టంగా ఉన్నాయని, ఆంక్షలు లేవని సీఎం చెబుతున్నా కానీ ఎక్కడా మార్గదర్శకాలు మార్చలేదని దుయ్యబట్టారు. అబద్దపు హామీలతో అధికారం వచ్చిన తర్వాత అప్పులు, వడ్డీలు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును ఆఖరు నిమిషం వరకు అడ్డుకుని వందల మంది బలిదానాలకు కారణం అయిన చంద్రబాబు నాయుడు సైతం పదేళ్లలో తెలంగాణ దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ర్టంగా ఎదిగిందని ఒప్పుకున్నారని గుర్తు చేశారు.
రాష్ర్టంలో 60 లక్షల మంది రైతులకు బ్యాంకు ఖాతాలు ఉండగా 11 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామంటున్నారని, మిగిలిన 49 లక్షల మంది రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రైతుల గుర్తింపుకే రేషన్ కార్డు అంటున్నారని, అయితే రేషన్ కార్డు లేని రైతుల పరిస్థితి ఏంటని నిలదీశారు. రైతుకు సాయం విషయంలో వర్గీకరణ, ఆంక్షలు విధించవద్దని కోరారు. రెండు లక్షల వరకు ఉన్న రుణాలు అన్నీ ప్రభుత్వం మాఫీ చేయాలని డిమాండ్ చేసిన ఆయన రైతు కడితేనే ఇస్తాం అనడం కాలయాపన చేయడమే అన్నారు. వ్యవసాయం చేయకుండా పట్టాదారు పాస్ బుక్ కలిగి ఉండి రైతుబంధు పొంది ఉన్నట్లయితే .. అదే పాస్ బుక్ తో రుణం కూడా తీసుకుని ఉంటాడు కదా అని ప్రశ్నించారు.
కొండలు, గుట్టలు అంటూ ప్రభుత్వం నిరాధార ఆరోపణలు చేస్తుందని, రైతుభరోసా ఎగ్గొట్టి రుణమాఫీకి నిధులు మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన నాడు లేని ఆంక్షలు నేడు ఎందుకన్నారు. పట్టాదారు పాస్ బుక్ ప్రామాణికంగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ హాయంలో రెండు విడతలలో రూ.29 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని తెలిపారు. పదవిచ్చిన ప్రజలను వదిలేసి పదవులు ఉన్న నాయకులను చేర్చుకుంటున్నారని, ఆయారం, గాయారం అనే పదం వచ్చిందే కాంగ్రెస్ పార్టీ వల్ల అని ఎద్దేవా చేశారు. నాడు బీఆర్‌ఎస్ కట్టిన రైతువేదికలు ఈ రోజు కాంగ్రెస్ వేడుకలకు పనికివస్తున్నాయని, ఆనాడు వ్యతిరేకించిన రైతువేదికలు, కాళేశ్వరం, సచివాలయమే నేడు కాంగ్రెస్ పార్టీకి దిక్కయ్యాయన్నారు.