calender_icon.png 25 October, 2024 | 12:59 PM

ఆస్తి రిజిస్ట్రేషన్ చేసిస్తేనే అప్పు

29-08-2024 12:00:00 AM

  1. డీలా పడిన రియల్ ఎస్టేట్ వ్యాపారం 
  2. వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రియల్టర్లు

వికారాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లాలో వడ్డీ వ్యాపారులు రుణాల పేర అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం డీలా పడింది. గతంలో వ్యాపారంలో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రియల్టర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కొన్న భూములును అమ్మి అప్పు తీరుద్దామన్నా కొనేవారు కరువయ్యారు. దీంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయి స్తున్నారు. ఇదే అదునుగా భావించిన వడ్డీ వ్యాపారులు రియల్టర్ల ఆస్తిని తాకట్టు పెట్టుకుని అప్పు ఇస్తున్నారు. ఏ కారణం చేతనైనా అప్పు చెల్లించకుంటే మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకే ఆస్తిని తమ పేర రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు.

రూ.2 లక్షల అప్పు ఇవ్వాల్సి వస్తే ఏకంగా ప్లాట్ లేదా వ్యవసాయ భూమిని తమ పేర రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా వెయ్యి రూపాయలకు రూ.2 నుంచి రూ.3 వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. ఈ వడ్డీ పోనూ మధ్యవర్తిగా ఉండే వ్యక్తి రూ.2 లెక్కల కమీషన్ తీసుకుంటున్నాడు. దీంతో అప్పు తీసుకున్న వ్యక్తి మొత్తం గా రూ.5 చొప్పున వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. రియల్టర్లతో పాటు సామాన్యులు కూడా భూములు, బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.

తాండూరు పట్టణంలో ఎక్కువగా బంగారం తనఖా పెట్టుకొని అప్పులు ఇస్తున్నారు. ఇక్కడ వెయ్యి రూపాయలకు నెలకు రూ.5 లెక్కల వడ్డీ తీసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం రూ.2 వేలు అప్పు తీసుకున్న వ్యక్తి రూ.5 చొప్పున వడ్డీ చెల్లించలేదని వ్యాపారి దారుణంగా కొట్టిన సంఘటన జరిగింది. వికారా బాద్, పరిగిలో అప్పు కింద ప్లాట్లు, భూము లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టి అమ్ముడు పోక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వ్యాపారులు గత్యంతరం లేక వడ్డీ వ్యాపారులకు ప్లాట్లను వదిలేసుకుంటున్నారు.