calender_icon.png 1 April, 2025 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వశక్తి సంఘాల సభ్యులకు లోన్ బీమా, ప్రమాద బీమా వర్తింపు

28-03-2025 12:00:00 AM

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు 

నిజామాబాద్, మార్చి 27 :(విజయ క్రాంతి): రాష్ట్రంలోని మహిళా స్వశక్తి సంఘా ల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం లోన్ బీమా,  ప్రమాద బీమా సౌకర్యాన్ని వర్తింపజేస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. గురువారం సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ తో కలిసి పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన సందర్భంగా బీమా పథకాల గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత జిల్లా అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు.

బీమా సదుపాయం వివరాలను స్వయం సహాయక సంఘాల సభ్యులందరికి తెలియజేయాలని, చనిపోయిన సభ్యుల వివరాలను ఆన్లైన్ లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సెర్ప్, మెప్మా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. లోన్ బీమా, ప్రమాద బీమా వివరాలను, వాటి ప్రయోజనాల గురించి కలెక్టర్ వివరించారు. లోన్ బీమా : స్వయం సహాయక సంఘం సభ్యులుగా ఉండి  (18  60 సంవత్సరాలు) బ్యాంకు లోన్ తీసుకొని సహజ మరణం పొందినట్లయితే, అట్టి మహిళ మరణించిన తర్వాత చెల్లించవలసిన అప్పు నిల్వ మొత్తాన్ని వారి తరపున ప్రభుత్వమే బ్యాంకుకు చెల్లిస్తుందన్నారు. ఇట్టి మొత్తం 2 లక్షలకు మించ కుండా చెల్లించడం జరుగుతుందన్నారు.

ఈ బీమాకు సంబంధించిన ప్రీమియం మొత్తా న్ని రాష్ట్ర ప్రభుత్వం భీమా సంస్థకు చెల్లించడం జరిగిందని కలెక్టర్ వివరించారు.  ప్రమాద బీమా : స్వయం సహాయక సంఘం సభ్యులుగా ఉండి  ప్రమాదవశాత్తు మరణించినట్లయితే లోన్ బీమా క్రింద రూ. 10 లక్షల ఇన్సూరెన్సు మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఎవరైనా ప్రమాదం జరిగి శాశ్వత వైకల్యానికి గురైతే రూ.10 లక్షలు, యాభై శాతం  వైకల్యం సంభవించినట్లయితే రూ.5 లక్షల ఇన్సూరెన్స్ మొత్తాన్ని చెల్లించడం జరుగుతుందన్నారు. ఈ రెండు బీమా సౌకర్యాలు గత సంవత్సరం 2024 మార్చి 14 వ తేదీ నుండి అమలులోకి వచ్చాయని తెలిపారు.

ఈ బీమా పథకాల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇటీవలి కాలంలో మరణించిన స్వయం సహాయక సంఘాల సభ్యుల వివరాలను ఆన్ లైన్లో నమోదు చేయడంతో పాటు చనిపోయిన సభ్యుల క్లెయిమ్ డాక్యుమెంట్స్ ను వెంటనే ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలన్నారు. బీమా పథకాల ద్వారా జిల్లాలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా కృషి చేయాలని డీఆర్డీఓ సాయాగౌడ్, మెప్మా పీ.డీ రాజేందర్ లకు సూచించారు.