ఐ.వి.మురళీకృష్ణ శర్మ :
రుణమాఫీతో తమది రైతు అనుకూల ప్రభుత్వమని నమ్మించ డానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. దీనికోసం భారీ ఎత్తున ప్రకట నలకు, సంబరాలకు కోట్ల రూపాయలను మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నది. మొదటి విడతలో చేసిన మాఫీతో అన్నదాతలందరూ తమ ప్రభుత్వాన్ని ఆదరిస్తారని కాంగ్రెస్ భావిస్తున్నది. ప్రభుత్వం ప్రకటించిన ఈ రుణమాఫీ సంపూర్ణంగా లేకుండా ఒక మాయాజాలంగా కనిపిస్తున్నది. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ ఎలాంటి షరతులు లేకుండా వంద శాతం పారదర్శకతతో అమలు చేస్తేనే రైతులు హర్షిస్తారు. కొసరు మాఫీకే హడావుడి చేసేకన్నా చిత్తశుద్ధితో హామీ ఇచ్చినట్టు సంపూ ర్ణంగా రుణమాఫీ చేస్తే రైతన్నల ఆదరణ చూరగొంటారు, లేకుంటే ఆన్నదాతల ఆగ్రహానికి గురవుతారు.
కాంగ్రెస్ నాయకుల మాటలు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉ న్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ ‘వరంగల్ డిక్లరేషన్’లో తీర్మానం చేసింది. పార్టీ దీన్ని ‘అభయ హస్తం’ మేనిఫెస్టోలోనూ పొందుపరిచి రైతాంగానికి లిఖిత పూర్వక హామీ ఇచ్చింది. రుణమాఫీకి సంబంధించి అర్హతలు, షరతులు ఉంటాయని అప్పుడు మేనిఫెస్టోలో ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు అమలు చేసేటప్పుడు మాత్రం అనేక షరతులు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం.
స్పష్టత ఇవ్వలేని పరిస్థితులు
రేషన్ కార్డు ఉన్నవారికే మాఫీ అని ఒకసారి, పాస్ పుస్తకం ఉన్నవాళ్లకే మాఫీ అని మరోసారి, కుటుంబంలో ఒక్కరికే మాఫీ అంటూ ఇంకోసారి ఇలా రకరకాల మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిబంధనలవల్ల పెద్దసంఖ్యలో రైతులు రుణమాఫీకి అనర్హులవుతారని విమర్శలు రావడంతో, రుణమాఫీకి రేషన్ కార్డు ప్రా మాణికం కాదని, పట్టాదార్ పాస్ పుస్తకం ఉన్న ప్రతి ఒక్కరికీ రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.
తీరా అమలు చేసేటప్పుడు మాత్రం వాళ్లు అనుకున్నదే చేశారు. సరైన సమాచారం ఇవ్వ కుండా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేశారు. దీంతో లిస్టులో తమ పేరు ఎందుకు రాలే దో, ఎందుకు తమ ఖాతాలో డబ్బు లు జమ కాలేదో తెలుసుకోవడానికి లక్షలాదిమంది రైతులు బ్యాంకులు, సొసైటీలు, వ్యవసాయ అధికారుల ఆఫీసుల చుట్టూ తిరుగుతూ పడిగాపులు కాసే దుస్థితి వచ్చిం ది. ప్రభుత్వం రుణమాఫీపై ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్స్‌కు భారీగా వస్తున్న రైతుల సంఖ్యను చూస్తే ఎంతమంది ఆవేదన చెందుతున్నారో అర్థమవుతుంది. గ్రీవెన్స్ సెల్స్‌లలో అధికారులు సైతం రుణమాఫీపై రైతులకు స్పష్టత ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి.
క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం రైతు లు వివిధ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు రెండు రకాలుగా ఉన్నాయి. ప్రతి సంవత్స రం వడ్డీ కట్టి లోన్ రెన్యువల్ చేసుకున్న వారు ఒక వర్గం రైతులు కాగా, విడతల వారీగా రుణమాఫీ చేస్తామన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నమ్మి రుణాలకు వడ్డీలు చెల్లించక పోవడంతో అసలు కన్నా వడ్డీలే ఎక్కువ కట్టాల్సిన రైతులు రెండో వర్గంలో ఉన్నారు. రెండో వర్గం రైతులు చెల్లించాల్సిన రుణాలను బ్యాంకు వాళ్లు ‘మొండి బకాయిలు’ అని పిలుస్తున్నారు.
వడ్డీలు తడిసి మోపెడు
ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి న రుణమాఫీలో క్రమం తప్పకుండా రెన్యువల్ చేసిన రైతులకు లక్ష రూపాయిల వర కు లబ్ధి జరిగింది. కానీ, తీసుకున్న రుణం లక్షలోపే అయినా వడ్డీలతో లక్ష దాటి, మొండి బకాయిల జాబితాలోకి వెళ్లిన రెండో వర్గం రైతులకు రుణమాఫీ జరగలేదు. అదే నెలలో రేవంత్‌రెడ్డి ఎన్నికల సందర్భంగా మాట్లాడుతూ, ‘రైతులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా! ఇప్పుడు రుణమాఫీ అయినోళ్లు వెంటనే బ్యాంకుకు పోయి మళ్లీ రూ.2 లక్షల రుణం తీసుకోండి. డిసెంబర్ 9న నేను మాఫీ చేస్తా..’ అని ప్రకటించారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో కూడా నాడు 10 నెలల కింద లబ్ధి పొందిన రైతులకే మళ్లీ రుణమాఫీ జరిగినట్లు జాబితా లున్నాయి.
లక్షలోపు రుణమాఫీ అయిన రైతుల్లోనూ చాలామందికి అసలు మాఫీ అయ్యి, వడ్డీ అలాగే ఉండటంతో ప్రభుత్వం చెప్తుంది తప్పని తెలుస్తుంది. 2018 వరకు తీసుకున్న రుణాలను కేసీఆర్ సమయానికి మాఫీ చేయక పోవడం వల్ల నాడు వడ్డీలు పెరిగాయి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నాన్చు డు ధోరణితో రైతుమాఫీ తేదీని డిసెంబర్ 9 నుంచి ఆగస్టు 15 వరకు లాక్కురావడం వల్ల కూడా చాలామంది వడ్డీలు కట్టలేదు. కాంగ్రెస్ రుణమాఫీ హామీని నమ్మి, రుణాలను చెల్లించక పోవడంతో రైతుల వడ్డీలు తడిసి మోపెడయ్యాయి.
రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లో మాయాజాలం ఉంది. తెలంగాణలో వ్యవసాయ రుణాల ఖాతాల సంఖ్య 64,90,228. వీటిద్వారా రైతులు తీసుకున్న రుణం మొత్తం రూ.79,387 కోట్లు. అంటే, తెలంగాణలో రైతులు రుణ విముక్తులు కావాలంటే రూ.79,387 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ, తాజా గా విడుదల చేసింది కేవలం రూ.6,098 కోట్లు. చేయాల్సిన దానిలో పదో వంతు కూడా చేయలేదు. రూ.లక్షలోపు రుణం తీసుకున్న 11 లక్షల రైతులకు రుణాలు మాఫీ చేస్తామన్నారు. తెలంగాణలో రూ. లక్షలోపు రుణం తీసుకున్న రైతులు 40 లక్షల పైనే ఉన్నారు. అంటే, 30 లక్షలమంది రైతులకు కాంగ్రెస్ కుచ్చుటోపీ పె ట్టింది. ఆగస్ట్ 15 వరకు రూ. 31 వేల కోట్లు విడుదల చేస్తామంటున్నారు. అయినా, సగం రైతుల రుణాలకూ ఇది సరిపోదు.
రైతులకు పూర్తిగా న్యాయమే చేయలేదు కానీ, అన్నీ చేశామన్నట్టుగా హడావుడి చేస్తూ ఇప్పుడు ప్రజాధనాన్ని వృథా చేయడానికి వరంగల్లులో ‘కృతజ్ఞత సభ’కు తెర లేపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రకటనలు, సంబరాల కోసం ప్రజానిధులు ఖ ర్చు చేస్తున్నారని విమర్శించిన రేవంత్‌రెడ్డి, అధికారంలోకి వచ్చాక అదే బాటలో నడుస్తున్నారు. న్యూస్ పేపర్లలో ఫుల్ పేజీ యా డ్లు, టీవీ చానళ్లు, డిజిటల్ మీడియాలో యాడ్లు, పెయిడ్ న్యూస్, క్షీరాభిషేకాల హడావుడి చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవికత కన్నా ప్రచారానికే అధిక ప్రాధాన్యమిస్తున్నట్లుంది.
‘రైతు ప్రభుత్వం’ కావాలంటే..
2018 డిసెంబర్ 12న లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు సంబంధించి 2023 డిసెంబర్ 9 నాటికి బకాయి ఉన్న ప్రతి పంట రుణానికి రుణమాఫీ అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఇందుకోసం రైతు సం ఘాలు, మేధావులతో చర్చలు జరిపి పారదర్శకంగా రైతులందరికీ మేలు జరిగేలా రుణమాఫీ అమలు చేయాలి. రుణమాఫీ తర్వాత కాంగ్రెస్ ‘అభయహస్తం’ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా రూ.3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను అందజేసి రైతులను ఆదుకోవాలి. భూమి ఉన్న రైతుల తోపాటు కౌలురైతులకూ ‘ఇందిరమ్మ రైతు భరోసా’ కింద ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు పెట్టుబడి సాయం అందించాలి. రైతుకూలీలకు ఏడాదికి రూ.12 వేలు చెల్లించాలి.
లేదంటే, వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీ అప్పుల్లో అన్నదాతలు చిక్కుకోవడం ఖాయం. ఇవన్నీ పూర్తి చేస్తేనే ‘మాది రైతు ప్రభుత్వం’ అని కాంగ్రె స్ నిరూపించుకోగలుగుతుంది. రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా, పంటలకు మద్దతు ధర అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా రైతులకు పలు హామీలిచ్చింది. ఇవి రైతులకు దక్కాల్సిన న్యాయమైన హక్కులు. కాంగ్రెస్ ఇచ్చిన ఈ హామీలన్నింటినీ సం పూర్ణంగా అమలు చేస్తేనే రైతులు హర్షిస్తా రు. వారు ఆనందంగా ఉన్నంత వరకే ప్రభుత్వాలు ఇబ్బందులు లేకుండా అధికారంలో ఉంటాయి. అలా కాకుండా, ‘అధికారం మాదే. మేమేమీ చేసినా చెల్లుతుంది’ అనే భావనతో వ్యవహరిస్తే అన్న దాతలు, ప్రజ లు ‘కాలంబు రాగానే కాటేసి తీరుతారు’!
వ్యాసకర్త పొలిటికల్ అనలిస్ట్,
‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ