calender_icon.png 31 October, 2024 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎడారిని తలపిస్తున్న ఎల్‌ఎండీ

31-07-2024 03:16:45 AM

  1. కరీంనగర్ నీటి సరఫరాకు అంతరాయం 
  2. 24 టీఎంసీల నిల్వకు 5.36 టీఎంసీలే..

కరీంనగర్, జూలై 30 (విజయక్రాంతి): కరీంనగర్ తలాపున ఉన్న ఎల్‌ఎండీ ఎడారిని తలపిస్తున్నది. 24 టీఎంసీల సామర్థ్యం గల లోయర్ మానేరు డ్యాంలో ప్రస్తుతం 5.36 టీఎంలు మాత్రమే ఉన్నాయి. 206 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తున్నది. వానకాలం ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఒక్క టీఎంసీ కూడా రాని పరిస్థితి. ఎగువన మధ్యమానేరులో సైతం అదే పరిస్థితి నెలకొనగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కాళేశ్వరం పంపుల ద్వారా నీటిని తరలిస్తున్నారు. ప్రస్తుతం మిడ్‌మానేరులో ౮.౮౪ టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. గోదావరి గలగల పారుతున్నా మానేరు వెలవెలబోతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. దీని పరివాహకం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మీదుగా వరంగల్ వరకు 6,648 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. 1.63 లక్షల హెక్టార్లకు నీరందించే సామర్థ్యం ఉంది. 

వరద కాలువే దిక్కు

ఎల్‌ఎండీకి నీటి ప్రవాహం కొనసాగాలంటే మోయతుమ్మెద వాగుతో పాటు ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా నీరు రావాల్సి ఉంటుంది. ఎగువన వర్షాలు లేక ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల లేదు. మో యతుమ్మెద వాగు సైతం బోసిపోయింది. కరీంనగర్ జిల్లాలో వర్షపాతం కూడా తక్కువగా నమోదయింది. వర్షపాతం ఇలాగే కొనసాగితే వచ్చే రబీకే కాకుండా వర్షాకాలం పంటలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 

కరీంనగర్‌లో నీటికి కటకట

వేసవిలో తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొన్న కరీంనగర వాసులకు వర్షాకాలం లోనూ కటకట తప్పడం లేదు. 24 గంటల నీటి సరఫరా అటుంచితే రెండు రోజులకోసారి నీరు అందించలేని పరిస్థితిలో నగరపాలక సంస్థ ఉంది. గత మూడేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈ సమస్యను నగరవాసులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మిడ్ మానేరు జలాశయం నుంచి ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. ప్రస్తుతం మిడ్ మానేరులో కూడా నీటి నిల్వలు లేకపోవడంతో సమస్య తలెత్తింది. ఎల్‌ఎండీలో నీటి నిల్వలు లేక ఫిల్టర్ బెడ్లకు కూడా నీరు అందడం లేదు. ఫిల్టర్ బెడ్‌లో 63 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్స్ ఫర్ డే) శుద్ధి చేసే సామ ర్థ్యం ఉంది. ప్రస్తుతం ఎల్‌ఎండీలో ఐదు టీఎంసీల నీరు మాత్రమే ఉండటంతో రావాటర్ తీసుకురావడానికి బూస్టర్ పంపులను వినియోగిస్తున్నారు. దీనివల్ల 40 నుం చి 50 ఎంఎల్‌డీ నీరు మాత్రమే వస్తుంది. ఈ నీటినే ఫిల్టర్ చేసి సరఫరా చేస్తున్నారు.  

9 టీఎంసీలు ఉంటేనే నీటి సరఫరా సాధ్యం

కరీంనగర్ నగరానికి తాగునీరందించే ఎల్‌ఎండీలో ప్రస్తు తం 5 టీఎంసీల నీరే ఉన్నది. దీంతో నగర ప్రజలకు రోజు విడిచి రోజు నీరు అందిస్తున్నాం. నీటి మట్టం 9 టీఎంసీలకు చేరుకుంటేనే ప్రతిరోజు సరఫరా చేయవచ్చు. మరో ఒకటి, రెండు నెలలు ఈ పరిస్థితి ఉండవచ్చు. నగరవాసులు తాగునీటిని పొదుపుగా వాడుకొని నగరపాలక సంస్థకు సహకరించాలి. 

 సునీల్‌రావు, 

మేయర్, కరీంనగర్