భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): వ్యవసాయ కార్మికులకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికి రూ.12 వేల జీవన భృతి వెంటనే చెల్లించాలని, వ్యవసాయ కార్మికుల పిల్లలకు ఉచిత విద్య, వైద్యం అందించాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో వ్యవసాయ కార్మిక కుటుంబాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ల పూడి రాము ,సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి ముద్దావిక్షం ప్రభుత్వాన్ని కోరారు.
వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా సోమవారం నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను వ్యవసాయ కార్మికులకు రూ.12 వేల జీవన భృతి ఇస్తామని హామీ ఇచ్చి సంవత్సర పూర్తి అవుతున్న కనీసం ఉసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా 6 గ్యారంటీలను అమలు చేయాలని లేకపోతే సంఘం ఆధ్వర్యంలో కార్మిక ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ జితేష్ వి పాటిల్ కి అందజేశారు.