calender_icon.png 25 September, 2024 | 7:25 PM

సజీవ సాక్ష్యం.. అమరవీరుల స్థూపం

25-09-2024 12:00:00 AM

మలిదశ తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ నడిబొడ్డున ఏర్పాటుచేసిన తెలంగాణ అమరవీరుల స్థూపం సజీవ సాక్ష్యంగా నిలిచింది. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని 2001లో అప్పటి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రారంభించిన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కరీంనగర్ జడ్పీ పీఠాన్ని టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది.

చైర్మన్‌గా కేవీ రాజేశ్వర్‌రావు బాధ్యతలు స్వీకరించిన అనంతరం తెలంగాణ ఉద్యమవ్యాప్తిని దశదిశలా వ్యాప్తిచెందేందుకు తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని కరీంనగర్ నడిబొడ్డున వేంకటేశ్వర దేవస్థానం సమీపంలో నిర్మించాలని నిర్ణయించారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో అమరవీరుల స్థూపం శంకుస్థాపన ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగింది.

ఈ సందర్భంగా పలువురు నేతలు, కార్యకర్తలు పోలీస్ కేసులను ఎదుర్కొన్నారు. ఇందులో అప్పటి యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన ఏవీ మహిపాల్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. స్థూపం పనులు ప్రారంభించిన అనంతరం కూడా పలుమార్లు అప్పటి ప్రభుత్వం అడ్డంకులు కల్పించింది. నాలుగు సంవత్సరాల్లో ఈ స్థూపాన్ని పూర్తి చేయగలిగారు.

ఈ స్థూపాన్ని కేసీఆర్ ప్రారంభించి స్థూపం వద్ద ఒక ధర్మగంటను ఏర్పాటుచేసి ఉద్యమ శంఖారావం పూరించారు. ప్రతిరోజు ఈ ధర్మగంటను మోగించి అమరవీరుల స్థూపం వద్ద నుంచి ఉద్యమ కార్యక్రమాలను ప్రారంభించారు. తెలంగాణ సాధనలో అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పాత్ర ఎంత కీలకమైందో, ఈ అమరవీరుల స్థూపం పాత్ర కూడా అంతే ముఖ్యమైందని చెప్పవచ్చు. 

నిర్మించారు, కానీ పట్టించుకోలేదు!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరవీరుల స్థూపాన్ని పట్టించుకోలేదు. ఈ స్థూపానికి ఏర్పాటు చేసిన గ్రానైట్ రాయి పెచ్చులూడినా మరమ్మత్తులు కూడా చేయలేదు. రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా పూలదండలు, లైట్ల ఏర్పాటు తప్ప ఈ స్థూపం ఎలాంటి ఆధునీకరణకు, మరమ్మత్తులకు నోచుకోలేదు. 

ఇచ్చిందేమి లేదు

తెలంగాణ కోసం ఉద్యమించిన నాయకులకు గత ప్రభుత్వం ఎలాంటి పదవులు కానీ, ఉపాధి అవకాశాలు కానీ కల్పించలేదు. ఈ స్థూపాన్ని నిర్మించేందుకు ఆర్థిక వనరులు సమకూర్చిన అప్పటి జడ్పీ చైర్మన్ దివంగత కేవీ రాజేశ్వర్‌రావుకు జడ్పీ చైర్మన్ పదవి కాలం ముగిసింది. అనంతరం రాష్ట్రం ఏర్పడిన అనంతరం సముచిత స్థానం దక్కుతుందని ఉద్యమకారులు భావించారు.

అయితే స్వరాష్ట్రంలో ఆయన ఏ పదవి అనుభవించకుండానే స్వర్గస్తులైనారు. ఈ అమరవీరుల స్థూపం ఏర్పాటుకోసం పోరాటం చేసిన యువజన నాయకుల్లో ఒకరైన ఏవీ మహిపాల్‌రెడ్డి అనారోగ్యానికి గురై పక్షవాతంతో మంచానపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆయనను, ఆయన కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం కూడా పాలకులు చేయలేదు. 

 విజయసింహారావు, కరీంనగర్