మా ప్రాణాలు తీసినా భూములు ఇవ్వం
పోలీసులు అర్ధరాత్రి చొరబడి దాడులు చేశారు
జాతీయ ఎస్టీ, ఎస్టీ కమిషన్‌కు లగచర్ల బాధితుల ఫిర్యాదు
ఇప్పటికీ అరెస్టులు చేస్తున్నారు: మాజీమంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి) : ఇంట్లో ఉండాలంటేనే భయమవుతోందని.. పోలీసులు ఎప్పుడొచ్చి ఏం చేస్తారోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని లగచర్ల బాధిత మహిళలు పేర్కొన్నారు. లగచర్లలో పోలీసుల సృష్టించిన అరాచకాలపై బాధితులు సోమవారం ఢిల్లీలోని జాతీయ మానవహక్కుల, ఎస్టీ,ఎస్సీ, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఫార్మా కంపెనీ కోసం భూములు ఇవ్వమని 9 నెలలుగా ధర్నా చేసినప్పుడు సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి, కలెక్టర్ సహా ఏ అధికారి తమ వద్దకు రాలేదన్నారు. ఇటీవల కలెక్టర్ సాధారణ దుస్తుల్లో సెక్యూరిటీ లేకుండా వచ్చారని, దీంతో కొందరు పిల్లలు తెలియకుండా దాడి చేశారని పేర్కొన్నారు.
ఆ దాడిని సాకుగా చూపి 500మంది పోలీసులు అర్ధరాత్రి తమ ఊళ్లోకి చొరబడి కరెంట్ బంద్ చేసి తమపై దౌర్జన్యం చేశారన్నారు. గొంతులు బిగ్గరగా పట్టుకుని, కళ్లకు బట్టలు కట్టి ఇష్టానుసారం బూతులు తిడుతూ చితకబాదారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మగవాళ్లను అరెస్టు చేశారని, మిగిలిన కొందరు పారిపోయి ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్నారని తెలిపారు. వారం రోజులుగా కనిపించని మా పిల్లలను కూడా తీసుకెళ్తామని వారు బెదిరిస్తున్నారన్నారు.
గిరిజనుల భూముల జోలికి రావొద్దు: మాజీ ఎంపీ కవిత
కొన్నేళ్లుగా భూముల మీదే ఆధారపడి బతుకుతున్నామని.. ఇప్పుడు వచ్చి తీసుకుంటామంటే ఎలా బతకాలని వారు ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో తాము ప్రశాంతంగా బతికామని.. గత 9 నెలలుగా ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. మా ప్రాణాలు తీసినా ఫార్మాకు భూములివ్వమని తెగేసి చెప్పారు. సీఎంను కలిసేందుకు వెళ్తే అటువైపు రావొద్దని హెచ్చరించినట్లు చెప్పారు. బాధితుల వెంట బీఆర్‌ఎస్ ఎంపీలు కెఆర్ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్‌రావు, ఎమ్మెల్యే లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రనాయక్, హరిప్రియనాయక్, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఉన్నారు.
ఇబ్బందులు పెడితే సహించం: మాజీ ఎంపీ కవిత
వారసత్వంగా వచ్చిన భూములను ఫార్మా కంపెనీ కోసం ఇవ్వాలని బెదిరించడం సరికాదని మాజీ ఎంపీ మాలోతు కవిత పేర్కొన్నారు. ఫార్మా సిటీ కోసం గత ప్రభుత్వం భూములు సేకరించిందని, అది కాదని గిరిజనుల భూములను రేవంత్ లాక్కుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్లలో తండావాసులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. గిరిజనుల భూముల జోలికి రావొద్దని ప్రభుత్వానికి సూచించారు. లగచర్ల బాధిత గిరిజనులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అఘాయిత్యాలకు పాల్పడ్డారు : మాజీమంత్రి సత్యవతి
లగచర్లలో గిరిజనులపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆరోపించారు. భూములు ఇవ్వమని చెబుతున్నా.. తీసుకుంటామని చెప్పడంతో ఆవేశంలో కొందరు రైతులు దాడి చేసినట్లు వివరించారు. దానికి సాకుగా చూపి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని, కరెంట్ తీసి.. ఇంటర్‌నెట్ బంద్ చేసి హింసించారన్నారు. బాధితులకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇప్పటికీ పోలీసులు గ్రామంలోకి వచ్చి అరెస్ట్‌లు చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో మాత్రమే న్యాయం జరుగుతుందని భావించి ఇక్కడకు వచ్చి ఎస్సీ, ఎస్టీ, మహిళ, జాతీయ మానవహక్కుల కమిషన్‌ను కలిసి పోలీసుల అఘాయిత్యాలపై ఫిర్యాదు చేశామన్నారు.