calender_icon.png 28 October, 2024 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎడారి దేశాల్లో తడారుతున్న బతుకులు!

13-08-2024 03:45:18 AM

  1. నరకానికి నకళ్లుగా మారుతున్న గల్ఫ్ దేశాలు
  2. కామారెడ్డికి చేరిన మరో రెండు మృతదేహాలు
  3. 45 రోజుల అనంతరం స్వగ్రామానికి..  
  4. ఎన్నారై పాలసీ తేవాలంటున్న బాధిత కుటుంబాలు

కామారెడ్డి,ఆగస్టు 12 (విజయక్రాంతి): ఇంటికి ఆసరాగా ఉండి అప్పులు తీర్చాలన్న ఆశ.. పిల్లల్ని మంచిగా చదివించాలన్న ఆకాంక్ష.. ఊరికి దూరంగా వెళ్లి తాను కష్టపడ్డా.. తమ కుటుంబం బాగుపడాలని గల్ఫ్ బాటపట్టే సగటు వలసజీవి ఆశిస్తాడు. అయితేఎడారి దేశాలకు వెళ్లిన కొద్ది రోజులకే అక్కడి వాతావరణం తట్టుకోలేక తల్లడిల్లుతున్నారు. ఈ క్రమంలోపలువురు అక్కడే శ్వాస వదులుతున్నారు. గత నెలలో కామారెడ్డి జిల్లావాసులు ఇద్దరు గల్ఫ్‌లో మృతిచెందగా, అంతకుముందు చనిపోయిన మరో ఇద్దరి మృతదేహాలు గల్ఫ్ నుంచి స్వగ్రామాలకు చేరాయి. ఒకరి శవం 45 రోజులకు స్వగ్రామానికి రాగా మరొకరిది 47 రోజులకు చేరింది. 

ఏజెంట్ల మోసాలకు బలి 

గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లాలంటే సరైన పద్ధతిలోనే అనుమతులు, పత్రాలతోనే వెళ్లాలి. కానీ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల అమాయకత్వాన్ని, అవగాహనలేమీని ఆసరాగా చేసుకుని నకీలీ ఏజెం ట్లు చెలరేగుతున్నారు. బతుకుదెరువు కోసం వెళ్తున్న వారు ఏ వీసా మీద వెళ్తున్నారో తెలియట్లేదు. అలా వెళ్తే ఏంజరుగుతుందో కూ డా అవగాహన లేదు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారిలో ఎక్కువ మంది కేంద్ర ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోరు. దీంతో ఎంబసీ నుంచి సరైనా సమయంలో సహకారం అందకుండా పోతుంది. 

గొర్రెలు, ఒంటెల కాపరులుగా..

గల్ఫ్ దేశాలకు వెళ్లగానే సాధారణంగా పాస్‌పోర్టులను యజమానులు తీసుకుంటారు. కొంతమంది యజమానులు బాగానే ఉన్నా.. చాలా మంది కార్మికులను ఇబ్బందులు పెడతారు. కొందరు తిండి కూడా సరిగ్గ పెట్టరు. కుటుంబీకులతో ఫోన్‌లో మాట్లాడనివ్వరు. ఎలాగోలా తప్పించుకొని పారిపోయి బయటకు వస్తే పాస్‌పోర్ట్ లేని కారణంలో పోలీసులు వెంటనే అరెస్టు చేస్తుంటారు. చాలామంది ఎడారుల్లో గొర్రెలు, ఒంటెల కాపరులుగా ఒంటరిగా మగ్గిపోతున్నారు. ఉండాటానికి నీడలేక ఏడారుల్లో వేసే గుడారాల్లో ఏళ్ల తరబడి ఉండిపోతున్నారు.

చివరకు ఆ గొర్రెలకు పెట్టే ఆహారాన్ని తింటూ పొట్ట గడుపుకునే వారెందరో ఉన్నారు. అక్కడ పెట్టే టార్చర్‌తో కొంతమంది మృతిచెందగా మరికొందరు హత్యలకు గురవుతున్నారు. చాలామంది ఆనారోగ్యంతో చనిపోతున్నారు. కొన్ని మృతదేహాలు స్వగ్రామం చేరుతుండగా, పాస్‌పోర్టు లేని మృతదేహలు అనాథ శవాలుగా అక్కడే ఉండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలో గుర్తింపులేని ఏజెంట్లు ఎక్కువ మంది ఉన్నారు. వీసా వచ్చిన వెంటనే దాన్ని ఏజెంట్‌తో కాకుడా మరొకరితో అవసరమైతే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి క్రాస్ చెక్ చేయించుకోవాలి. గ్రామీణ ప్రాంతం వారికి అరబిక్, ఇంగ్లిష్ రాకపోవడంతో ఏజెంట్లు దానిని క్యాష్ చేసుకుంటున్నారు. 

ఉత్తర తెలంగాణ నుంచే ఎక్కువ.. 

ఉత్తర తెలంగాణలోంచే గల్ఫ్ దేశాలకు అత్యధికంగా వలస వెళ్తున్నారు. ముఖ్యంగా కామారెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, వేములవాడ, బాల్కొండ, జగిత్యాల, సిరిసిల్ల తదితర 21 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎక్కువ మంది బతుకుదెరువుకు వెళ్తున్నారు. తప్పుడు ఏజెంట్ల వలలో పడి వెళ్లిన కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. చిన్నచిన్న నేరాలకే చాలామంది ఏళ్ల తరబడి గల్ఫ్ దేశాల్లోని జైళ్లలో మగ్గి పోతున్నారు. ఏదైనా కారణంతో చనిపోయినా మృతదేహలు స్వదేశానికి రావడం లేదని, ఏజెంట్ వ్యవస్థను క్రమబద్ధీకరించడం ద్వారా డమ్మీ కంపెనీల మోసాలు అరికట్టవచ్చని గల్ఫ్‌లోని కార్మిక సంఘాల ప్రతినిధులు అంటున్నారు. గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఈ సమస్యలకు చెక్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.

అద్దె ఇంట్లో భార్యాపిల్లలు.. సౌదీలో మృతి

కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన సుతారి ప్రభాకర్ 2024 జూన్ 17న సౌదీకి వెళ్లాడు. వారం రోజులకే ప్రభాకర్ చనిపోయాడు.  అక్కడి పరిస్థితులు అనుకులించక మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభాకర్‌కు భార్య సుగుణ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దకుమార్తె మానస దోమకొండ గురుకుల పాఠశాలలో 9వ తరగతి, చిన్న కుమార్తె సాహితి నాలుగో తరగతి చదువుతుంది. స్వంత ఇల్లు లేని ప్రభాకర్ భార్యాపిల్లలను అద్దె ఇంట్లో ఉంచి సౌదీకి వెళ్లాడు.

వెళ్లిన వారం రోజులకే మృతిచెందారనే కబురు రావడంతో ఆ కుటుంబ తల్లడిల్లిపోయింది. మృతదేహాన్ని ఎలాగైనా గ్రామానికి పంపించండని తెలిసిన వారిని ప్రాదేయపడగా, 47 రోజుల తర్వాత గత శనివారం స్వగ్రామానికి వచ్చింది. ఇలాంటి ఘటనలు నిత్యం ఎదురవుతున్న ప్రభుత్వాలు మాత్రం పట్టింపులేనట్టు వ్యవహరిస్తున్నాయి. ఒక నెలలోనే నాలుగు గల్ప్ శవాలు కామారెడ్డికి చేరుకోవడం గల్ప్ బాధిత కుటుంబాలను తీవ్రంగా కలిచివేస్తుంది. ఇప్పటికైన ప్రభుత్వం ఎన్నారై పాలసీని అమలు చేయాలని బాధిత కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.  

కడసారి చూపునకు 45 రోజులు 

పొట్టకూటి కోసం ఎడారి దేశం వెళ్లిన వారి కష్టాలకు, కన్నీళ్లకు అంతే లేకుండాపోతోంది. కామారెడ్డి జిల్లా షాబ్దిపూర్‌కు చెందిన మహమ్మద్ షరీఫ్(42) సౌదీకి వెళ్లిన నాలుగు రోజులకే చనిపోయాడు. అక్కడే ఉన్న తెలిసిన వారిని షరీఫ్ శవాన్ని స్వగ్రామానికి పంపించాలని అతని భార్య ఫాతిమా, పిల్లలు వేడుకొనడంతో 45 రోజుల తర్వాత శవం గ్రామానికి వచ్చింది. అతని కొడుకు గల్ప్‌లోనే ఉన్నా అతడు పనిచేసే కంపెనీ అనుమతి ఇవ్వకపోవడంతో తండ్రి కడసారి చూపునకు నోచుకోలేదు. కనీసం ఇప్పుడైన స్వదేశానికి పంపించాలని షరీఫ్ కుమారుడు మున్నా వీడియోలో వేడుకుంటూ సందేశం పంపించారు. ఒక వైపు భర్తను పొగోట్టుకోవడం, మరోవైపు పెద్ద కుమారుడు గల్ప్‌లో చిక్కుకుపోవడం ఆ కుటుంబానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. కొడుకు లేకుండానే భర్తకు అంతక్రియలు నిర్వహించారు.