calender_icon.png 25 November, 2024 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ వైద్యునికి కాలేయ మార్పిడి విజయవంతం

27-09-2024 03:03:04 AM

  1. కార్పొరేట్ స్థాయి సర్జరీని ఉచితంగా పూర్తిచేసిన ఉస్మానియా వైద్యులు
  2. బ్రెయిన్‌డెడ్ వ్యక్తి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసి ప్రాణం పోసిన డాక్టర్లు

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): కాలేయం పూర్తిగా చెడిపోయి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ ప్రభుత్వ  వైద్యుడికి ఉస్మానియా జనరల్ దవాఖాన వైద్యులు విజయవంతంగా కాలే య మార్పిడి చేశారు. ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి చెందిన సర్జికల్ గ్యాస్ట్రో విభాగాధిపతి డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలోని వైద్య బృందం ఇప్పటివరకు ఉస్మానియాలో 31 కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు. సాధారణంగా కార్పొరేట్ ఆసపత్రుల్లో మాత్రమే సాధ్యమయ్యే ఈ సర్జరీకి దాదాపుగా రూ.30 లక్ష ల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుంది.

అయినా, ప్రాణాలకు గ్యారెంటీ ఉండదు. సూర్యాపేట మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేసే డాక్టర్ రవిసుందర్ (45)కు ఇన్‌ఫెక్షన్ కారణంగా లివర్ పూర్తిగా ఫెయిలైంది. గత నెల 29న ఉస్మానియాలో చేరగా, కుటుంబ సభ్యుల్లో డొనేట్ చేసే పరిస్థితి లేదు. చివరకు ఓ బ్రెయిన్‌డెడ్ అయిన రోగి లివర్ తీసుకుని శస్త్రచి కిత్స ద్వారా రవిసుందర్‌కు మార్పిడి చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు.

గురువారం ఉస్మానియాలో సూపరింటెండెంట్ డా.రాకేశ్ సహాయ్ ఈ సర్జరీ చేసిన డాక్టర్ మధుసూదన్, డాక్టర్ వాసిం అలీ, డాక్టర్ సుదర్శన్‌రెడ్డి తదితర వైద్య బృందాన్ని అభినందించారు. అవయవ దానంపై చక్కని అవగాహన కల్పిస్తూ, అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా చేస్తున్నందుకు ఉస్మానియా వైద్యులను వైద్య విద్య సంచాలకులు డా.వాణి అభినందించారు.