భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లాలో ఆదివాసి గిరిజన మహిళలు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ద్వారా స్వశక్తితో జీవనోపాది పెంపొందించుకుంటున్న మహిళలు శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఆకర్షించేలా వస్తువులు తయారు చేసి సరసమైన ధరలకు అమ్మకాలు జరిపి గిరిజన వస్తువుల పేర్లు ఖండంతరాలకు వ్యాప్తి చెందేలా చేసి జీవనోపాధి పొందాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్ అన్నారు. బుధవారం నాడు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆవరణలో దమ్మక్క లయాబిలిటీ గ్రూప్ గిరిజన మహిళలు ఎంఎస్ఎం ఈ యూనిట్ ద్వారా నూతనంగా నెలకొల్పుకున్న వివిధ రకాల వస్తువుల షాపును తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోదేం వీరయ్యతో కలిసి ఆయన ప్రారంభోత్సవం చేశారు.
షాపులోని సబ్బులు,షాంపూలు, తేనె, వెదురుతో తయారు చేసిన వివిధ రకాల కళాఖండాల వస్తువులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుండే కాక దేశ విదేశాల భక్తులు అధికంగా వస్తూ ఉంటారని, ఆదివాసి గిరిజనుల సాంస్కృతి సాంప్రదాయాల పట్ల ఎక్కువ శాతం భక్తులు ఆకర్షితులు అవుతారని, వారి అభిరుచిని బట్టి భక్తులకు ఆకర్షించేలా గ్రూప్ మహిళలు ఈ షాపులో వస్తువులు కనువిందు కలిగేలా అమర్చి సరసమైన ధరలకు అమ్మకాలు జరపాలని, ప్రస్తుతం ఉన్న సబ్బులు షాంపూలు, తేనె, వెదురుతో తయారుచేసిన కళాఖండాలే కాకుండా భక్తులు కోరిన విధంగా సామాన్లు అందుబాటులో ఉంచాలని, అదేవిధంగా కాలానుగుణంగా దొరికే న్యూట్రిషన్ కి సంబంధించిన ఫలాలు కూడా అందుబాటులో ఉంచుకోవాలని, శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రీతిపాత్రమైన ఇప్ప పూలు తప్పనిసరిగా భక్తులు అధికంగా కొనుగోలు చేస్తారని, వాటిని తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
తక్కువ పెట్టుబడితో ప్రారంభించుకున్న ఈ షాపును గ్రూప్ మహిళలు ఐకమత్యంగా ఉండి అమ్మకాలు బాగా జరిపి వృద్ధిలోకి తెచ్చుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎం జిసిసి సమ్మయ్య, జేడీఎం హరికృష్ణ, మురళి రమేష్, విజయలక్ష్మి, రాజ్ సులోచన, బేబీ రాణి, విజయలక్ష్మి, రాజకుమారి, రమాదేవి, భారతి, మంగ, కృష్ణవేణి, సురేష్, సాయికుమార్, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.