calender_icon.png 2 October, 2024 | 5:51 AM

నేటి నుంచి బతుకమ్మ

02-10-2024 01:12:37 AM

9 రోజులపాటు పూల వేడుక

తెలంగాణ సంస్కృతికి ప్రతీక  

నేడు ఎంగిలి పూల బతుకమ్మ

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 1 (విజయక్రాంతి): పూల పండుగకు వేళైంది. పువ్వులనే దైవంగా కొలిచే తొమ్మిది రోజుల వేడుకకు తెలంగాణ ముస్తాబైంది. ప్రకృతి పండుగగా పిలిచే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక అయిన బతుకమ్మ ఉత్సవాలు మారుమూల పల్లె నుంచి పట్నం నడిబొడ్డు వరకు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి.

మొదటి రోజైన ఎంగిలిపూల బతుకమ్మను మహిళలు నేడు జరుపుకోబోతున్నారు. ఆశ్వయుజ మాసం ఆరంభ అమావాస్య రోజున బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతాయి. దీన్నే మహాలయ అమావా స్య అని, తెలంగాణలో పెత్రమాసగా పిలుస్తారు. తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మను దేవాలయాల ప్రాంగణాలు, చెరువుల వద్ద మహిళలు నిర్వహించుకుంటారు.

బతుకమ్మనే గౌరమ్మగా భావించి పూజిస్తారు. రోజుకో తీరు నైవేద్యాలు సమర్పిస్తారు. తంగేడు, గునుగు, గుమ్మడి, బంతి, చామంతి, పట్టుకుచ్చు, కమలం, తామర, బీర, గన్నేరు, మందార, పారిజాతం, టేకు, పూలను సేకరించి బతుకమ్మను పేర్చుతారు.

బతుకమ్మపై తమలపాకులో పసుపుముద్దతో గౌరీ దేవి రూపా న్ని ఏర్పాటుచేస్తారు. తొమ్మిది రోజులు జరిగే ఉత్సవాలు చివరి రోజు సద్ధుల బతుకమ్మతో ము గుస్తాయి. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. 

తొమ్మిది రోజులు.. నైవేద్యాలు

1.ఎంగిలి పూల బతుకమ్మ: పెత్రమాస (ఆశ్వయుజ అమావాస్య) రోజున జరిగే మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. బతుకమ్మ తయారీ కోసం ముందు రోజు సేకరించిన పూలు ఇంట్లో ఒకరోజు నిద్ర చేస్తాయి కాబట్టి దీనికి ఎంగిలిపూల బతుకమ్మ అని పేరొచ్చిందని నానుడి. కొన్ని ప్రాంతాల్లో తిన్న తర్వాత బతుకమ్మను పేరుస్తారు కాబట్టి ఆ పేరొచ్చిందని ప్రచా రం. ఈ రోజున నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపిన నైవేద్యాలను సమర్పిస్తారు. 

2.అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ పాడ్యమి నాడు ఈ బతుకమ్మను పేరుస్తారు. ఈ రోజు సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు.

3.ముద్దపప్పు బతుకమ్మ: ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యాన్ని తయారు చేసి సమర్పిస్తారు. 

4.నానే బియ్యం బతుకమ్మ: నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.

5.అట్ల బతుకమ్మ: బియ్యాన్ని నానబెట్టి పోసిన అట్లను, దోశెలను నైవేద్యంగా సమర్పిస్తారు.

6.అలిగిన బతుకమ్మ: ఈ రోజు ఆశ్వయుజ పంచమి. ఈ రోజు బతుకమ్మ పేర్చరు, నైవేద్యం సమర్పించరు.

7.వేపకాయల బతుకమ్మ: నానబెట్టిన బియ్యం పిండిని వేపపండ్ల పరిమాణంలో నూనెలో వేయించి చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. 

8.వెన్నెముద్దల బతుకమ్మ: నువ్వులు, వెన్న, నెయ్యి, బెల్లం కలిపిన నైవేద్యాన్ని సమర్పించాలి. 

9.సద్ధుల బతుకమ్మ: ఆశ్వయుజ అష్టమి (అదేరోజు దుర్గాష్టమి ) నాడు సద్దుల బతుకమ్మను జరుపుకొంటారు. చివరి రోజున చెరువుల వద్ద ఆటాపాటలతో ఉత్సాహంగా వేడుకను జరుపుకొ ని చెరువులో నిమజ్జనం చేసి గంగమ్మ ఒడికి గౌరమ్మను చేరుస్తారు. అలా చేయడం వల్ల పూలలోని ఔషధ గుణాలు నీటిలో కలిసి నీటిలోని బాక్టీరి యా క్షీణిస్తుందని నమ్మకం. కాగా, ఈ రోజు ఐదు రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. పెరుగన్నం, చింతపండు (నిమ్మకాయ) పులిహోర, కొబ్బర న్నం (కొబ్బరి తురుము), నువ్వులన్నం (నువ్వుల పొడి)ను నైవేద్యంగా సమర్పిస్తారు. 

ఆడబిడ్డలకు గవర్నర్ బతుకమ్మ శుభాకాంక్షలు

తెలంగాణ ఆడబిడ్డలకు గవర్నర్ జిష్ణుదే వ్ వర్మ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం నుంచి పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. ప్రకృతితో బతుకమ్మ ముడిపడి ఉన్న పండుగని, మహిళలు ఎంతో పవి త్రంగా జరుపుకొనే వేడుకని పేర్కొన్నారు. మహిళలంతా తమ ప్రార్థనల ద్వారా గౌరీ దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారని తెలిపారు. గౌరీ దేవి ఆశీస్సులు అందరిపై ఉండాలని, జీవితాల్లో వెలుగులు నింపాలని.. మహిళలంతా వేడుకను ఆనందంగా జరుపుకో వాలని కోరారు. 

అందరూ సంతోషంగా జరుపుకోవాలి : సీఎం రేవంత్

పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ పండుగను అంద రూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ సాముహిక జీవన విధా నానికి, కష్ట సుఖాలను కలిసి పంచుకునే ప్రజ ల ఐక్యతకు బతుకమ్మ నిదర్శనమని చెప్పారు. 

ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలి : పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ 

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ అద్దం పడుతుందని పీసీసీ అధ్యక్షు డు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఆడబిడలు ఈ పండుగను ఆనందోత్సహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆడబిడ్డలకు బతుక మ్మ శుభాకాంక్షల తెలిపారు.  

తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ: మాజీ సీఎం కేసీఆర్

తెలంగాణ అస్తిత్వానికి, సాంస్కతిక జీవనానికి ప్రతీక బతుకమ్మ అని, తెలంగాణ బిడ్డలకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని, పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండగ ప్రపంచ సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రత్యేకత చాటుకుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు బతుకమ్మ వేదికగా నిలిచిందన్నారు.