సుదీర్ఘమైన, విస్తృతమైన, గాఢమైన, గంభీర రూపం కనుక ఇది బృహదారణ్యకోపనిషత్! వేదాంత పరమైన సూచనలతో, పరిష్కారాలతో మార్గోపదేశనాలతో శోభిల్లే సుందర ఉపనిషత్ ఇది!సత్యాన్వేషణలో విధేయతతో వినమ్రతతో, నిమగ్నులైన జనకుడు, యాజ్ఞ్యవల్క్యుడు, మైత్రేయి, గార్గి వంటి మహోన్నతులు చర్చించుకున్న విషయం కనుక, ఇది అవసరమైంది. అక్కరకు వచ్చేది.
జనకుడు రాజర్షి, యాజ్ఞవల్క్యుడు బ్రహ్మర్షి; మైత్రేయి గృహస్థాశ్రమంలో దీపశిఖ, గార్గి వేదాంత విదుషి. ఇంతటి ఆధ్యాత్మిక, సైద్ధాంతిక నేపథ్యమున్న మహాత్ములు చర్చించే విషయమూ విశ్వజనీనమే! వృత్తి, ప్రవృత్తి, నివృత్తి సంగమించిన అధ్యాత్మ త్రివేణి! లౌకిక, భౌతిక వృత్తులు ఏవైనా, స్త్రీలైనా, పురుషులైనా సత్యాన్వేషణకు అర్హులేనని చాటే బృహత్ సందర్భమిది!
ద్వంద్వాలతో కూడిన ప్రపంచంలో ఉంటూనే, ప్రపంచానికి అతీతం, కానీ మూలం అయిన సత్యాన్ని అన్వేషించవలసిన బాధ్యత, కర్తవ్యం అందరిపైనా ఉన్నాయి. ప్రగల్భం, గర్వం, అహంకారం, ఇతరుల సమర్థతను, కించపరిచే నైజం, ఎంతటి విద్యావంతుడినైనా అల్పజీవిగా నిలబెడుతుంది. ఆతడి విషయంలో సత్యాన్వేషణ బహుదూరం! అల్పగుణాలను అధిగమిస్తే తప్ప, విద్య ప్రకాశించదు.
వినయం అబ్బితే తప్ప విజయం కైవసం కాదు. తనను తాను జయించుకోగల విజయమే శాశ్వతమైంది. భద్రతమమైంది. ఆత్మ వస్తువు కాదు. పదార్థ గుణం దానికి లేదు. కానీ, అన్ని పదార్థాలలోనూ అది ఉన్నది. అది సద్వస్తువు. ఇంద్రియాలకు, మనసుకు, బుద్ధికి అతీతమైంది. అది అంతశ్చేతన. అనుభూతిగతమైంది.
గగన గగనాంతరాలపైన, లోకలోకాంతర ప్రాణాలలోన, శూ న్యంలో పూర్ణమై, పూర్ణంలో శూన్యమై, ఏక మై, అఖండమై, అనాహతమై, అవ్యయమై, ఏకాక్షరమై ఓంకారమై, నానా నాదస్వనమై, నిస్వనమై, ఏది నిండి ఉన్నదో అది ఆత్మ! సర్వప్రాణుల మధ్య అది అంతస్సూత్రమే! అణువులు, వాటి మధ్యనున్న శూన్యప్రదేశమూ ఆత్మే!
అన్నిటినీ కలిపి ఉంచుతున్న దివ్యబంధమది. ఇం ద్రియ నిగ్రహం, కరుణ, దయగల హృదయం ఉన్న వ్యక్తి ఎరుక లేకుండానే ఆత్మానుభూతిలో జీవిస్తాడు. సర్వసంపదలు ఇవ్వలేని, తులలేని ఆనందాన్ని ఆత్మవిద్య అనుగ్రహిస్తుంది. ఎవరికి వారు స్వీయసాధనతో సాధించుకోవలసిన జ్ఞానమిది.
సర్వాన్ని తెలుసుకున్నా ఆత్మను ఎరుగనట్లైతే, అంతా సున్నా! ఆత్మను ఎరిగే ప్రయత్నమంతా భౌతికమే! ప్రయత్నం చివరలో సిద్ధించే స్థితే అసలు అధ్యాత్మ! ఆత్మానుభవం కలిగినపుడు, దేహం కూడా ఆత్మగానే అనిపిస్తుంది.
అది భిన్నం కాని స్థితి! దేవతలు అడిగినవన్నీ ఇస్తారు, అవి వరాలు! ఆత్మోన్నతుడు అడగడు, పొందడు! అన్నీ ఆతడిని వరిస్తయ్. కరుణ కురిపిస్తయ్. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అన్న స్పృహ యదార్థమైంది! శుభేచ్ఛతో ప్రారంభమయే సప్తజ్ఞాన భూమికలు ఆత్మసిద్ధిని కలిగిస్తయ్, తీవ్ర ప్రయత్నం చేయగలిగితే!
కాల, కార్య, కారణ, కర్తవ్యాలు జీవుడిని నియంత్రించే విషయాలు. సృష్టి, స్థితి, లయ అనబడేవన్నీ వీటిపై ఆధారపడి, అనుసరించే పరిసత్యాలు! ఆత్మ గురువు; ఆయనను ఆలకించు. ఆత్మ ఈశ్వరుడు; ఆయనను అనుసరించు. ఆత్మే అంతా! అనుగ్రహ మూ అదే! గ్రహించు! ఆత్మగా జీవించు! ఆత్మగా వెలుగొందు!