calender_icon.png 22 September, 2024 | 10:10 PM

2.7 లీటర్ల హష్ ఆయిల్ స్వాధీనం

22-09-2024 02:12:33 AM

నలుగురి అరెస్ట్.. పరారీలో మరో నిందితుడు

ఎల్బీనగర్, సెప్టెంబర్ 21: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎల్బీనగర్ ఎస్వోటీ, అదిభట్ల పోలీసులు సంయుక్తం దాడులు నిర్వహించి హష్ ఆయిల్ విక్రయిస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నా డు. ఎల్బీనగర్‌లోని రాచకొండ పోలీస్ కమిషరేట్ క్యాంప్ కార్యాలయంలో శనివారం సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న వుటల రంజిత్‌కుమార్, బొల్లం సాయినితిన్, బచ్చు నరేంద్ర, సాయికృష్ణ కొద్దిరోజుల నుంచి గంజాయికి బానిసయ్యారు. వీరు ఈజీ మనీ కోసం డ్రగ్స్ అమ్మాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా ఇటీవల ఏపీలో సాయి అనే వ్యక్తి వద్ద హష్ ఆయిల్‌ను కొనుగోలు చేశారు.

అక్కడ సేకరించిన హష్ ఆయిల్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. వీరు సరూర్‌నగర్ ప్రాంతంలో విక్రయిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత సాయినితిన్, నరేంద్ర, సాయికృష్ణ తిరిగి హష్ ఆయిల్ విక్రయం ప్రారంభించారు. మళ్లీ ఏపీలోని అన్నవరం వెళ్లి హష్ ఆయిల్‌ను సేకరించారు. దానిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి 5 మిల్లీలీటర్లను రూ.2 వేలకు విక్రయించడం ప్రారంభించారు. ఇలా  ఈ నెల 16న రంజిత్‌కుమార్, సాయినితిన్, నరేంద్ర కారులో ఏపీలోని అన్నవరం లో సాయిని కలిసి ఆయిల్‌ను రూ.70 వేలకు కొనుగోలు చేశారు.

అక్కడి నుంచి మీర్‌పేటకు వచ్చి సాయినితిన్ ఇంట్లో హష్ ఆయిల్‌ను నిల్వ చేశారు. ఆయిల్‌ను చిన్నచిన్న సీసాలో నింపి స్థానికంగా విక్రయిస్తు న్నారు. విక్రయాలపై సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. రంజిత్‌కుమార్, సాయినితిన్, నరేంద్ర, సాయికృష్ణను అరెస్టు చేశారు. ఏపీకి చెందిన సాయి పరారీలో ఉన్నాడు. స్వాధీనం చేసుకున్న హష్ ఆయిల్ విలువ రూ.21లక్షలు ఉంటుందని సీపీ తెలిపారు.