24-02-2025 12:00:00 AM
ఉదయసాహితీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు దాస్యం సేనాధిపతి
ఖమ్మం, ఫిబ్రవరి 23 ( విజయక్రాంతి): సమాజ వికాసానికి సాహిత్యం దోహదం చేస్తుందని ఉదయ సాహితి తెలంగాణ రాష్ట్ర గౌరవాధ్యక్షులు, ప్రముఖ కవి, రచయిత దాస్యం సేనాధిపతి పేర్కొన్నారు. ఖమ్మంలోని బోడేపూడి విజ్ఞాన కేంద్రంలో ఉదయసాహితి(సాహిత్య వికాస వేదిక) తెలంగాణ రాష్ట్ర సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది.
సంస్థ రాష్ట్ర అధ్యక్షులు శ్రీదాస్యం లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో దాస్యం సేనాధిపతి ప్రసంగించారు. సమాజ మార్పును కోరే రచనలు రావాలన్నారు. అందుకు ఉదయ సాహితి వేదికగా నిలిచిందన్నారు. అనంతరం నగునూరి రాజన్న కలం నుండి జాలువారిన వెలుగు పూలు(హైకూలు) పుస్తకాన్ని, యుర్రాబత్తిన మునీంద్ర రాసిన ‘కలల కావడి’ కవితా సంపుటిని అతిథులు ఆవిష్కరించారు.
తొలుత ముఖ్య అతిథి భోగోజు ఉపేందర్రావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వురిమళ్ల సునంద కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేటికవిత సమూహ సభ్యులు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు. వీరిలో అర్హులైన కవులకు కవితా భూషణ, కవితా విభూషణ, సహస్ర కవితా స్ఫూర్తి అవార్డులను ప్రదానం చేశారు.
కవులంతా తమ సాహిత్య ప్రస్తానాన్ని వివరించారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రులు వెంకటలక్ష్మీ, బత్తిన గీతాకుమారి, అక్షరాల తోవ నిర్వాహకులు నామా పురుషోత్తం, దాసరోజు శ్రీనివాస్, రాచమళ్ల ఉపేందర్, ప్రముఖ రచయిత్రి తాళ్లూరి లక్ష్మీ, ఉదయ సాహితీ సభ్యులు రమాదేవి కులకర్ణి, మూర్తి శ్రీదేవి, తులసి వెంకటరమణాచార్యులు పాల్గొన్నారు.