డా. తిరునగరి శ్రీనివాస్ :
నేడు డా॥ సినారె జయంతి
రమణీయమైన శైలికి వేగ ప్రవణతతో కూడిన పదాలను జోడించి సమపాళ్లలో సన్ని వేశాన్ని కవితాత్మకంగా పరిపుష్టం చేసి తెలుగు రచనకు అపార గౌరవాన్ని ఆపాదించిన మహాకవి డా॥ సి. నారాయణరెడ్డి. అప్పటికే ఉన్న అనేక ప్రక్రియలలో రచనలు చేసి, తానే కొన్ని ప్రక్రియలను స్వ యంగా సృష్టించిన సినారె నవనవోన్మేషమైన తాత్విక సంయోజనా నిపుణతను కనబరిచారు. విస్తృత కవిత్వ సృజనా నుభవం, విశ్లేషణాత్మక వివేచన కలిగిన రవివంటి కవి. కవితాత్మకంగా చెప్పడంలోనే కవి అసాధారణమైన శక్తి ఇమిడి ఉంటుందని నిరూపించిన సాహిత్యకారుడు.
సాహిత్యంతో ఒనగూడే సార్థకత ఏమిటో తెలుసుకుని నిర్మాణ శ్రద్ధను తన చివరి రచన వరకు కనబరిచారు. కవి హృదయ లోతును అచ్చంగా తన కావ్యాలెన్నింటిలోనో ఆయన ఆవిష్కరించారు. పాఠకుడు నావేనని భావించే కవిత్వాంశాలతో తడి తపనలను కవిత్వంగా రంగరించి ఆర్ద్రతానుభూతులను బలంగా వెల్లడించారు. అన్ని కోణాలను స్పర్శిస్తూ, కవితాయాత్రను కొనసాగిస్తూ, కవిగా వెలకట్టలేని కాంట్రిబ్యూషన్ ఇచ్చి ప్రధాన సాహిత్య స్రవంతిలో తన బలీయమైన ముద్ర వేసి వెళ్లారు.
హనుమాజీపేట ఆణిముత్యం
కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో బుచ్చమ్మ, సింగిరెడ్డి మల్లారెడ్డి దంపతులకు 29 జూలై 1931న నారాయణరెడ్డి జన్మించారు. అక్షరాలను ఖాన్గీబడిలో నేర్చుకొని సిరిసిల్లలో ప్రాథమిక, కరీంనగర్‌లో హైస్కూల్ విద్యను అభ్యసించారు. హైద్రాబాద్, చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బీఏ, ఎంఏ చదివారు. చిన్ననాటి నుండే చైతన్యస్ఫూర్తిని పెంపొందించుకొని పాఠశాల విద్యార్థిగా నిజాంకు వ్యతిరేకంగా జరిగిన సత్యాగ్రహ పోరాటంలో పాలు పంచుకున్నారు. సీతాపహరణం, భక్త ప్రహ్లాద, రఘుదేవ రాజకీయం వంటి నాటకాలను, ఛందోబద్ధమైన పద్యాలను విద్యార్థి దశలోనే రాసి ఆనాటి పత్రికలలో ప్రచురించి, ఎందరో ప్రముఖుల ప్రశంసలు పొందారు.
1950 నాటికే ఆయన ఎంతో సాహిత్య పరిణతను సాధించారు. 1952 ప్రాంతంలో హైద్రాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం బీఏ విద్యార్థిగా ఉన్నప్పుడు అక్కడి దక్కన్ రేడియోతో ఏర్పడిన అనుబంధంతో క్రమంగా నవ్వని పువ్వు, అజంతా సుందరి, రామప్ప వంటి ఎన్నో గేయ నాటికలు, సంగీత రూపకాలు రాసి సుప్రసిద్ధులయ్యారు. రామప్ప సంగీత రూపకం 12 భాషాలలోకి అనువాదమై ‘ఆకాశవాణి’ జాతీయ బహుమతిని పొందింది. బీఏ చివరి సంవత్సరం చదువుతూనే 1952లో తెలంగాణ రచయితల సంఘం వ్యవస్థాపక కార్యదర్శిగా వ్యవహరించారు. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షణలో ‘ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు-, ప్రయోగములు’ అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యా లయం సినారె సాహితీ ప్రస్థానానికి కీలక మలుపుగా మారింది.
సికింద్రాబాద్ ఆర్ట్స్ అండ్ సైన్స్, నిజాం, యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలల్లో తెలుగు ఆచార్యులుగా ఎంతో రాణించారు. సినీ గీత రచయితగా 1961లో ప్రారంభమైన సినారె పాటల ప్రయాణంలో ‘గులేబకావళి’ కథ సినిమాలోని ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని’ ఆరంభ గీతం కాగా, 1990 వరకు సుమారు 3 వేల పాటలను అప్రతిహతంగా రాశారు. కర్పూర వసంతరాయులు, నాగార్జున సాగరం, జలపాతం, విశ్వనాథనాయుడు, ఋతుచక్రం, జాతిరత్నం, మా ఊరు మాట్లాడింది, అక్షరాల గవాక్షాలు, తేజస్సు నా తపస్సు, మనిషీ- చిలక, మార్పు నా తీర్పు, మంటలు- మానవుడు, మధ్యతరగతి మందహాసం, నిరంతరం, గాంధీయం, మీరాబాయి, నా చూపు రేపటి వైపు, నా రణం మరణం పైనే వంటి ఎన్నెన్నో రచనలతో వారి కవితా జైత్రయాత్ర కొనసాగింది.
ఆదిమకాలం నుండి ఆధునిక కాలం దాకా సాగిన మానవ జీవన విజయ ప్రస్థానాన్ని తెలుపుతూ, సినారె రాసిన దీర్ఘ కవిత ‘విశ్వంభర’కు భారత అత్యున్నత ‘జ్ఞానపీఠ’ పురస్కారం దక్కింది. తెలుగు సాహిత్యంలోని పద్యం, గేయం, వచనం, నాటికలు, గజళ్లు, అనువాదాలు, ముక్తకాలు, బుర్రకథ, యాత్రా రచన వంటి అనేక ప్రక్రియలలో సమకాలీన, వర్తమాన కవులతో పోటీ పడుతూ రచనల వ్యాసంగాన్ని అజేయంగా సాగించారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక, తెలుగు విశ్వవిద్యాలయాల ఉప కులపతిగా, సాంస్కృతిక మండలి అధ్యక్షులుగా, భాషా సాంస్కృతిక సలహాదారులుగా, రాజ్యసభ సభ్యులుగా పదవులు పొంది పరిపాలనా దక్షతను కనబరిచారు. నాటి ఆంధ్ర సారస్వత పరిషత్తుకు, నేటి తెలంగాణ సారస్వత పరిషత్తుకు అధ్యక్షులుగా వ్యవహరించారు. పదవుల్లో రాణిస్తూనే కవితా రచనను కొనసాగించారు.
పద్యం నుంచి పాటల వరకు!
కావ్యానికి వస్తుబలం అత్యంత పోషకమని ప్రగాఢంగా నమ్మారు. వస్తు మూలకాలు కాని రచనలు ఎదురొడ్డి కాలగతిలో నిలబడలేవన్నది మొదటినుండి నారాయణరెడ్డి నిశ్చితాభిప్రాయం. భావాలను, భావ చిత్రాలను గుదిగుచ్చితే కావ్యంగా అది గుర్తింపుకు రాదంటారు. అనేక కావ్యాలు మరుగున పడడానికి కథనమే మిగిలి కవిత్వం లేకపోవడం కారణమైందని గమనించి ‘విశ్వంభర’ వంటి మనిషి వికాస క్రమాన్ని వర్ణిస్తూ అద్భుత కావ్యాన్ని సృష్టించారు. దృశ్యాదృశ్య రచనా పాటవంలో, గంభీర భావాలను పలికించడంలో, గేయ రచనా కౌశలంలో సిద్ధహస్తులు సినారె.
నవ్వని పువ్వు, అజంతా సుందరి, వెన్నెలవాడ వంటి సంగీత నాటికా సంపుటులలో, రామప్ప, తరతరాల తెలుగు వెలుగు వంటి సంగీత రూపకాలు, ఊర్మిళ, దీపలీల వంటి వచన నాటికలు, నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు వంటి కావ్యాలలో ఆయన రచనా ప్రతిభ సచిత్రమై సాక్షాత్కరిస్తుంది. కాళిదాసు పునరాగమనము, మీరా వంటి నాటికలు ఎందరినో అలరించాయి. రాజకీయ, కళా, సాంఘిక, మానవతా, వైయక్తిక సమస్యలను ఎన్నింటినో ఖండకావ్యాలుగా రాసి ఎందరినో మెప్పించారు. జానపద, శిష్ట సాహిత్యాల మేళవింపుగా ఎన్నో గేయాలను రాశారు. దీర్ఘ సమాసాలతోకూడి అతిఫ్రౌడమైన పాటలనూ జనరంజకం చేసిన ఘనుడు. గేయాలలో ఉర్దూ గజల్ పద్ధతిని ప్రవేశపెట్టారు.
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను సినారె పొందారు. మీరట్, నాగార్జున, కాకతీయ, సార్వత్రిక విశ్వవిద్యాలయాల గౌరవ డాక్టరేట్లు, సోవియెట్ లాండ్ నెహ్రు అవార్డు, రాజ్యలక్ష్మి అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలో పురస్కారం వంటి ఎన్నెన్నో అవార్డులను స్వీకరించారు. 86 సంవత్సరాల్లో 86 రచనలు చేసిన విశిష్టత అయనకు దక్కింది. ఎంతోమంది ఔత్సాహికులను సాహిత్య రంగంలో విశేషంగా ప్రోత్సహించి ఆశీర్వదించిన సినారె తాను మరణించే వరకు ఏడు దశాబ్దాలపాటు తెలుగు భాషా సాహిత్య సంస్కృతులను ఉద్దీపింపజేస్తూ 12 జూన్ 2017న కన్నుమూసే వరకు నిరంతర జ్ఞానానుభవంతో రచనలు చేశారు. సినారెగా తెలుగు సాహితీ లోకం అత్యంత అభిమానంతో పిలుచుకునే మహోన్నత కవి. తెలుగు సాహిత్య భాషా చరిత్ర వున్నంత కాలం ఆయన అక్షర సంపద చిరస్థాయిగా నిలిచి వుంటుంది.
వ్యాసకర్త సెల్: 9441464764
సంప్రదాయం, ఆధునికతల మేళవింపు
తెలంగాణ మాండలికాలను మా ఊరు మాట్లాడింది వంటి ఎన్నో రచనల్లో, సినీ గీతాల్లో సినారె స్వేచ్ఛగా ప్రయోగించారు. ఏకవీర, అక్బర్ సలీమ్ అనార్కలీ సినిమాలలోని ఆయన సంభాషణలు ఉదాత్త స్థాయిని అందుకున్నాయి. సంప్రదాయాన్ని విడవకుండా శిల్పాన్ని పాటిస్తూ నూత్న ప్రయోగాలు చేశారు. సామాజిక స్పృహకు, మానవతావాదాన్ని జోడించి సాహిత్యాన్ని అందించిన నారాయణరెడ్డి నైతిక దృక్పథం, దేశభక్తి, జాతీయత అనేక చోట్ల వ్యక్తమవుతుంది. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారంపై తన దృక్పథాన్ని ఎన్నో గేయాలలో స్పష్టం చేశారు. ఆశావాదం మానవునికి ఆరవ ప్రాణమన్న ఆయన విశ్వశాంతిని ఆకాంక్షించిన ఆధునిక యుగపు మహాకవి.