calender_icon.png 19 January, 2025 | 5:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాట వినాలి గురుడా..

18-01-2025 12:00:00 AM

పవన్‌కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకర్‌రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  బాబీ డియోల్, నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అణగారిన వర్గాల కోసం అన్యాయంపై పోరాడే యోధుడు కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం తుది దశలో ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మాట వినాలి’ అనే ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను స్వయంగా పవన్‌కళ్యాణ్ ఆలపించడం విశేషం. ‘వినాలి, వీరమల్లు మాట జెప్తే వినాలి..’ అంటూ తెలంగాణ యాసలో పవన్ కళ్యాన్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన పాట ఆద్యంతం జానపద బీట్‌లతో సాగింది.

‘మాట వినాలి గురుడా మాట వినాలి.. మాట వినాలి మంచి మాట వినాలి.. ఉత్తది గాదు మాట తత్తర పడక.. చిత్తములోన చిన్న ఒద్దికుండాలి...’ అంటూ సాగుతోందీ పాట. మంచి మాటలను వింటే వాటి నుంచి పొందే జ్ఞానం ప్రాముఖ్యతను తెలియజేస్తూ సందేశాత్మకంగా ఉందీ గీతం.

ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదల కానున్న నేపథ్యంలో ఈ మొదటి గీతాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీలో విడుదల చేశారు. కీరవాణి స్వరకల్పనకు తెలుగులో పెంచల్ దాస్, తమిళంలో పీఏ విజయ్, మలయాళంలో మంకొంబు గోపాలకృష్ణన్, కన్నడలో ఆజాద్ వరదరాజ్, హిందీలో అబ్బాస్ టైరేవాలా సాహిత్యం అందించారు. ఈ చిత్రాన్ని మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.