అర్హుల ఎంపికకు సర్వే పనులు రేపటి వరకు పూర్తి చేయాలి
శ్రీరాంపూర్, ముత్తారం మండలాలలో విస్తృతంగా పర్యటనలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
ముత్తారం (విజయక్రాంతి): ప్రభుత్వం చేపట్టిన 4 పథకాల కార్యక్రమాలకు సంబంధించి అర్హుల జాబితాను శనివారం (ఎల్లుండి) నుంచి గ్రామపంచాయతీలలో/అన్ని మున్సిపాలిటీలలో ప్రదర్శించాలని, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(District Collector Koya Shri Harsha) స్పష్టం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కాల్వ శ్రీరాంపూర్, ముత్తారం మండలాలలో విస్తృతంగా పర్యటించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేట గ్రామంలో, ముత్తారం మండలంలో జరుగుతున్న రేషన్ కార్డ్, రైతు భరోసా సర్వేలను కలెక్టర్ పరిశీలించారు. గ్రామాలలో జరుగుతున్న అర్హుల ఎంపిక ప్రక్రియ వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ... ప్రభుత్వం నూతనంగా చేపడుతున్న కార్యక్రమాల అర్హుల ఎంపిక ప్రక్రియ శ్రీరాంపూర్ మండలంలోని అన్ని గ్రామాలలో రేపటి వరకు పూర్తి కావాలని కలెక్టర్ తెలిపారు.
ఎల్లుండి ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతు భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, వంటి పథకాల అర్హుల జాబితా వివరాలను ప్రదర్శించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామాలలో వ్యవసాయ యోగ్యం కాని భూములను మాత్రమే రైతు భరోసా జాబితా నుంచి తొలగించాలని, కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. రాళ్లు రప్పలు ఉన్న భూములు, సాగు నీటి ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ చేసిన భూములు, పరిశ్రమల భూములు (రైస్ మిల్ పెట్రోల్ బంక్, ఆహార శుద్ధి పరిశ్రమ), నాలా కన్వర్షన్ జరిగిన భూములు, లేఔట్ ఉన్న భూములు, ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తు భూములు, రోడ్ల భూములు, భవనాలు నిర్మించుకున్న భూముల, మైనింగ్ జరుగుతున్న భూముల వివరాలు రైతు భరోసా నుంచి తొలగించాలని అన్నారు.
రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ స్థితిగతులను పరిశీలించి అర్హులకు రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం శ్రీరాంపూర్ లోని యు.పి.హెచ్.సి. ఆకస్మికంగా తనిఖీ చేసి డెలివరీలు పెంచాలని, ఎన్సిడి, ఆభకార్డులు ఈనెల 31 లోపు పూర్తి చేయాలని, వైద్యులు సమయపాలన పాటించాలని అన్నారు. అనంతరం రామగిరి మండలంలోని బేగంపేటలోని పి.హెచ్.యూ.హెచ్.సి. కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు. వైద్యులు సమయపాలన పాటించాలన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మండల ఇంచార్జీ డి.సి.ఓ. శ్రీ మాల, శ్రీరాంపూర్ తాహసీల్డార్ వకిల్, ముత్తారం తాహసిల్దార్ సుమన్, శ్రీరాంపూర్ ఎంపీడీవో చారీ, వ్యవసాయ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.