calender_icon.png 26 March, 2025 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లిక్కర్ వార్

26-03-2025 01:30:08 AM

ప్రశాంత్ రెడ్డి :

బెల్టు తీస్తామన్నారు.. కానీ కొత్త బ్రాండ్లు, బీర్లు, బార్లు, బెల్టుషాపులు తెచ్చారు. రూ.12 వేల కోట్ల ఆదాయం పెంచుకునేందుకు లిక్కర్ రేట్లు అడ్డగోలుగా పెంచుతున్నారు. కొత్త మద్యం విధానాన్ని వెంటనే విత్ డ్రా చేసుకోవాలి.

శ్రీధర్‌బాబు :

బెల్టు షాపులను ప్రవేశపెట్టిందే బీఆర్‌ఎస్ సర్కారు. చౌకధర దుకాణాల్లోనూ బెల్టు షాపులు తీసుకువచ్చిన ఘనత వారిదే. బెల్టుషాపులపై బీఆర్‌ఎస్ సభ్యులు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు.

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వ నూతన మద్యం విధానం, బెల్టుషాపుల వ్యవహారంపై అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ జరిగింది. ‘బెల్టు తీస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి బెల్టు షాపులను విచ్చలవిడిగా పెంచారని, ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారంటూ బీఆర్ ఎస్ సభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించగా.. బెల్టు షాపులు తెచ్చిందే బీఆర్‌ఎస్ పార్టీ అని మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్ ఇచ్చారు.

బీఆర్‌ఎస్ నాయకుల తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందంటూ ఎద్దేవా చేశారు. ఇదే అంశంపై సమాధానమిస్తూ ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్‌ఎస్ సభ్యుల వైఖరి దొంగనే.. దొంగా దొంగా అన్నట్లుందని విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. బెల్టు షాపులు లేకుండా చేస్తామని చెప్పి కొత్త బ్రాండ్లు, కొత్త బీర్లు, కొత్త బార్లు, కొ త్తగా బెల్టుషాపులు తీసుకువచ్చిందని విమర్శించారు.

రూ.12 వేల కోట్ల ఆదాయం పెం చుకునేందుకు లిక్కర్ రేట్లు అడ్డగోలుగా పెం చుతున్నారని ఆరోపించారు. కొత్త మద్యం విధా నాన్ని వెంటనే విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు మద్యాన్ని మార్గంగా ఎం చుకోవడం కరెక్టు కాదన్నారు. బెల్టు షాపులను ప్రవేశపెట్టిందే బీఆర్‌ఎస్ సర్కారు అని మంత్రి శ్రీధర్ బాబు వేముల ప్రశాంత్‌రెడ్డికి ఘాటుగా సమాధానమిచ్చారు.

చౌకధర దుకాణాల్లోనూ బెల్టు షాపులు తీసుకువచ్చిన ఘనత వారిదేనన్నారు. బెల్టుషాపులపై బీఆర్‌ఎస్ సభ్యులు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. తామే బెల్టు షాపులు తెచ్చామని ప్రశాంత్ రెడ్డి ఒప్పుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు. తాము బెల్టు షాపులను అస్సలు ప్రోత్సహించబోమని, ఎక్సైజ్‌శాఖలో ఉన్న లోపభూ యిష్టమైన విధానాలను సరిచేసి ఆదాయా న్ని పెంచుకుంటామన్నారు. 

ఉల్టాచోర్ కొత్వాల్‌కో డాంటే: జూపల్లి 

2014లో రూ. 9వేల కోట్లు ఉన్న మద్యం ఆదాయాన్ని.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఊహించని విధంగా పెంచేసిందని మంత్రి జూపల్లి చెప్పా రు. బీఆర్‌ఎస్ తీరు ఉల్టాచోర్ కొత్వాల్‌కో డాంటే  అనే విధంగా ఉందన్నా రు. 2023లో తాము అధికారంలోకి వచ్చేలోగానే ఎక్సైజ్ ఆదా యం రూ.34 వేల కోట్లకు పెరిగిందని.. ఇలా ఎలా సాధ్యమో చెప్పాలన్నారు.

చట్టవిరుద్ధంగా బెల్ట్ షాపులను పెంచి, వాటి ద్వారా అక్రమంగా మద్యం అమ్మించారని ఆరోపించా రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం స్మగ్లింగ్ ఆపడానికి దాడులు చేస్తోందని, ఫామ్‌హౌస్‌లలో మద్యం తాగడాన్ని నిషేధించిందని తెలిపారు.

రూ. 12వేల కోట్ల ఆదాయాన్ని ఎలా పెంచుతారని ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్ సభ్యులు.. వారు రూ. 34 వేల కోట్లకు (పదేళ్లలో 400శాతం) ఎలా పెంచారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీ మొహం ఎక్కడ పెట్టుకుంటారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.