calender_icon.png 28 November, 2024 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం సిండికేట్ దందా

28-11-2024 01:40:38 AM

  1. ఎంఆర్‌పీపై రూ.10 నుంచి 15 అదనపు వసూళ్లు
  2. ఎక్సైజ్, పోలీసులు, లీడర్లకు నెలనెలా చేరుతున్న మాముళ్లు
  3. అమ్యామ్యాలతో మిన్నకుంటున్న వివిధ శాఖల అధికారులు
  4. సంగారెడ్డి జిల్లాలో 101 మద్యం షాపుల్లో కొనసాగుతన్న దందా

సంగారెడ్డి, నవంబర్ 27 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలో మద్యం అమ్మ కాలకు సంబంధించి అదనపు ధరల కిక్కు కొనసాగుతోంది. ఒక్కో బాటిల్‌పై ఎంఆర్‌పీ కంటే రూ.10 నుంచి 15 వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు అమ్మొద్దని ప్రభుత్వం ఆదేశాలిస్తున్నా క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు.

నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ వ్యవహారంపై ఎక్సైజ్ అధికారులు సైతం పట్టించుకోవడం లేదు.ప్రతీ గ్రామంలోనూ రూల్స్‌కు విరుద్ధంగా రెండు, మూడు బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి మద్యాన్ని విక్రయిస్తున్నారు. జిల్లాలోని పటాన్‌చెరు, సంగారెడ్డి, సదాశివపేట, జహీరా బాద్, ఆందోల్, నారాయణ ఖేడ్ పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో ఈ పరిస్థితి నెలకొంది.

కొన్ని చోట్ల ఎక్సైజ్ అధికారులు, పోలీసులు బెల్ట్ షాప్‌ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరులో 34, సంగారెడ్డిలో 32, జహీరాబాద్ 17, నారాయణ్‌ఖేడ్ 13, ఆందోల్‌లో 14 మద్యం షాపులున్నాయి. జిల్లా మొత్తం 101 మద్యం షాపులకు గవర్నమెంట్ అనుమతినిచ్చింది. సంగారెడ్డిలో 6, పటాన్‌చెరులో 22, జహీరాబాద్‌లో 4, నారాయణఖేడ్, ఆందోల్‌లో ఒక్కొక్కటి చొప్పున బార్లు నడుస్తున్నాయి.

సిండికేట్ దందా!

సంగారెడ్డి జిల్లాలో మద్యం విక్రేతలు సిండికేట్‌గా ఏర్పడి అమ్మకాలు జరుపుతున్నారు. బాటిళ్లపై ప్రభుత్వం నిర్ణయించిన ధరపై రూ.10 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు లీడర్లు మద్యం షాపుల సిండికేట్‌లో చక్రం తిప్పుతున్నారు. నిబంధనల ప్రకారం బెల్ట్ షాపులకు అనుమతి లేదు. కాగా జిల్లాలో మద్యం సిండికేట్ కొనసాగుతోంది.

ఎక్సైజ్ అధికారులు నెలకింత అన్నట్లు అమ్యామ్యాలు తీసుకొని బెల్ట్ షాపులకు అనుమతులిస్తున్నట్లు తెలుస్తోంది. బెల్ట్ షాపులోనూ అదనపు వసూళ్ల పర్వం కొనసాగుతోంది. మద్యం షాపుల్లో వసూలు చేసేదానికంటే రూ.20 అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో జిల్లా అదనపు వసూళ్ల రూపంలో మద్యం సిండికేట్ కోట్లు కొల్లగొడుతోంది. 

అధికారులకు కాసుల పంట

జిల్లాలో మద్యం షాపులు అధికార, ప్రతిపక్షనేతలు, పోలీసులు, ఎక్సైజ్ అధికారులకు బంగారు బాతులుగా మారాయి. ప్రతినెల ఖర్చులకంటూ మద్యం దుకాణాల నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్, సదాశివ్‌పేట, ఆందోల్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది.

సిండికేట్ నిర్వాహకులు ప్రతినెల ప్రతీ షాప్ నుం చి మామూళ్లు వసూలు చేసి అధికారులకు అప్పుగిస్తున్నారని తెలిసింది. మామూళ్ల రూపంలో ప్రతీ షాప్ నుంచి ప్రతినెలా రూ.45 వేల వసూలు చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఇలా వారి హోదాను బట్టి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ముట్టచెప్పుతున్నట్లు సమాచారం.

ప్రతినెలా లక్ష ల్లో అధికారులకు పంపకాలు చేస్తున్నారు. దీంతో మద్యం షాపుల నిర్వాహకులు రాత్రి నిర్ధేశిత గడువు ముగిసినా, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అమ్మకాలు చేపడుతున్నారు.