అధిక ధరలకు మద్యం విక్రయాలు
రోడ్లపైనే మందుబాబుల అత్యుత్సాహం
నిబంధనలు అతిక్రమించి, విక్రయాలు
అనధికార సిట్టింగులు, బెల్ట్ షాపులు
కన్నెత్తి చూడని అధికారులు
ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో మద్యం సిండికేట్ దందా అడ్డూ అదుపు లేకుండా కొనసాగుతుండడంతో మందుబాబుల జేబులకు పెద్ద ఎత్తున చిల్లుపడుతోంది. విచ్చల విడిగా అధిక ధరలకు మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నా అదేమని అడిగే దిక్కులేకుండా పోతుంది. మద్యం దుకాణదారులంతా సిండికేట్‌గా మారి, మందుబాబులను దోచుకుంటున్నారనే ఆరోపణలు పుష్కలంగా వినిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా అనధికార సిట్టింగులు, బెల్ట్ షాపులతో మద్యం వ్యాపారం మస్తుగా నడుస్తోంది. ఇదంతా ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లోనే నడుస్తున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఖమ్మం జిల్లాలో 123 వైన్ షాపులు, 37 దాకా రెస్టారెంట్ అండ్ బార్‌లు నడుస్తున్నాయి. ఇవి కాకుండా అనధికారిక మద్యం దుకాణాలు కూడా నడుస్తున్నట్లు సమాచారం.
ఇక బెల్ట్ షాపులకు కొరతే లేదంటున్నారు. ఎక్కడిపడితే అక్కడ సందు గొందుల్లోను, కిరాణం దుకాణాల్లోను బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి. బోనకల్ రోడ్డులో శ్రీరామ్‌నగర్ ఏరియాలో రోడ్డు పక్కనే యధేశ్చగా బెల్ట్ షాపు నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నా ఎవరికీ పట్టడం లేదు. కాగా మద్యం సీసాలపై ఉన్న ఎంఆర్‌పి ధరలను భేఖాతరు చేస్తూ విక్రయాలు భారీగా కొనసాగుతున్నాయి. వైన్ షాపుల యాజమానులంతా సిండికేట్‌గా మారి,ధరలను పెంచి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారనే అరోపణలున్నాయి. బహిరంగంగానే ఎమ్మార్పీ ధరలను ఉల్లంఘించి, మద్యం విక్రయాలు జరుగుతున్నా అడిగే దిక్కులేకుండాపోతుంది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘటన జరిగితే ఫిర్యాదు చేయడానికి ఏ వైన్ షాపు వద్ద కూడా ఫోన్ నంబర్లను కూడా అందుబాటులో ఉంచనిదుస్దితి ఉంది. ఈ నిబంధన ఎక్కడా అమలులో లేదు. ఎవరికైనా ఇబ్బందికలిగినా, నష్టం జరిగినా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం మద్యం వినియోగదారులకు ఉంది. కానీ ఈ నిబంధన ఎక్కడా అమలు చేసిన దాఖలాలు లేవు. నడిరోడ్లపై వాహనాలు నిలిపి, వైన్ షాపుల వద్ద బహిరంగంగా మందు తాగుతున్నా అదేమని అడిగే దిక్కులేకుండా పోతుంది.
ఖమ్మం చర్చికాంపౌండ్ ఏరియా, శ్రీనివాస్‌నగర్ ఏరియా, పాండురంగాపురం, ప్రకాశ్‌నగర్, తదితరప్రాంతాల్లో రోడ్ల మీదనే వాహనాలు నిలిపి, మందు బాబులు విచ్చలవిడిగా రెచ్చిపోయి మందు తాగడం షరా మామూలైంది. రోడ్లపై మహిళలు, విద్యార్ధులు తిరిగే ఏరియాతో పాటు ప్రార్ధన మందిరాల సమీపాల్లో కూడా మందు బాబులు రెచ్చిపోతున్నా పట్టించుకునే దిక్కులేకుండాపోతుంది. ఇక అనాధికార సిట్టింగులకు కొదువేలేకుండా ఉంది. సంబంధిత అధికారులకు నెలవారీ మామూళ్లు అందుతుండడంతో ఎవరూ కిక్కురుమనడం లేదనే ఆరోపణలున్నాయి. వైన్‌షాపులు, బార్ అండ్ రెస్టారెంట్‌లు నిబందనలు ఉల్లంఘించి,విక్రయాలు జరుపుతున్నా, విచ్చలవిడిగా అనధికార సిట్టింగులు వేస్తున్నా ఎందుకు అధికారులు ఉలుకుపలుకూ లేకుండా ఉంటున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిబంధనలను ప్రకారం వైన్ షాపుల నుంచి మద్యం కొనుగోలు చేసి,తీసుకుపోవాలే తప్ప అక్కడే నిలబడి లేదా సిట్టింగ్ వేసి,మద్యం తాగరాదు.యధేశ్చగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా,నడిరోడ్లపైనిలబడి మద్యం తాగుతున్నా అడిగే నాధుడే కరవయ్యాడు. మద్యం దుకాణాల పక్కనే సిట్టింగులు ఏర్పాటు చేసి,గదుల్లో కూర్చొని మద్యం తాగుతున్నారు. చట్ట ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మద్యపాన సేవనం నేరం అయినా ఇదెక్కడా అమలు కావడం లేదు.
ఇంతా జరుగుతున్నా ఇటు ఎక్సైజ్ అధికారులు కానీ పోలీసులు కాని కన్నెత్తి చూసిన పాపానపోవడంలేదు. దాదాపుగా అన్ని వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్,బెల్ట్ సాపుల్లో 30 శాతానికి పైగానే అధిక ధరలకు మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు ప్రజల నుంచి ఆరోపణలు ఉన్నాయి. ఈ సంపాదన చాలక బెల్టు షాపులకు తెరలేపడంతో మరింత దోపిడీ జరుగుతుంది.ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాలు, తిరుమలాయపాలెం, కూసుమంచి,నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, వైరా, మధిర, బోనకల్, చింతకాని ఇలా ఒకటేమిటీ అని అన్ని మండలాలు, పల్లెల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయంటున్నారు.జిల్లా వాప్తంగా వందలాది బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం నడుస్తోంది. మండలాలు, పల్లెల్లో ఎంఆర్‌పిని మించి, విక్రయాలు జరుగుతున్నాయి. అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలను మూటగట్టుకుంటున్నారు.లైసెన్స్ పొందిన విషయంలో కూడా కొన్ని అవకతవకలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ రికార్డుల్లో ఒక అడ్రస్ ఉంటే షాపు మరో చోట నడుస్తున్నానే ఆరోపణలున్నాయి. తప్పుడు మార్గాల్లో లైసెన్స్‌లు పొందారనే అంశంపై కూడా ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, అక్రమ మద్యం అమ్మకాలకు చెక్ పెట్టి, మందు బాబుల జేబులకు చిల్లు పడకుండా చూడాలని స్ధానికులు కోరతున్నారు.
పగలు ఒక రేటు ఉంటే రాత్రిళ్లు మరో రేటు అమలులో ఉంటుంది. నిర్ధేశిత సమయం దాటిన తర్వాత అధికరేట్లకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటున్నారు. వైన్ షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచాల్సి ఉండగా,ఎక్కడా ఆ నిబంధనలు అమలు ఉండడం లేదు. బార్ షాపులు సంగతి వేరే చెప్పనక్కర్లేదు. నిర్ధేశిత సమయం దాటిన తర్వాత దుకాణాల వెనుక వైపు నుంచి దొంగచాటుగా విక్రయాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రిళ్లు ఎక్కువ రేటుకు విక్రయాలు చేస్తూ కోట్లు కూడబెడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. వైన్ మార్టుల్లో ధరలకు మరింత రెక్కలు వచ్చాయంటున్నారు. ఎంఆర్‌పిని మించి అమ్మకాలు జరుగుతున్నాయంటున్నారు. ఖమ్మంలోని ఇల్లెందు క్రాస్ రోడ్డులోని వైన్ మార్టులో ఎంఆర్‌పి ధరలు అమలు చేయడం లేదనే విమర్శలున్నాయి. దీనికి కూతవేటు దూరంలోనే పోలీస్‌స్టేషన్ ఉండడం విశేషం. అయినా పట్టించుకునే దిక్కులేకుండాపోతుందంటున్నారు.