06-03-2025 09:52:08 AM
మారని తీరు ...అదే జోరు
తెలతెలవారకముందే గ్లాసుల గలగల
మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు
పూర్తిస్థాయిలో కొరబడిన పర్యవేక్షణ
పాల్వంచ, (విజయక్రాంతి): తెల్లారింది లెగండోయ్ కొక్కరోకో... బుచ్చలింకా తెరవండోయ్ కొక్కరోకో... అన్నట్లు ఉంది మద్యం వ్యాపారుల జోరు. మందుబాబుల బలహీనతను ఆసరా చేసుకొని మద్యం దంధా జోరుగా సాగుతోంది. పల్లె పట్నం భేదాలు లేకుండా తెలతెలవారకముందే కౌంటర్లు ప్రారంభించి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. మద్యం బాబుల జేబులకు చిల్లులు పొడుస్తున్నారు. ఎక్సైజ్ నిబంధనల(Excise Regulations) ప్రకారం ఉదయం 10:30 లకు మద్యం దుకాణాలు (బార్లు, రెస్టారెంట్లు) తెరవాల్సి ఉంటుంది.
అందుకు విరుద్ధంగా ఉదయం 6 గంటల నుంచి కౌంటర్లను ప్రారంభించి మద్యం విక్రయాలు జోరుగా చేస్తున్నారు. వాటిని అరికట్టాల్సిన ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో తోలుతున్నారు. పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ పట్టణాన్ని పరిశీలిస్తే ఉదయం 6 గంటల నుంచే బార్లు రెస్టారెంట్లో మద్యం విక్రయాలు సాగుతున్నాయి. సమయపాలన అంటే వారికి అసలు గిట్టదు అన్నట్టుగా బార్లు రెస్టారెంట్ల యజమానులు వ్యవహరిస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఎక్సైజ్ జిల్లా స్థాయి అధికారులు సమయపాలన పాటించని బార్లు రెస్టారెంట్లపై, ఎమ్మార్పీ ధర కంటే అధిక ధరకు విక్రయిస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.