* సిబ్బందితో కలిసి కానిస్టేబుల్, హోంగార్డు నిర్వాకం
* రూ.15 లక్షల సరుకు స్వాధీనం
* పోలీసుల అదుపులో ఐదుగురు, పరారీలో మరో నిందితుడు
రాజేంద్రనగర్, డిసెంబర్27: ఎయిర్‌పోర్టులో విధులు నిర్వహించే ఓ కానిస్టేబుల్, హోంగార్డు మరికొందరితో కలిసి డ్యూటీ ఫ్రీ లిక్కర్ దందాకు తెరలేపారు. వారి దందాకు చెక్‌పెట్టిన ఎక్సైజ్ పోలీసులు రూ.15 లక్షలు విలువైన లిక్కర్‌ను స్వాధీనం చేసుకొని ఆరుగురిపై కేసు నమోదు చేశారు. శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ శుక్రవారం మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు.
ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గెమ్యానాయన్, హోంగార్డు బండారి లింగయ్య, మాదాపూర్ అయ్యప్ప సొసైటీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గీధర హరీశ్‌కుమార్, గచ్చిబౌలి గౌలిదొడ్డి ప్రాంతానికి చెందిన పొట్లూరి రాఘవేంద్రరావు, ఎయిర్‌పోర్టులోని హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ షాపులోని బిల్లింగ్ కౌంటర్‌లో పనిచేసే మహేశ్వర్ ఒక జట్టుగా ఏర్పడ్డారు.
డ్యూటీ ఫ్రీ మద్యం బాటిళ్ల విక్రయాలు..
కానిస్టేబుల్ గెమ్యానాయక్, బండారి లింగయ్య ఎయిర్‌పోర్టులోని పోలీస్ ఔట్ పోస్టులో పనిచేస్తున్నారు. ప్రయాణికులను బోర్డింగ్‌లో దింపేందుకు పైఅధికారికి తెలియజేసినట్లు వీఐపీల కోసం ప్రొటోకాల్ విధులు నిర్వహించేవారు. ఈక్రమంలో డ్యూటీ ఫ్రీ షాప్‌లోని బిల్లింగ్ కౌంటర్‌లో పనిచేస్తున్న మహేందర్(ఏ5)తో వీరికి పరిచయం ఏర్పడింది.
విదేశాల నుంచి ఇండియన్, ఇంటర్నేషనల్ ప్రయాణికులు వచ్చినప్పుడు ఏమూ గేమ్యానాయక్, ఏమూ అయిన హోంగార్డు లింగయ్య డ్యూటీ ఫ్రీ బాటిల్స్‌కు సంబంధించి ప్రయాణికుల పాస్‌పోర్టు, బోర్డింగ్ పాస్‌తో దుకాణంలో బాటిళ్లను కొనుగోలు చేసేందుకు సంప్రదించేవారు. ఈక్రమంలో విశ్వసనీయ సమాచారంతో డీటీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం ఉదయం 9గంటలకు ట్యాటీ నుంచి రిలీవ్ అయిన తర్వాత గేమ్యా నాయక్ హ్యుందాయ్ వెనూ కారును పట్టుకున్నారు.
ఏ2 హరీష్‌కుమార్‌తో ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ శంషాబాద్ వద్ద రాయల్ సెట్యూల్ సీసాలను సేకరించడానికి వచ్చినప్పుడు పట్టుకున్నారు. గేమ్యానాయక్ కారులో 10 మద్యం సీసాలు దొరికాయి. అతడిని విచారించగా ఏమూ రాఘవేందర్‌రావుకు 16 గోల్డ్ లేబుల్ బాటిళ్లను గచ్చిబౌలిలో డెలివరీ చేసినట్లు గుర్తించారు. ఇలా మొత్తం రూ.15 లక్షలు విలువ చేసే డ్యూటీ ఫ్రీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈమేరకు డీటీఎఫ్ సిబ్బందిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీవీ కమలాసన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ తదితరులు అభినందించారు. మద్యాన్ని పట్టుకున్న టీంలో డీటీఎఫ్ శంషాబాద్ ప్రవీణ్‌కుమార్, శ్రీకాంత్‌రెడ్డి, సిబ్బంది పాలొన్నారు.