సింగరేణి రామగుండం సివిల్ డిపార్ట్మెంట్లో మద్యం దావత్
వివాదంలో ఆర్ జీ -1 సివిల్ విభాగం
రామగుండం (విజయక్రాంతి): మందెయ్... చిందేయ్... అన్నట్టుగా సింగరేణి రామగుండం-1 సివిల్ డిపార్ట్మెంట్ లో విధి నిర్వహణలో ఉద్యోగులు దావత్ చేసుకున్న సంఘటన స్థానికంగా దుమారం రేపుతోంది. సింగరేణిలో అత్యవసర విభాగమైన సివిల్ డిపార్ట్మెంట్, వాటర్ వర్క్స్ డ్యూటీల్లో మద్యం సేవించడం నిత్యకృతమైంది. స్థానిక గోదావరి తీరంలోని సింగరేణి హెడ్ వర్క్స్ నుంచి గనులు, ఆర్టీ-1, 2, 3 గనులు, యైటింక్లయిన్ కాలనీ, గోదావరిఖని, సెంటినరీ కాలనీ వరకు కాలనీలకు మంచినీటి సరఫరా చేస్తారు. అక్కడ పనిచేసే సిబ్బంది, నిత్యం అప్రమత్తతో వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు విందులకు అడ్డాగా మారింది. డ్యూటీలో మస్టర్ వేసుకుని సైట్ ఆఫీస్లోలోనే దర్జాగా మద్యం సేవిస్తున్నారు.
బుధవారం మధ్యాహ్నం ముగ్గురు ఉద్యోగులు డ్యూటీలోనే మద్యం సేవించిన ఘటన వెలుగు చూసింది. తోటి సిబ్బంది, ఉద్యోగులు ఉన్నా కూడా డ్యూటీలో మద్యం సేవించడం చర్చనీయాంశం అయ్యింది. ఈ సంఘటనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే. ఇప్పటికే సివిల్ డిపార్ట్మెంట్ పై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ సంఘటన మరింత దుమారం రేపుతుంది. సివిల్ డిపార్ట్మెంట్లో ఇటీవల జరిగిన బదిలీలో నిలిపి వేయించుకునేందుకు ఓ అధికారి ప్రయత్నాలు చేయడం. ఈ క్రమంలోనే మద్యం దావత్ సంఘటన వెలుగు చూడడం వెరసి.. అర్జీ-1 సివిల్ డిపార్ట్మెంట్ వివాదంలో పడింది.