వనపర్తి,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం విద్యా, వ్యవసాయ రంగంతో పాటు వైద్య ఆరోగ్య శాఖకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డి అన్నారు. జిల్లాలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సోమవారం అయిన రెండవ రోజు వైద్య పరంగా జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్లు, ఆప్తాల్మాలజీ శస్త్రచికిత్స థియేటర్, ఆధునీకరించి ప్రసూతి వార్డును ప్రారంభోత్సవం చేశారు. నర్సింగాయపల్లి సమీపంలో ఉన్న ఎంసిహెచ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ట్యాంక్ ను ప్రారంభించారు. అక్కడే లక్ష్య కార్యక్రమం కింద చేపట్టిన ప్రసూతి వార్డును కూడా కలెక్టర్ ప్రారంభించారు.
వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెచ్ఐవిపై అవగాహన ర్యాలీ
డిసెంబర్ 1 తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుంచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెచ్ఐవి పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మెగా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ లు హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల సమాజంలో ఉండే అసమానతలు తొలగాలని చెప్పారు.
హెచ్ఐవి పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ హెచ్ఐవి వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అవగాహనతోనే హెచ్ఐవీ వ్యాధి వ్యాప్తిని అరికట్ట వచ్చన్నారు. ఎయిడ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్, జిల్లా వైద్యశాఖ అధికారి శ్రీనివాసులు, వైద్యులు, వైద్యశాఖ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.