calender_icon.png 20 September, 2024 | 5:25 PM

లిప్‌స్టిక్ చరిత్ర పెద్దదే!

17-09-2024 12:00:00 AM

లిప్‌స్టిక్ అంటే మనకు అందమైన పెదాలు మాత్రమే గుర్తుకొస్తాయి. దీన్ని కేవలం ఫ్యాషన్ కోసమే వినియోగిస్తారని మనందరం అనుకుంటాం. కానీ ఈ చిన్న వస్తువుకు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. లిప్ స్టిక్ గురించి చెప్పుకోదగ్గ విశేషాలు ఇంకెన్నో ఉన్నాయి. అవేంటో ఒకసారి చూసేద్దాం..

లిప్‌స్టిక్ లేని మేకప్ కిట్ ఉండదు. కొందరు అమ్మాయిలైతే ఎక్కడికి వెళ్లినా బ్యాగ్‌లో లిప్‌స్టిక్ కూడా తమవెంట తీసుకెళ్తారు. అయితే ఈ ఫ్యాషన్ టూల్‌ని క్రీసు పూర్వం 3700లోనే తయారు చేశారట. మెసాపాటేమియా కాలం నుంచే దీన్ని వినియోగిస్తున్నారని మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. 

మగవారు సైతం..

లిప్‌స్టిక్ వినియోగం క్రీస్తు పూర్వం 2000 ప్రాంతంలో ఈజిఫ్టుకు చేరుకుంది. అప్పుడు రత్నాలను నూరి పొడిగా చేసి దాన్ని పెదాలకు అలంకరించడానికి ఉపయోగించేవారట. ఆ కాలంలో మహిళలతో పాటు పురుషులు కూడా లిప్‌స్టిక్‌ను విస్తృతంగా వినియోగించడం ప్రారంభించారట. మహిళలు కేవలం ఎరుపు రంగు లిప్‌స్టిక్ వాడితే.. పురుషులు వివిధ రంగులు ట్రై చేసేవారని కొందరు రచయితలు తమ రచనల్లో పేర్కొన్నారు. 

వేశ్యలు మాత్రమే..

కొన్ని మూఢనమ్మకాల కారణంగా లిప్‌స్టిక్‌ను కృత్రిమ రంగుగా భావించి పలు ప్రాంతాల్లో దీని వినియోగాన్ని తీవ్రంగా ఖండిచారు. వీటిని ఉపయోగించేవాళ్లను మంత్రగాళ్లు, మంత్రగత్తెలుగా చిత్రీకరించి అవమానించారు. కేవలం వేశ్యలు మాత్రమే లిప్‌స్టిక్ వేసుకోవాలని నిబంధనలు కూడా పెట్టారు. ఆత్మగౌరవం ఉన్న ఏ మహిళా లిప్‌స్టిక్ పెట్టుకోకూడదని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగిందట. మతపరమైన కారణాలు కూడా లిప్‌స్టిక్ వాడకాన్ని చాలా ప్రభావితం చేశాయి. లిప్‌స్టిక్ వాడితే దేవుడు ఇచ్చిన మానవ రూపాన్ని అవమానించినట్లే అని భావించేవారు.

వీటి తయారీలో గొర్రెల చెమట వాడటం, దీంతో మహిళలు అనారోగ్యానికి గురికావటం వంటి సంఘటనలు కూడా ఎన్నో జరిగాయి. అయితే 1920 నాటికి లిప్‌స్టిక్‌ని వినియోగించడం ప్రారంభించారు. అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో దీనిపై నిషేధం కొనసాగుతూనే ఉంది. పెదవులపై లిప్‌స్టిక్ నిగనిగా మెరవడానికి కొన్ని రకాల రసాయనాలను, కొన్ని జంతువుల నుంచి సేకరించిన పదార్థాలను వినియోగిస్తున్నారు. ఇలాంటివేవీ లేని లిప్‌స్టిక్‌లు మార్కెట్‌లో కొన్ని మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి.