calender_icon.png 21 October, 2024 | 12:49 AM

సింహం వడ్రంగి పిట్ట

06-07-2024 02:30:00 AM

సింహం వేట ముగించి చంపిన జంతువులని తింటోంది. తొందర తొందరగా తింటున్న సింహం గొంతులో చిన్న ఎముక అడ్డంగా ఇరుక్కుంది. నోరు మూయలేదు, ఆహారం నమలలేదు. మింగలేక కక్కలేక విపరీతమైన నొప్పితో సింహం విలవిలలాడింది. ఏం చేయాలో తోచక సింహం బాధతో మూలుగుతోంది. 

సమీపంలోని చెట్టుమీద నుంచి వడ్రంగి పిట్ట సింహం బాధ గమనించి ‘ఏమైందని’ అడిగింది. ఎముక ఇరుక్కున్న నోటిని వడ్రంగి పిట్టకు చూపించింది సింహం.

“సింహం రాజమా! నీ సమస్య, బాధ అర్థమయ్యాయి. గొంతులో అడ్డం పడిన ఆ ఎముక ముక్కను నేను తీసేస్తాను. అందుకు నా తల నీ నోట్లో పెట్టాలి కదా? చూసి చూసి సింహం నోట్లో తలపెట్టి ఎవరైనా బతికి బట్టకడతారా? నువ్వు నన్ను గుటుక్కున చప్పరిస్తే నా గతేం కాను?”

అటువంటి భయం ఏం పెట్టుకోవద్దంటూ సింహం బాధగా తలూపింది. నన్ను నమ్ము అన్నట్లు సైగ చేసింది. ‘సరే’నంటూ ధైర్యంగా సింహం ముందు వాలింది వడ్రంగి పిట్ట. ‘ఏమైతే అదయింది, నా జాగ్రత్తలో నేనుండాలి’ అనుకుంది వడ్రంగి పిట్ట. 

సింహం రెండు దవడల మధ్య ఒక కట్టెముక్క పెట్టింది. ఆ కట్టె ఉన్నంత సేపూ సింహం నోరు కదపలేదు. వడ్రంగిపిట్ట తన పొడవాటి ముక్కుతో సింహం నోట్లో ఇరుక్కున్న ముక్కల్ని లాగి బయటకు విసిరేసింది. తన ముక్కుతో ఆ కట్టెముక్కని తీసేసి, క్షణంలో గాలిలోకి ఎగిరిపోయింది. వడ్రంగి పిట్ట. 

ముల్లు తీయగానే నొప్పి తగ్గినట్లు గుచ్చుకున్న ఎముక పోగానే సింహం పెద్దగా ఆవులించింది. మళ్లీ వేటకి వెళ్లిపోయింది. రోజులు గడుస్తున్నాయి. ‘తను లోగడ చేసిన మేలు సింహానికి గుర్తుండుంటుందిలే’ అనుకుంది వడ్రంగి పిట్ట. 

“మిత్రమా సింహరాజామా! నీవు ఆపదలో ఉన్నప్పుడు నీకో సాయం చేశాను, గుర్తుందా? మరి ఇప్పుడు నాకో సహాయం చేస్తావా?” అనడిగింది పిట్ట. 

“ఏమిటేమిటీ! నువ్వు నాకు సహాయం చేశావా? నీకు నేను తిరిగి సహాయం చేయాలా?” అంది సింహం. 

అవునన్నట్టు తలూపింది వడ్రంగి పిట్ట. సింహం కొంచెం ఆలోచించి.. “అయితే ఆ రోజు నేను నీకు చేసిన మేలు మరచిపోయావా?” అని అడిగింది వడ్రంగి పిట్టని. “అవునా! నువ్వు నాకేం సహాయం చేశావు?” ఆశ్చర్యంగా అడిగింది వడ్రంగి పిట్ట. “నేనా, ఏం చేశానా? ఆ రోజు నువ్వు నా నోట్లో తలపెట్టావు. అయినా నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టాను. గుర్తుందా? ఇంతకన్నా ఇంకేం ‘మేలు’ చేయాలి నీకు” అంది సింహం. 

దిమ్మెరబోయింది వడ్రంగి పిట్ట. ఇకపై ఇటువంటి పనికిమాలిన స్నేహాలు, సహాయాలు, సాహసాలు ఎప్పుడూ చేయకూడదు అనుకుంది. స్నేహం సమవుజ్జీలతో చేయటమే మేలంటారు పెద్దలు.