26-04-2025 07:13:05 PM
బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్తే అనారోగ్యానికి గురైన బాధితుడు..
తనను స్వదేశానికి తీసుకురావాలని సెల్ఫీ వీడియో..
మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో క్షేమంగా ఇంటికి..
హుస్నాబాద్ (విజయక్రాంతి): ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందనేందుకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన చొప్పరి లింగయ్య ఉదంతం ఉదాహరణగా నిలుస్తోంది. బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. స్వదేశానికి తిరిగి రాలేక దుర్భర పరిస్థితుల్లో చిక్కుకున్న ఆయనను ప్రభుత్వం క్షేమంగా ఇంటికి తీసుకువచ్చింది. లింగయ్య తన గోడును సెల్ఫీ వీడియో ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు విన్నవించుకున్నాడు.
స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ లింగయ్యను ఇంటికి తీసుకువచ్చేందుకు చొరవ తీసుకున్నారు. గత వారం తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న లింగయ్య, తనను స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటూ వీడియో సందేశం పంపాడు. స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ ప్రభుత్వం తరపున తక్షణ సహాయాన్ని అందించారు. ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ బీఎం వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డితో సమన్వయం చేసి, దుబాయ్‌లో ఉన్న లింగయ్యకు అవసరమైన వైద్య సహాయాన్ని అందించేలా చర్యలు తీసుకున్నారు. లింగయ్య శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నాడు. అక్కడి నుంచి తన స్వగ్రామం హుస్నాబాద్‌కు సాయంత్రం వచ్చాడు.
కష్టకాలంలో తనను ఆదుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కు, తన బాగోగులు చూసుకునేందుకు ప్రతినిధులను పంపినందుకు, ఫ్లైట్ టికెట్ డబ్బులు చెల్లించి స్వగ్రామానికి తీసుకొచ్చినందుకు లింగయ్య, ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటన తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల పట్ల ఎంతటి శ్రద్ధ కలిగి ఉందో తెలియజేస్తోంది. ఎన్నో ఆశలతో గల్ఫ్ దేశాలకు వెళ్లిన కార్మికులు అనారోగ్యం పాలై, సరైన సహాయం అందక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. గల్ఫ్‌లో సమస్యలు ఎదుర్కొంటున్న కార్మికులకు సహాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నారై అడ్వైజరీ కమిటీ ద్వారా గల్ఫ్ కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ గల్ఫ్ విధానాలు కార్మికుల హక్కులను పరిరక్షించడం, వారికి భద్రత కల్పించడమే లక్ష్యంగా రూపొందించబడ్డాయి. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లే వారికి సరైన మార్గదర్శకాలు అందించడం, అక్కడ వారు ఎదుర్కొనే సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. అవసరమైతే చట్టపరమైన సహాయం అందించడానికి కూడా ప్రభుత్వం వెనుకాడడం లేదు. ఈసందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, "గల్ఫ్‌లో ఉన్న మన తెలంగాణ బిడ్డల సంక్షేమం మా ప్రభుత్వానికి అత్యంత ముఖ్యం. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి సాయం అందించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం" అని అన్నారు. చొప్పరి లింగయ్యను క్షేమంగా స్వస్థలానికి చేర్చడం తమకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న ఈ శ్రద్ధ, తీసుకుంటున్న చర్యలు గల్ఫ్‌లో ఉన్న తెలంగాణ కార్మికులకు ఒక భరోసానిస్తున్నాయని పలువురు కార్మికులు అంటున్నారు.