18-03-2025 12:00:00 AM
హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోకుంటే తిరుమలకే వచ్చి తేల్చుకుంటామని ఎంపీ రఘునందన్ చేసిన వ్యాఖ్యలపై టీటీడీ స్పందించింది. సోమవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ర్ట ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని కల్పించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఈ విధానం మార్చి 24 నుంచి అమల్లోకి రానుందని పేర్కొన్నారు. సోమ, మంగళవారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చే సిఫార్సు లేఖలను ఆది, సోమవారాల్లో మాత్రమే స్వీకరించనున్నట్లు తెలిపింది. రూ. 300 దర్శనం టికెట్లకు సంబంధించి సిఫార్సు లేఖలను బుధ, గురువారాల్లో అదే రోజుకు స్వీకరించనున్నట్లు పేర్కొంది. ఒకరికి ఒక సిఫార్సు లేఖను మాత్రమే ఆరుగురికి మించకుండా స్వీకరిస్తామని తెలిపారు.
తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలను, ఇతర భక్తుల దర్శన సమయాలను దృష్టిలో ఉంచుకుని సుదీర్ఘంగా చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మార్పులను దృష్టిలో ఉంచుకొని భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.