calender_icon.png 3 April, 2025 | 7:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీకి లైన్ క్లియర్

29-03-2025 02:22:28 AM

ప్రభుత్వ అనుమతి

ఎఫ్‌ఐఆర్ నమోదుకు సుప్రీం నిరాకరణ

న్యూఢిల్లీ, మార్చి 28: ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీకి ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఢిల్లీ హైకోర్టులో విధులు నిర్వర్తిస్తున్న యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే. కొలీజియం నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ వ్యతిరేకించినా కానీ ప్రభుత్వం మాత్రం సుప్రీం కొలీజియం నిర్ణయంతో ఏకీభవించింది. మరిన్ని బార్ అసోసియేషన్‌లు కూడా అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ పోరాటానికి మద్దతు తెలిపాయి. 

ఏ పని అప్పగించొద్దు.. 

జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసినా కానీ అతడికి మాత్రం ఎటువంటి విధులు అప్పగించొద్దని ప్రధాన న్యాయమూర్తికి ఆదేశాలు అందాయి. ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న జస్టిస్ చంద్ర ధరి సింగ్ బదిలీకి కూడా ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. దీంతో ఆయన కూడా అలహాబాద్ హైకోర్టుకు వెళ్లనున్నారు. యశ్వంత్ వర్మతో పాటు చంద్రధరి సింగ్ కూడా 2021లో ఢిల్లీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. ప్రస్తుతం జస్టిస్ వర్మకు ఢిల్లీ హైకోర్టులో కూడా ఎటువంటి న్యాయ విధులు అప్పగించడం లేదు. 

వర్మపై పిటిషన్.. తోసిపుచ్చిన సుప్రీం

జస్టిస్ వర్మ మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలవగా సుప్రీం దానిని తోసిపుచ్చింది. ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఈ విషయం విచారణ చేస్తోందని విచారణ ముగిసిన అనంతరం ఎఫ్‌ఐఆర్ నమోదుపై చర్యలు తీసుకుంటామని సుప్రీం తెలిపింది. ‘అంతర్గత విచారణ కొనసాగుతోంది. ఈ సమయంలో పిటిషన్‌ను స్వీకరించం. అంతర్గత కమిటీ చెబితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయొచ్చు. తొందరపాటు చర్యలు వద్దు’ అని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. 

పిటిషన్ తొందరపాటు చర్య

అంతర్గత విచారణను కూడా సవాలు చేస్తూ సుప్రీం పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు వ్యాఖ్యానిస్తూ ఇది తొందరపాటు చర్యగా అభివర్ణించింది. ఈ పిటిషన్‌ను మాథ్యూస్, హేమాలీ సురేష్ అనే ఇద్దరు అడ్వొకేట్స్ దాఖలు చేశారు. ఘటన జరిగి వారం రోజులవుతున్నా కానీ ఇప్పటి వరకు ఎటువంటి అరెస్టులు లేవని ఎత్తి చూపారు. అంతర్గత విచారణకు ఎటువంటి చట్టబద్ధ అధికారం లేదని కూడా పేర్కొన్నారు.