- ఎఫ్‌పీఐ పెట్టుబడులు, జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాల ప్రభావం
ఈ వారం మార్కెట్‌పై విశ్లేషకుల అంచనాలు
ముంబై, జూన్ 23: నాలుగు రోజుల ట్రేడింగ్‌కే పరిమితమైన జూన్ 21తో ముగిసిన వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్పంగా 0.4 శాతం పెరిగినప్పటికీ, కొత్త రికార్డుస్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడికి లోనయ్యింది. సూచీలు కొత్త రికార్డుస్థాయికి చేరినా, ట్రేడింగ్ శ్రేణి పరిమితంగా ఉండి, మూమెంటం నెమ్మదించిందని విశ్లేషకులు తెలిపారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ట్రేడింగ్ శ్రేణి 23,350 పాయింట్ల మధ్య నిర్ణీతశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యింది. ఈ కదలికల ఆధారంగా చూస్తే వచ్చే వారంలో నిఫ్టీ పరిమితశ్రేణిలో కన్సాలిడేట్ అయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సోమవారం మార్కెట్ ప్రారంభమైన వెంటనే జీఎస్టీ కౌన్సిల్ జూన్ 22న ప్రకటించిన నిర్ణయాలపై స్పందిస్తుందని, అటుతర్వాత అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులకు అనుగుణంగా కదులుతుందని అంటున్నారు. గతవారం మొత్తం మీద నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 30 శాతంపైగా పెరిగి మంచి ప్రదర్శన కనపర్చినందున, ఈ రంగం షేర్లు వెలుగులో ఉండవచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌స్మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ చెప్పారు.
భారీ కొనుగోళ్లు లేదా అమ్మకాలు జరగడానికి తగిన ట్రిగ్గర్లు లేనందున ఈ వారం సైడ్‌వేస్‌లోనే కదులుతుందని గౌర్ అంచనా వేశారు. అంతర్లీన సెంటిమెంట్ బుల్లిష్‌గా ఉన్నందున, మార్కెట్ తగ్గుదలను కొనుగోళ్లకు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ వారం మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు..
జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు
శనివారం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ నిర్ణయంతో ఎరువుల రంగ షేర్లు ఈ వారం హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఎరువులపై ప్రస్తుతం విధిస్తున్న 5 శాతం జీఎస్టీని ఎత్తివేయాలని, ఎరువుల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలపై జీఎస్టీని 18 శాతం నుంచి తగ్గించాలంటూ పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సులను జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ కమిటీకి కౌన్సిల్ రిఫర్ చేసిన సంగతి తెలిసిందే.
అలాగే సోమవారం ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీల షేర్లు తగ్గే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ రంగంపై ప్రస్తుతం విధిస్తున్న 28 శాతం జీఎస్టీని సమీక్షిస్తారన్న పరిశ్రమ అంచనాలు నెరవేరలేదు. ఈ అంశాన్ని కౌన్సిల్ సమావేశంలో చర్చించనేలేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
అంతర్జాతీయ సంకేతాలు
టెక్నాలజీ షేర్లు తగ్గడంతో వాల్‌స్ట్రీట్ సూచీలు గత గురు, శుక్రవారాల్లో బలహీనంగా ముగిసాయి. ఈ సోమవారం భారత్ మార్కెట్ ప్రారంభసమయంలో యూఎస్ ఫ్యూచర్స్‌కు అనుగుణంగా స్పందిస్తుందని చెపుతున్నారు. అలాగే ఈ వారం యూఎస్ ఫెడ్ గవర్నర్ వాలర్, ఎఫ్‌ఓఎంసీ మెంబర్ మేరీ డాలే చేసే ప్రసంగాల్లో వారు వడ్డీ రేట్ల బాటపట్ల వెల్లడించే సంకేతాలు కూడా ఈ వారం మార్కెట్లకు కీలకమని అనలిస్టులు వ్యాఖ్యానించారు. ఈ వారం యూరోజోన్ వినిమయ ద్రవ్యోల్బణం, వినియోగ విశ్వాసం గణాంకాలు వెల్లడవుతాయి. చైనాలో పారిశ్రామిక రంగం లాభాల డేటా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గణాంకాలు వెలువడతాయి.
ఎఫ్‌పీఐ పెట్టుబడులు
ఏప్రిల్, మే నెలల్లో భారీ అమ్మకాలు జరిపిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఇటీవల భారీ కొనుగోళ్లు చేయడంతో జూన్‌లో వారు ఇప్పటివరకూ వారు భారత మార్కెట్లో రూ. 12,170 కోట్లు నికర పెట్టుబడులు చేసినట్లయ్యింది. అయితే గత శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 1,700 కోట్ల మేర నికర అమ్మకాలు జరపగా, దేశీయ సంస్థలు రూ.1,200 కోట్లకుపైగా నికర కొనుగోళ్లు చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్‌పై ఎఫ్‌పీఐల పెట్టుబడుల శైలి ప్రభావం చూపుతుందని విశ్లేషకులు తెలిపారు.
రూపీ వర్సస్ డాలర్
ముగిసిన వారంలో డాలరు మారకంలో రూపాయి విలువ రికార్డు కనిష్ఠ స్థాయి 83.69 వద్దకు క్షీణించిన నేపథ్యం లో దేశీయ మార్కెట్లపై ఈ సెంటిమెంట్ ప్రభావం ఉంటుందని అనలిస్టులు భావిస్తున్నారు. శుక్రవారం ఇది 83.57 స్థాయికి కోలుకున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో డాలరు బలపడుతున్నందున, రూపాయి బలహీనంగానే ట్రేడవుతుందని ఫారిన్ ఎక్సేంజ్ ట్రేడర్లు చెప్పారు. ఈ వారం రూపాయి 83.20 రేంజ్‌లో ట్రేడ్‌కావచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కరెన్సీ అనలిస్ట్ అనూజ్ చౌదరి అంచనా వేస్తున్నారు.
23.400 జోన్‌లో కన్సాలిడేషన్
నిఫ్టీ డెయిలీ చార్లుల్లో 23,400 23,700 పాయింట్ల శ్రేణిలో కన్సాలిడేషన్ జరుగుతున్న సాంకేతిక సంకేతాలు వెల్లడవుతున్నాయని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అరవిందర్ సింగ్ నందా తెలిపారు. కొనుగోళ్లకు తగిన ట్రిగ్గర్లు ఏవీ లేనందున ఈ వారం కూడా ఇదే ట్రెండ్ కొనసాగవచ్చని విశ్లేషించారు. బ్యాంక్ నిఫ్టీ గతవారం 51,500 పాయింట్ల పైన ముగిసినందున ఈ సూచీలో మాత్రం బుల్లిష్ ట్రెండ్ కొనసాగవచ్చని అంచనా వేశారు. 53,000 స్థాయివైపు ఈ సూచీ వెళ్లాలంటే 52,200 పాయింట్ల స్థాయిని పటిష్ఠంగా బ్రేక్ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ వారం బ్యాంక్ నిఫ్టీకి 50,500 జోన్‌లో గట్టి మద్దతు లభిస్తున్నదని, ఈ రేంజ్‌ను దిగువవైపు బ్రేక్ చేస్తే 49,000 పాయింట్ల దిశగా క్షీణించవచ్చని అంచనా వేశారు.