calender_icon.png 23 December, 2024 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీబీఐ అధికారాల మీమాంస

11-07-2024 12:00:00 AM

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు భారీ ఊరట లభించింది. తమ పరిధిలోని కేసులను విచారించడానికి అనుమతించడం ద్వారా సీబీఐని దుర్వినియోగం చేశారంటూ కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు అర్హమైందిగా పరిగణించింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం వాదనను తోసి పుచ్చింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ మేర కు బుధవారం తీర్పు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చే కేసులను ఏకపక్షంగా సీబీఐకి పంపడం ద్వారా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నదని బెంగాల్ ప్రభుత్వం ఆరోపిస్తున్నది.

రాజ్యాంగంలోని 131 అధికరణం ప్రకారం  కేంద్రంపై బెంగాల్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఇప్పుడు రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు అధికార పరిధిని సుప్రీంకోర్టు సమీక్షించనుంది. బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను మెరిట్ ప్రాతిపదికన విచారించనుంది. ఏయే సమస్యలను వినాలనేది ఆగ స్టు 13న నిర్ణయిస్తుంది. తదుపరి విచారణను సెప్టెంబర్‌లో చేపట్టనుంది. సీబీఐపై తమకు నియంత్రణ లేదంటూ కేంద్ర ప్రభుత్వం గతంలో చేసిన వాదనను అంగీకరించేందుకు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు నిరాకరించింది. రాష్ట్రాల పరిధిలోని కేసుల విచారణకు సీబీఐని ఎవరు పంపుతారని ప్రశ్నించింది. 2018 నవంబర్‌లో ఢిల్లీ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లోని సెక్షన్ 6 ప్రకారం తమ భూభాగంలో సీబీఐకి తమ సమ్మతిని ఉపసంహరించుకున్నట్లు బెంగాల్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

సమ్మతిని ఉప సంహరించుకున్న తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం సీబీఐని రాష్ట్రానికి పంపి విచారణ జరుపుతున్నదని రాష్ట్రం అంటున్నది. సీబీఐ పశ్చిమ బెంగాల్‌లో  15కు పైగా కేసులు నమోదు చేసింది. అయితే, సీబీఐ ఎక్కడ ఎలా దర్యాప్తు చేస్తుందో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ఈ కేసు విచారణార్హమైంది కాదని, దీన్ని మొదట్లోనే కొట్టి వేయాలని కోరారు. ఈ సందర్భంగా జస్టిస్ మెహతా సీబీఐని నియంత్రించే డీఎస్‌పీఈ చట్టంలోని సెక్షన్ 5(1)ని ప్రస్తావించారు. ఈ సెక్షన్ కేంద్ర పాలిత ప్రాంతాలు మినహా రాష్ట్రాల్లో సీబీఐ దర్యాప్తును ఆదేశించే అధికారాన్ని ఇస్తుంది. సీబీఐ అధికారాలు, అధికార పరిధిని నిర్వచించే హక్కును ఈ సెక్షన్ ప్రభుత్వానికి ఎందుకు ఇస్తుందని జస్టిస్ మెహతా తుషార్ మెహతాను ప్రశ్నించారు. 

కాగా, మే 8న ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేయడానికి ముందు కోర్టు రెండు సందర్భాల్లో లోతుగా విచారణ జరిపింది. అందులో ఒకటి సందేశ ఖాలి అల్లర్ల కేసు. తమ భూములను కబ్జా చేయడంతోపాటు తమను లైంగికంగా వేధిస్తున్నాడని  తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్‌కు వ్యతిరేకంగా సందేశ్ ఖాలీ మహిళలు ఉద్యమించారు. ఘటనపై సీబీఐ దర్యాప్తుకు కలకత్తా హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణ చేపట్టిన సీబీఐ షాజహాన్‌ను అరెస్టు చేసి జైలుకు పంపింది. ప్రస్తుతం  ఈ కేసు విచారణ జరుగుతున్నది. టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణం, నారదా చిట్‌ఫండ్స్ కుంభకోణం లాంటి సంచలన కేసులనూ సీబీఐ దర్యాప్తు చేస్తున్నది.

వీటిలో టీచర్ల రిక్రూట్‌మెంట్ కేసులో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా సీబీఐ దర్యాప్తుకు కేంద్రం ఆదేశించడంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి, కేంద్రంలోని బీజేపీకి మధ్య వార్ ఈనాటిది కాదు. ప్రస్తుత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ బెంగాల్‌లో గవర్నర్‌గా పని చేసినప్పటి నుంచీ ఇది కొనసాగుతున్నది. ఇప్పటి గవర్నర్ ఆనంద్ బోస్, దీదీ మధ్య సంబంధాలూ అంతంత మాత్రమే. మమతను తప్పించి రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడేలా చూడాలన్న కమలనాథుల ప్రయత్నాలు ఫలించక పోవడమే ఈ గొడవలన్నిటికీ మూల కారణం. ఇది ఎంతకాలం సాగుతుందో చూడాలి.