calender_icon.png 28 September, 2024 | 4:56 AM

ఫార్మాసిటీ ఉన్నట్టా? లేనట్టా?

27-09-2024 01:54:49 AM

మీటింగుల్లో రద్దుచేశామని చెప్పారు

కోర్టులో రద్దుచేయలేదని చెప్తున్నారు

ఫార్మాసిటీ భూములతో సీఎం సోదరుల దందా

ఉంటే ఫార్మాసిటీ 14 వేల ఎకరాల్లో ఉండాలి

లేదంటే రైతులకు భూములు తిరిగిచ్చేయాలి

ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ 

వారి రియల్ ఎస్టేట్ దందా కోసమే నాటకాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాం తి): ఫార్మా సిటీ రద్దు వెనుక వేల కోట్ల రూపాయల భూ కుంభకోణం దాగి ఉందని, సీఎం రేవంత్ తన అన్నదమ్ములకు వేల కోట్లు దోచిపెట్టేందుకు భూ మాయ కుట్ర చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆరోపించారు. హైదరాబాద్ ఫార్మాసిటీ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలనే కాకుండా రాష్ర్ట అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. ఫార్మాసిటీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. 

‘ఫార్మాసిటీని రద్దుచేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు. రాష్ట్ర మంత్రులు కూడా ఫార్మాసిటీ రద్దయ్యిందని చెప్పారు. కోర్టుకు మాత్రం అధికారులు ఫార్మాసిటీని రద్దుచేయలేదని తెలిపారు. ఇంతకూ ఫార్మాసిటీ ఉన్నట్టా? లేనట్టా? దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వా లి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా హైదరాబాద్ ఫార్మాసిటీని రద్దు చేసి రైతులకు భూమిని తిరిగి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

అధికారంలో కి వచ్చిన వెంటనే ఫార్మా సిటీని రద్దుచేస్తున్నామని, ఆ స్థానంలో ఫార్మా విలేజీలు, ఫార్మా క్లస్టర్లు ఏర్పాటుచేస్తామని అసెంబ్లీతోపాటు అనేక వేదికలపై ప్రకటించిందని గుర్తుచేశారు. ఫార్మాసిటీ రద్దు విషయంలో మాయ మాటలతో మభ్యపెట్టి, అనేక ఆర్థిక అవకతవకలకు, భూదందాలకు తెరలేపుతోందని విమర్శించారు. 

ఇదే హైదరాబాద్ ఫార్మాసిటీని పేరు మార్చి ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిటీ కొత్త పేర్లను తెరపైకి తెచ్చి అతిపెద్ద అవినీతి కుంభకోణానికి కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ చేసిందని మండిపడ్డారు. సర్కార్ చేస్తున్న ఈ మాయాజాలం రాష్ర్ట ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయిందని కేటీఆర్ స్పష్టం చేశారు. 

న్యాయస్థానాలకూ తప్పుడు సమాచారం..

ఫార్మాసిటీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టును, న్యాయమూర్తులను కూడా తప్పుదోవ పట్టించే విధంగా కోర్టులో కూడా అబద్ధాలు చెబుతుందని కేటీఆర్ మండిపడ్డారు. కోర్టులను కూడా తప్పుదోవ పట్టించాలనే సర్కార్ ప్రయ త్నం ఎంతో కాలం సాగదని స్పష్టం చేశా రు. అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్క ఎకరం భూమినైనా సేక రించిందా? అని నిలదీశారు. ఒక్క ఎకరం సేకరించకుండా, హైకోర్టుకు తెలిపినట్లు ఫార్మాసిటీని రద్దు చేయకుండా కాంగ్రెస్ సర్కారు చెబుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీలను ఎక్కడ కడతారో చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ చేసిన భూసేకరణ చట్టం ప్రకారమే ఫార్మాసిటీ భూములను ఇతర అవసరాలకు వాడుకునే అవకాశం లేనే లేదని తెలిసిన తర్వాత కూడా నిబంధనల ను తుంగలో తొక్కి గౌరవ న్యాయస్థానం ముందు వాస్తవాలను దాచే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రితోపాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర మంత్రులు ప్రకటించిన విష యం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం ఫార్మాసిటీపై స్పష్టమైన ప్రకటన చేసి హైకోర్టుకు వాస్తవా లను తెలియజేయాలని సూచించారు. తాము 14 వేల ఎకరాల్లో, రూ.64 వేల కోట్ల పెట్టుబడులతో ఫార్మాసిటీని ప్రతిపాదించామని కేటీఆర్ తెలిపారు. ఫార్మా సిటీకి భూములిచ్చి వేలాదిమంది రైతులకు తమ భూమిని ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగిస్తుందో తెలుసుకునే హక్కు ఉం దని అన్నారు. 

ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు ఆ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటామంటే చూస్తూ ఊరుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరని హెచ్చరించారు. ఉంటే ఫార్మాసిటీ తాము ప్రతిపాదించిన 14 వేల ఎకరాల్లో ఉండాలని, లేదంటే రైతులకు వారిచ్చిన భూములను తిరిగి ఇచ్చేయాలని డిమాం డ్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను రద్దు చేస్తే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు.