calender_icon.png 16 November, 2024 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ పాలనలా.. డిట్టో

16-11-2024 02:24:41 AM

  1. బోగస్ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
  2. మూసీపై సవాల్‌ను స్వీకరిస్తున్నా.. బస్తీలోనే భోజనం.. అక్కడే నిద్ర
  3. కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): మూసీ పరిసర ప్రాంతంలో ఒక్కరోజు నిద్రపోండి.. అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌ను స్వీకరించి శనివారం నాడు మూసీ బస్తీలోనే నిద్రకు వెళ్తున్నట్లు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. మూసీ ప్రజల కోసం ఒక్క రోజు కాదు, మూడు నెలల పాటు నిద్ర చేయడానికి కూడా తాము సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు.

మూసీ ప్రక్షాళన పేరిట హైదరాబాద్‌లో పేదల ఇండ్లు కూల్చి నల్లగొండలో రైతులను రెచ్చగొడుతున్నారని ఆయన విమ ర్శించారు. శుక్రవారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలో కేసీఆర్ పాలనలాగే ఏడాదిగా రేవంత్‌రెడ్డి పాలన కూడా కొనసాగిందని ఎద్దేవా చేశారు.

మూసీ ప్రక్షాళనకు అడ్డొస్తే బుల్డోజర్లతో తొక్కిస్తామని సీఎం అంటున్నారని.. పేదల కోసం తాము చావడానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. మూసీని కొబ్బరి నీళ్లలా మారుస్తామన్న కేసీఆర్.. ఏమీ చేయకుండానే వెళ్లిపోయారని.. ఇప్పుడు రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు కూల్చడం, నల్లగొండలో రైతులను రెచ్చగొట్టారు తప్పితే చేసిందేమీ లేదన్నారు.

ఢిల్లీలో కేటీఆర్ ఎవరినీ కలిసింది లేదని.. అయినా ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవ్వరినైనా కలవవచ్చునని తెలిపారు. గవర్నర్ ఏ సంతకం పెడుతున్నారో కేంద్రం పర్యవేక్షిస్తుందా అని ప్రశ్నించారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేయకుండా బీజేపి అడ్డుకుంటుందనే తప్పుడు ప్రచారం చేస్తున్నా రని, అయినా తాము దీనిని పట్టించుకోమని తెలిపారు. ఎవరైనా ఏదైనా ఊహించుకోవచ్చని అన్నారు.  

మహారాష్ట్రలోనూ తప్పుడు హామీలు..

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు, హామీలను అమలుచేయకుండా మహారాష్ర్టలోనూ తప్పుడు హామీలు, అబద్ధపు ప్రచారాలు చేస్తున్నదని కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.  మహారాష్ర్ట ఎన్నికల ప్రచారంలో తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వాలను స్వర్గసీమ అంటూ రాహుల్ గాంధీ పొగుడుతుంటే.. రేవంత్ రెడ్డి జబ్బలు చర్చుకుం టున్నారని ఎద్దేవా చేశారు. 

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వంటి నేతలు తెలంగాణలో యాత్రలు చేపట్టి అనేక రకాల హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటీ సరిగ్గా అమలు చేయలేదన్నారు.

ధాన్యం కొనుగోలు కోసం ప్రతి నయా పైసా కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నప్పటికీ.. రాష్ర్ట ప్రభుత్వం, అధికార యంత్రాంగం మాత్రం కొనుగోలు చేయడంలో వైఫల్యం చెందినట్లు ఆరోపించారు. కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే చిత్తశుద్ధి అనేది లేదని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్.. రెండు పార్టీల డీఎన్‌ఏ ఒకటేనని ఆయన అన్నారు. ఒకరిపై మరొకరు డూప్ ఫైటింగ్ చేయడం వారికి అలవాటేనని ఎద్దేవా చేశారు.  

ఒవైసీ, రాహుల్ ఆదేశాలతో..

అసదుద్దీన్ ఒవైసీ, రాహుల్ గాంధీ ఆదేశాలతో పోలీసు అధికారుల బదిలీలు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. గతంలో పాంహౌస్‌లలో దొంగతనంగా వీడియోలు తీసేందుకు అధికార యంత్రాంగాన్ని బీఆర్‌ఎస్ వాడుకుందని... ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదేవిధంగా పోలీసులను ఆడిస్తున్నదన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణలో కాంగ్రెస్ సర్కారు వైఫల్యం చెందిందని.. వరుసగా దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. హిందువులను అవమానిస్తూ, రెచ్చగొట్టే విధంగా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా దాడులు జరుగుతున్నా స్పందించకోపోగా... తమ ఆవేదన వ్యక్తం చేసిన హిందువులు, భక్తుల మీద హత్యానేరం కింద కేసులు పెడుతున్నారని అన్నారు.