calender_icon.png 1 October, 2024 | 3:02 AM

వెయ్యి ఎలుకల తిన్న పిల్లి కాశీకి పోయినట్టు

01-10-2024 01:02:18 AM

రుణమాఫీపై బీజేపీ నేతల వ్యాఖ్యలు సరికాదు

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో చాలామంది రైతులకు రుణమాఫీ జరగలేదని బీజేపీ నేతల వ్యాఖ్యలు.. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్టు ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ఆ పార్టీ చేసిన వాగ్ధానాలు ఏమయ్యాయని నిలదీశారు. రైతుల ఆదాయం రెట్టింపు కాదు, గత పదేళ్లలో పెరిగిన ఖర్చులతో పోల్చుకుంటే నికరాదాయం పెరగని వాళ్లందరికి మీ దగ్గర సమాధానం ఉందా అని ప్రశ్నించారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ర్టంలోనైనా రుణమాఫీ చేసి చూపించగలరా, కొన్ని లక్షల కోట్లు ఎగ్గొట్టిన పారిశ్రామిక వేత్తల నుంచి నిధులు రికవరీ చేసి దేశవ్యాప్తంగా ఉన్న రైతుల రుణమాఫీ చేయగల నిబద్ధత మీకుందా? అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ మానిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకు భరోసా కల్పించే బాధ్యత తమదేనని, ఇప్పటికే సన్న వడ్లను రూ.500 బోనస్ ప్రకటించామని స్పష్టంచేశారు.

కేంద్రంలో రాష్ర్ట ప్రయోజనాల గురించి, రాష్ర్ట రైతాంగ ప్రయోజనాల గురించి మాట్లాడని నేతలంతా.. నేడు రాష్ర్ట ప్రభుత్వం ఆర్థికస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కూడా, మాటకు కట్టుబడి, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంటే, వారి అక్కసు ఈ విధంగా వ్యక్తం చేస్తూ మాట్లాడటం సరికాదనేది యావత్తు తెలంగాణ అభిప్రాయమన్నారు. 

రైతు అమరుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి 

రైతు ఉద్యమం సందర్భంగా అమరులైన 708 మందికి పైగా రైతు కుటుంబాలకు తక్షణ పరిహారం చెల్లించి, రైతుల డిమాండ్లు పరిష్కరించేవిధంగా ప్రయత్నాలు చేయాలని బీజేపీ పెద్దలను కోరారు. రుణమాఫీ 2024లో అక్కడక్కడా ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలను ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ అర్హులైన ప్రతి ఒక్క రైతు కుటుంబానికి వర్తింపచేసే విధంగా చర్యలు తీసుకొంటున్నామని స్పష్టంచేశారు.

సందేహాలు ఉంటే బీజేపీ నాయకులు స్వయంగా వచ్చి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. ఇప్పటివరకు 22 లక్షల మందికి 18 వేల కోట్లు రుణ మాఫీ చేసామని, రుణమాఫీ కాని వారికి సంబంధించి కుటుంబ సభ్యుల నిర్ధారణ సర్వే చేస్తున్నామని చెప్పారు.