calender_icon.png 27 October, 2024 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూరగాయలకు కేరాఫ్ వంటిమామిడి

22-07-2024 01:17:46 AM

వంటిమామిడి అంటే.. టక్కున గుర్తుకు వచ్చేది కూరగాయల మార్కెట్..

* ఈ మార్కెట్ నుంచి ఒక్కరోజు కూరగాయల క్రయవిక్రయాలు జరగకపోతే హైదరాబాద్ అల్లాడుతుంది. ఎందుకంటే మహానగరానికి కూరగాయలు అందించేది వంటిమామిడే. ప్రతిరోజు ౪౦౦ క్వింటాళ్ల తాజా కూరగాయలు ఈ మార్కెట్ నుంచి సరఫరా అవుతున్నాయి.

 ఎవ్రీడే మార్కెట్

  1. రోజూ రూ.లక్షల్లో కూరగాయల విక్రయాలు
  2. ఉదయం రూ.10లక్షలు, రాత్రి రూ.30లక్షలు
  3. ప్రతీ రోజు 400 క్వింటాళ్ల అమ్మకం
  4. హైదరాబాద్‌కు తాజా కూరగాయలు ఇక్కడి నుంచే
  5. ఒక్కరోజు మార్కెట్ బందైనా నగరవాసులకు ఇబ్బందే

సిద్దిపేట/గజ్వేల్, జూలై 21(విజయక్రాంతి): హైదరాబాద్ నగరానికి అతి చేరువ లో ఉన్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రాంతంలోని వంటిమామిడి మార్కెట్ నుంచి కూర గాయలు దిగుమతి అవుతుంటాయి. ప్రతీరోజు ఉదయమే రైతులు తెచ్చిన తాజా కూరగాయలను హైదరాబాద్‌లోని బోయినిపల్లి, గుడిమల్కాపూర్, గడ్డిఅన్నారంతో పాటు వివిధ మార్కెట్‌లకు వ్యాపారులు ఇక్కడి నుంచే కూరగాయలు తీసుకెళ్లి అమ్ముతుంటారు. దీంతో హైదరాబాద్‌లోని ప్రతీ గల్లీలో ఇక్కడి కూరగాయలే లభిస్తాయి. 

నిత్యం జనసందోహమే

తాజా కూరగాయలకు వంటిమామిడి మార్కెట్ ప్రసిద్ధి. నిత్యం కూరగాయలు కొనుగోలు చేసే వారితో పాటు వ్యాపారులతో మార్కెట్ జనసందోహంగా ఉంటుంది. ఇక్కడ రెండు పూటల (ఉదయం, రాత్రి) మార్కెట్ నిర్వహిస్తారు. ఉదయం రూ.10లక్షలు, రాత్రి రూ.30లక్షల విలువ గల కూర గాయల క్రయవిక్రయాలు జరుగుతాయి. తెల్లవారుజాము నుంచే రైతులు తాజా కూరగాయలను ఇక్కడికి తెచ్చి వ్యాపారులతో పాటు వినియోగదారులకు విక్రయిస్తారు.

గజ్వేల్ ప్రాంతంలో అత్యధికంగా పండించే కొత్తిమీర, కరివేపాకు, ఆకుకూరలతో పాటు టమాట, వంకాయ, బీర, చిక్కుడు, బెండ, దొండ, గోరుచిక్కుడు, సొర, కాకర, మునగ, గోబీ, బీట్‌రూట్, ఆలుగడ్డ, పచ్చిమిర్చి, క్యాబేజీ, కీర, దోస, బోడకాకర, చామగడ్డ, పొట్లకాయ, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ కూరగాయలు ఇక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు వ్యాపారులు తరలిస్తారు. హైదరా బాద్‌తో పాటు బెంగూళూరు, తమిళనాడు రాష్ట్రాలకు కూడా తరలించి విక్రయిస్తారు. 

వివిధ జిల్లాల నుంచి రైతుల రాక

వంటిమామిడి మార్కెట్‌కు సిద్దిపేట జిల్లాతో పాటు మెదక్, కరీంనగర్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాల నుంచి రైతులు కూరగాయలు తెస్తుంటారు. ప్రతి రోజు సుమారు 400క్వింటాళ్లకు పైగా కూరగాయల విక్రయాలు జరుగుతాయి. కూరగాయలు తెంపిన కొద్ది గంటలకే హైదరాబాద్ వ్యాపారులు కొని వాటిని తరలించి నగరంలో ప్రజలకు అమ్ముతారు. 

వెజిటేబుల్ హబ్‌కు ప్రతిపాదనలు

వంటిమామిడి మార్కెట్‌ను వెజిటెబుల్ హబ్‌గా మార్చేందుకు గత ప్రభుత్వంలోనే ప్రతిపాదనలు రూపొందించారు. అందు కు అవసరమైన భూమిని కూడా సేకరించారు. కానీ కార్యరూపం దాల్చలేదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నందున వంటిమామిడిని వెజిటెబుల్ హబ్‌గా మార్చేందుకు ప్రస్తుత ప్రభుత్వాన్ని ఒప్పిస్తారని రైతులు విశ్వసిస్తున్నారు.

రైతుల సహకారంతోనే రెండు పూటలా మార్కెట్

గతంలో రాత్రి మాత్రమే సాగే మార్కెట్ మూడు సంవత్సరాలుగా రైతుల సహకారంతో రెండు పూటలా సాగుతున్నది. 20షెడ్లు, 90 దుకాణాలు ఉన్నాయి. ఉదయం రైతులు మాత్రమే నేరుగా విక్రయించుకుం టారు. వారి వద్ద ఫీజు, కమీషన్ వసూలు చేయం. రాత్రి జరిగే మార్కెట్‌లో మాత్రం 123 మంది కమీషన్ ఏజెంట్లతో కూరగాయలు విక్రయం జరుగుతుంది. ఏజెంట్ల వద్ద మార్కెట్ కమిటీ నిబంధనల మేరకు కమీషన్ వసూలు చేస్తాం. రైతుల సంఖ్య పెరగడం, ఇతర జిల్లాల నుంచి రైతులు, వ్యాపారులు కూరగాయలు తేవడంతో దుకాణాలు సరిపోవడం లేదు. అందుకే మార్కెట్‌ను వెజిటేబుల్ హబ్‌గా మార్చే ప్రయత్నం జరుగుతున్నది. 

 రేవంత్, కార్యదర్శి, వంటిమామిడి మార్కెట్

3వేల ఎకరాల్లో కూరగాయల సాగు

సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ డివిజన్ పరిధిలో సుమారు 3వేల ఎకరాల్లో కూరగాయలు సాగుచేస్తారు. మార్కెట్ సౌకర్యం ఉండటంతో ఇప్పటి వరకు కూరగాయలు సాగు చేయని రైతులు కూడా సాగు చేసేలా కృషి చేస్తున్నాం. కూరగాయల సాగుతో రైతులు ఆర్థికంగా బలపడుతారు. భవిష్యత్తులో వంటిమామిడి వెజిటెబుల్ హబ్‌గా మారే అవకాశం ఉంది. దాంతో రైతులకు మరింత లాభం చేకూరుతుంది.

 సౌమ్య, ఉద్యానవన శాఖ డివిజనల్ అధికారి, గజ్వేల్

15ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్న

మాది గౌరారం. హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉండ టం, కూరగాయల విక్రయానికి వంటిమామిడిలో మార్కెట్ ఏర్పాటు చేయ డం వల్ల 15ఎకరాల భూమి కౌలుకు తీసుకుని కూరగాయలు మాత్రమే సాగు చేస్తున్నాను. ఎక్కువగా కాకరకాయ పండిస్తాను. ప్రతిరోజు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు విలువగల పంటను మార్కెట్‌లో విక్రయి స్తాను. ఆదాయంతో పాటు సంతృప్తి కూడా లభిస్తుంది. 

 అల్లూరి సతీష్, రైతు, గౌరారం