దీపావళి అమావాస్య ముగిసిన వెంటనే కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. దీపావళి ప్రారంభించిన దీపాల వెలుగుల్ని కార్తీకమాసం అంతా ఆచరిస్తుం టారు. ఈ మాసం అన్ని మాసాలలోకెల్లా ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ఎందుకంటే, శివునికి విష్ణువుకి ఎంతో ఇష్ట మైన మాసం.
ఈ మాసంలో ప్రతిరోజు పవిత్రమైందే. సోమవారాలు, రెండు ఏకాదశిలు, ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావంతమైనవి. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పూర్ణిమ పరమ పవిత్రమైంది. ఎంతో విశిష్టమైంది కూడా.
ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. కార్తీక మాసం అంతా చేసే పూజలు ఒక ఎత్తు అయి తే ఈరోజు చేసే పూజలు మరో ఎత్తు. కార్తీక పూర్ణిమ రోజు దీపాలు వెలిగించడం ద్వారా పుణ్యం లభిస్తుందని నమ్మ కం. అందుకే, ఈరోజు చేసే పూజలు నిష్ఠగా భక్తితో చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజున చాలా ప్రాంతాల్లో 365 వత్తులు వెలిగించుకునే పద్ధతి ఉంది.
ఈ వత్తులు సంవత్సరంలో ఒక్కొ క్క రోజును సూచిస్తాయి. ఏ కారణం చేత అయినా సంవత్సరం మొత్తం దీపారాధన చేయకుండా, ఈ ఒక్కరోజు అన్ని వత్తులు వెలిగించడం ద్వారా ఏడాదంతా దీపారాధన చేసిన పుణ్య ఫలితం కలుగుతుందని నమ్ముతారు.
త్రిపురాసురుల సంహారం
ఈ పౌర్ణమిని ‘త్రిపుర పూర్ణిమ’ అనీ అంటారు. తారకాసురుడి ముగ్గురు కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు. “ఎవరివల్ల కూడా మరణం లేకుండా వరం ఇవ్వమని కోరగా, అది సాధ్యం కాదు”అన్నాడు బ్రహ్మదేవుడు.
“అలా అయితే రథం కాని రథం మీద, విల్లు కాని విల్లుతో, నారి గాని నారి సారించి, బాణం కాని బాణం సం ధించి, మూడు నగరాలు ఒకే సరళరేఖలోకి వచ్చాక, ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితేనే మర ణం సంభవించేలా” వరం కోరారు.
ఆ వరం ఇవ్వక తప్పలేదు బ్రహ్మదేవుడికి. ఆ వరగర్వంతో వారు లోకాలన్నిటా కల్లోలం సృష్టించసాగారు. వివిధ లోకవాసులు బ్రహ్మకు మొర పెట్టుకోగా “వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేను” అన్నాడు. విష్ణువు కూడా “తనకు శక్తి లేదని” వారిని వెంటబెట్టుకుని శివుడి దగ్గరికి వెళ్ళాడు. దేవతలందరూ సహకరిస్తే తాను ఈ పని చేయగలనని అంటాడు.
ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లు కాని విల్లుగా, ఆదిశేషుడు అల్లే తాడు కానీ అల్లే తాడుగా, శ్రీమహావిష్ణువు బాణం కానీ బాణంగా మారారు. వీరందరి సహకార శక్తితో శివుడు త్రిపురాసులను సంహరించాడని పురాణ కథనం. అందువల్లే ఈ పౌర్ణమికి ఆ పేరు వచ్చింది.
ఏడాది వత్తులతో దీపారాధన
365 వత్తులను ముందుగానే నూనెలో కానీ, నెయ్యిలో కానీ నాన బెట్టుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. వాటిని తులసికోట దగ్గర కానీ, దేవాలయంలో కానీ వెలిగించాలి. ఈ రోజున చాలామంది ఉపవాసం ఉంటారు. సాయంత్రం దీపాలు వెలిగించి భోజనం చేయవచ్చు.
కొందరు పూజ చేసేటప్పుడు తులసితోపాటు ఉసిరిచెట్టును కూడా పెడతారు. దీనివల్ల మరింత పుణ్యం వస్తుందని వారి నమ్మకం. తులసికోటని చక్కగా అలంకరించి బియ్యప్పిండితో ముగ్గు వేసుకొంటారు. తులసికోటకి రెండువైపులా దీపాలు వెలిగించి పసుపు దీపారాధన చేయాలి.
ఈ రోజు చేసే స్నానం, దీపారాధన, ఉపవాసం.. అన్నింటిలోనూ ఆధ్యాత్మికత, ఆరోగ్య భావనలు అంతర్లీనంగా ఉన్నాయి. ఇవాళ పగలంతా ఉపవాసం ఉండి రాత్రి దీపారాధన చేయాలి. చలిమిడి చంద్రుడికి నివేదించి ఫలహారంగా స్వీకరించాలని శాస్త్రం చెబుతున్నది.
ఇలా చేయడం వల్ల ‘కడుపు చల్లన’ అంటే ‘బిడ్డలకు రక్ష’ అని పెద్దలు అంటారు. శివాలయాల్లో జరిపే జ్వాలాతోరణం ఈరోజు మరొక ప్రత్యేకత. ముఖ్యంగా ఈ రోజున చేయవలసినవి దైవదర్శనం, దీపదానం, దీపారాధన, సాలగ్రామ దానం, దీపోత్సవ నిర్వహణ వంటివి విశేష శుభ ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
- పాలపర్తి సంధ్యారాణి