calender_icon.png 13 January, 2025 | 5:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగర్‌లో 16 క్రస్టుగేట్లు ఎత్తివేత

06-08-2024 03:48:46 AM

  1. పూలు సమర్పించి, గేట్లు ఎత్తిన కలెక్టర్ 
  2. పులిచింతల వైపు కృష్ణమ్మ పరుగులు 
  3. శ్రీశైలం నుంచి 3.70 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

హైదరాబాద్/నల్లగొండ, ఆగస్టు 5 (విజయక్రాంతి): ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో తెలుగు రాష్ట్రాల వర ప్రదాయని నాగార్జున సాగర్ పూర్తిస్థాయిలో నిండి కళకళలాడుతోంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టా నికి చేరడంతో సోమవారం ఉదయం 10 గంటలకు నీటిపారుదల అధికారులు 6 క్రస్టుగేట్లను ఎత్తి 44 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కలెక్టర్ నారాయణరెడ్డి జలాశయాన్ని పరిశీలించారు. క్రస్టుగేట్ల నుంచి దిగువకు వెళ్తున్న కృష్ణమ్మకు పూజలు చేసి 7, 8 క్రస్టు గేట్లను ఎత్తారు. ఎగువ నుంచి వరద పోటెత్తుతుడటంతో సాయంత్రం 6.30 గంటల తర్వాత అధికారులు 16 క్రస్టుగేట్లను ఎత్తారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.5050 టీఎంసీలు) కాగా ప్రస్తు తం 584 అడుగులు (294.5500 టీఎంసీలు)గా ఉంది. 

పులిచింతలకు భారీగా ప్రవాహం 

క్రస్టుగేట్లు ఎత్తడంతో పులిచింతల ప్రాజెక్టుకు భారీగా ప్రవాహం వచ్చి చేరుతోంది. సాగర్ స్పిల్ వే ద్వారా లక్షా 43 వేల క్యూసెక్కులు, ప్రధాన విద్యుత్ కేంద్రంలో విద్యు దుత్పత్తి కొనసాగిస్తూ మరో 29 వేల క్యూసెక్కులను నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.7254 టీఎంసీలుగా ఉంది. సాగర్ నుంచి భారీగా ప్రవాహం వస్తుండడంతో ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులు ఇక్కడి నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల ప్రారంభించారు. నాలుగు గేట్లను ఎత్తి 26 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. 

ముఖ్యమంత్రుల సంతోషం

సాగర్ నిండటంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా ఆయకట్టుకు సాగునీరు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రాష్ట్రాల పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో దాదాపు 22 లక్షల ఎకరాల ఆయకట్టు ఉం ది. పదిరోజుల క్రితం సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీలో ఉండగా.. కృష్ణమ్మ కరుణించడం తో కేవలం పదిరోజుల్లోనే నిండింది.

పనిచేయని టర్బైన్

సాగర్‌లోని ప్రధాన విద్యుదుత్పత్తి కేంద్రంలో 8 టర్బైన్లు ఉండగా ప్రస్తుతం 7 పని చేస్తున్నాయి. రెండో టర్బైన్ కొంతకాలంగా పని చేయకపోవడంతో పూర్తిస్థాయి లో అధికారులు విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోతున్నారు. జల విద్యుత్ కేంద్రానికి 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతం 700 మెగావాట్లే ఉత్పత్తి అవుతోంది. టర్బైన్‌ను మరమ్మతు చేసేందుకు జపాన్ నుంచి సాంకేతిక నిపుణులు రావాల్సి ఉంది.

మిడ్ మానేరుకు ఇన్‌ఫ్లో

రాజన్న సిరిసిల్ల(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర మిడ్ మానేరు జలాశయానికి లక్ష్మీపూర్ పంప్‌హౌజ్ నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. 12,800 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండటంతో జలాశయంలో సోమవారం మధ్యాహ్నానికి 16.46 టీఎంసీలకు నీరు చేరింది. రిజర్వాయర్ పూర్తి సామ ర్థ్యం 27.54 టీఎంసీలు. మిడి మానేరు నుంచి 6,462 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు.