calender_icon.png 24 December, 2024 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎత్తిపోతలు.. ఉత్తి చేతులు!

19-10-2024 01:00:07 AM

  1. ఏండ్లుగా మరమ్మతులకు నిధులు కరువు
  2. శిథిలావస్థలో మోటర్లు, షెట్టర్లు
  3. వేధిస్తున్న సిబ్బంది, నిధుల కొరత 
  4. పట్టించుకోని ప్రభుత్వాలు 
  5. రైతులకు భారంగా నిర్వహణ 
  6. ఎండుతున్న చివరి ఆయకట్టు భూములు 

నల్లగొండ, అక్టోబర్ 18 (విజయక్రాంతి)/ సూర్యాపేట: నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిలో నల్లగొండ, సూర్యాపేట ఎత్తిపోతల పథకాల నిర్వహణ రైతులకు భారంగా మా రింది.

2017 నుంచి ఎత్తిపోతల పథకాల మోటర్లు, షట్టర్లు, పైపులకు మరమ్మతులు కరవవడంతో రైతులు ఎకరానికి కొంత మొత్తం వేసుకొని మరమ్మతులు చేయించుకుంటున్నారు. కొన్నిచోట్ల రైతుల మధ్య సమన్వయం లోపం కారణంగా ఈ విధానం వివాదాలకు దారి తీస్తున్నది. ఎడమ కాల్వ పరిధిలో 46 ఎత్తిపోతల పథకాలు ఉన్నా యి. వీటి పరిధిలో దాదాపు లక్ష ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. 

అమలుకు నోచని మాజీ సీఎం హామీ 

తెలంగాణ ఉద్యమ సమయంలో సాగర్ ఎడమ కాల్వ రైతులకు సాగునీరివ్వాలని, ఎత్తిపోతలను (లిఫ్టు)లను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ 2003లో నా టి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉద్యమ నేత కేసీఆర్ కోదాడ నుంచి హాలియా వరకు పా దయాత్ర నిర్వహించారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే ఎత్తిపోతల పథకాలన్నీంటిని ప్రభుత్వమే నిర్వహిస్తుందని హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చాక ఆ హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చడంలో విఫలయ్యారు. మూడేళ్లపాటు అరకొర నిధులు కేటాయించి ఆ తరువాత పైసా విదల్చకపోవడంతో రైతులు నానా అవస్థలు పడ్డారు. 

పైలట్ ప్రాజెక్ట్ కింద లిప్టులు..

హుజూర్‌నగర్, కోదాడ పరిధిలో ఎత్తిపోతలను పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వమే నిర్వ హిస్తుందని ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఈ నియోజకవర్గాల్లో చిన్న, మధ్యతరహా 53 ఎత్తిపోతలు ఉన్నాయి. హుజూర్‌నగర్‌లో 9 పూర్తిస్థాయిలో పనిచేస్తుండగా, 12 పాక్షికం గా నడుస్తున్నాయి. 7 పనిచేయకపోగా మరో ఏడు పూర్తిగా శిథిలావస్థ కుచేరాయి. కోదాడలో ౫ పనిచేస్తున్నాయి.

మితా వాటి మరమ్మతులకు భారీగా నిధులు అవసరం ఉం టుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. లిప్టుల నిర్వహణకు ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వాచ్‌మెన్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమిస్తామని, అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అ మలు చేస్తామని ప్రభుత్వం చెప్పిందే తప్ప కార్యరూరం దాల్చలేదని రైతులు ఆరోపిస్తున్నారు.

దశాబ్దాలుగా రైతులపైనే భారం

సాగర్ ఎడమ కాలువ పరిధిలో తొలిసారి 1969లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో మహాత్మాగాంధీ లిఫ్టు (ఎల్- 27)ను నాటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆరు వేల ఎకరాలకు నీరందించేలా దీన్ని రూపకల్పన చేశారు. కానీ, ని ర్వాహణ మాత్రం రైతులకు అప్పగించింది.

నాటి నుంచి ఏటా రైతులే ఎకరాకు రూ. 1000 చెల్లిస్తూ ఆర్థిక భారం మోస్తున్నారు. రైతుల అభ్యర్థన మేరకు ప్రభుత్వాలు ఎత్తిపోతల నిర్వహణకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినా నేటికి కార్యరూపం దాల్చడం లేదు. దీంతో నిర్వాహణ అధ్వానంగా మారి సాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 

తుప్పు పడుతున్న మోటర్లు.. 

నల్లగొండ జిల్లాలోని పలు చోట్ల 170 హెచ్‌పీ మోటార్లు, గడ్డిపల్లి ఎల్ -27, కాగిత రామచంద్రాపురం ఎల్ -36.. 300 హెచ్‌పీ మోటర్లతోపాటు పలు లిప్టులలోని మోటార్లు శిథిలావస్థకు చేరడంతో నడవడం లేదు. కొత్తవి ఏర్పాటు చేయాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తున్నది. మరమ్మతులు చేయించాలన్నా కష్టమే. ఈ విషయాలు తెలిసినా అధికారులు పట్టించుకోవ డం లేదనే ఆరోపణలున్నాయి.

ఈ సారి వర్షాలు సమృద్ధిగా కురిసి సాగ ర్ నీరు వస్తుండడంతో రైతులకు సాగు నీటికష్టాలు తప్పాయి. లిప్టుల ఆయకట్టు పరిధిలోని భూములను బోర్లు, వ్యవసాయ బావుల ఆధారంగా సాగు చేసుకుంటున్నారు. సాగునీటి కష్టాలు రాకముందే మోటర్లను బాగు చేయించి ఇబ్బందుల్లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. 

ప్రభుత్వమే నిర్వహించాలి 

లిప్టు మోటర్లు, పంపుసెట్లు ఇబ్బందిపెడితే మరమ్మతులు చేయించడం రైతులకు తలకు మించిన భారంగా మారింది. భారీగా ఖర్చులు అయితే మాత్రమే ప్రభుత్వం సాయం అందజేస్తున్నది. రెండు లక్షలలోపు ఖర్చుయితే వెంటనే నిధులు మంజూరు చేస్తున్నారు. రూ.5 లక్షల కన్నా ఎక్కువైతే టెండర్లు ఆహ్వానిస్తున్నారు. చిన్నచిన్న మరమ్మతులు రైతులే చేయించుకోవాల్సి వస్తుంది.

ఆపరేటర్లు, వాచ్‌మెన్లు, ఇతరులకు జీతాలు ఇవ్వడం సవాలుగా మారడంతో లిప్టు నిర్వాహణే కష్టంగా మారింది. ప్రభుత్వమే నిర్వహిస్తే రైతులకు ఇబ్బంది లేకుండా సాగు ప్రశాంతంగా సాగుతుంది. ముదిరెడ్డి వెంకటరెడ్డి, రైతు, కాగిత రామచంద్రాపురం, నడిగూడెం

లిప్టులకు ప్రత్యేక విద్యుత్ లైన్ ఉండాలి 

సాగర్ ఎడమ కాల్వ లిప్టుల నిర్వహణ రైతులకు ఇబ్బందిగా మారింది. దీనిని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారే తప్ప అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం లిప్టులను నిర్వహిస్తామని ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకు అది హామీగానే మిగిలింది.

లిప్టులకు ఉన్న ప్రత్యేక విద్యుత్ లైన్లుకు వివిధ పీడర్లకు అనుసంధానించారు. వీటిని వెంటనే తొలగించాలి. ఈ పీడర్ల కారణంగా లిప్టుల మోటర్లకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో ప్రైవేటు ఆపరేటర్లు ఇబ్బంది పడుతున్నారు.  

 చల్లబట్ల ప్రణీత్‌రెడ్డి, రైతు వేములపల్లి, నల్లగొండ