14-03-2025 12:00:00 AM
అరగంటపాటు భయాందోళనకు గురైన రోగులు
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 13 (విజయక్రాంతి): సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి మెయిన్ బిల్డింగ్‌లోని నాలుగో నంబర్ లిఫ్ట్ గురువారం సాంకేతిక లోపంతో మధ్యలోనే ఆగిపోయింది. కింది నుంచి ఎనిమిదో అంతస్తుకు వెళ్తున్న క్రమంలో ఆరో అంతస్తు వద్ద ఆగింది. ఆ సమయంలో లిఫ్ట్‌లో ఉన్న రోగులు, వారి సహాయకులు దాదాపు 15 మంది దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ అందులోనే ఉండిపోయారు.
దాదాపు అరగంటపాటు ఇబ్బంది పడ్డారు. బయట ఉన్న వారి బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత లిఫ్ట్ టెక్నీషియన్ వచ్చి సమస్యను పరిష్కరించడంతో ఊపిరిపీల్చుకున్నారు. కాగా గాంధీ ఆస్పత్రిలో లిఫ్ట్‌ల పరిస్థితిపై రోగులు, వారి సహాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అరగంటపాటు లిఫ్ట్‌లో అలారం బటన్ నొక్కినా పని చేయలేదని, ఫోన్ చేసినప్పటికీ కలవలేదని బాధితులు వాపోయారు.