- 10 నెలల్లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులు
- 51 వేల మందికి ఉద్యోగ అవకాశాలు
- ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌కు కేంద్ర బిందువుగా హైదరాబాద్
- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): రెండు నెలల్లో రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించిన ప్రత్యేకపాలసీని అందుబాటులోకి తీసుకొ స్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు.
త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించే ఈ పాలసీ ద్వారా లైఫ్‌సైన్సెస్ కంపెనీలను నెలకొల్పేందుకు ముందుకొచ్చే సంస్థలకు భూ కేటాయింపులు, ప్రోత్సాహకాలు లభిస్తాయని చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రం లోనూ ఈ రకమైన పాలసీని రూపొందించలేదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ౧౦ నెలల కాలంలో లైఫ్‌సైన్సెస్ రంగంలో సాధించిన ప్రగతిపై గురువారం హైటెక్ సిటీలో మంత్రి మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తక్కువ కాలంలోనే లైఫ్‌సైన్సెస్, ఫార్మా రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించి, అద్భుత విజయాలు సాధించిందని తెలిపారు.
౧౦ నెలల్లోనే రూ.35,820 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నట్టు స్పష్టంచేశారు. ఔషధ, టీకాలు, లైఫ్‌సైన్సెస్ పరిశోధనలకు సంబంధించిన 141 దేశీయ, బహుళ జాతి కంపెనీలు ఇప్పటికే తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకొచ్చా యని వివరించారు.
వీటిలో కొన్ని కంపెనీలు తమ నిర్మాణాలు మొదలుపెట్టగా, మరికొన్ని ఇప్పటికే ఉత్సాదన మొదలు పెట్టే దశలో ఉన్నాయని చెప్పారు. విస్తరణ పనులు చేపట్టిన కంపెనీలు ఉత్పాదన ప్రారంభించాయని వివరించారు. ఈ కంపెనీలన్నీ ఉత్పాదన మొదలు పెడితే ప్రత్యక్షంగా 51,086 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా మరో లక్షన్నరమందికి ఉపాధి లభిస్తుందని స్పష్టం చేశారు.
లైఫ్‌సైన్సెస్‌కు కేంద్ర బిందువు
దేశంలో ఫార్మా, లైఫ్‌సైన్సెస్ రంగాలకు చెందిన కొత్త కంపెనీలకు హైదరాబాద్ కేంద్రబిందువుగా అయిందని శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఒకేచోట కాకుండా పలు ప్రాంతాల్లో ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ పరిశ్రమల్లో ఆధునిక కాలుష్య నియంత్రణ ప్లాంట్లు ఏర్పాటు చేసిన తర్వాతే కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చేలా నిబంధనలు విధించనున్నట్టు వివరించారు.
ఆసియాలోనే మూడో అతిపెద్దదైన జపాన్‌కు చెందిన టకెడా లైఫ్‌సైన్సెస్ సంస్థ స్థానిక బయోలాజికల్ ఈ(బీఈ)తో కలిసి ఏటా కోట్ల డెంగ్యూ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తుందని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద పశు వైద్యసంస్థ అయిన జోయిటిస్ ఇటీవలే తమ జీసీసీని హైదరాబాద్‌లో ప్రారంభించిందని తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద బయోటెక్నాలజీ కంపెనీ ఆమ్జెన్ 3 వేల మంది ఉద్యోగులను నియమించుకునే జీసీసీని ప్రారంభించిందని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి చేసిన అమెరికా పర్యటన తర్వాత కొద్దికాలంలోనే జోయిటిస్, ఆమ్జెన్ వంటి కంపెనీలు ప్రారంభం కావడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శమన్నారు.
అభివృద్ధిని అడ్డుకుంటే ఉపేక్షించం
ఫార్మా క్లస్టర్ల భూసేకరణలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని మంత్రి వెల్లడించారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించి, వారు అంగీకరించిన తర్వాత, వారి డిమాండ్లు నెరవేర్చాకే భూసేకరణ చేపడతామని స్పష్టం చేశారు. సమస్యలేమైన ఉంటే రైతులు అధికారుల ముందు వెల్లడించాలని కోరారు. ప్రతిపక్షాల కుట్రలకు, రెచ్చగొట్టే చర్యలకు ప్రభుత్వం భయపడదని హెచ్చరించారు.
పదేళ్ల కాలంలో తామెన్నడూ అధికారులపైన దాడులకు ఉసిగొల్పే కుట్రలకు పాల్పడలేదని చెప్పారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే ఏ శక్తిని ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, లైఫ్‌సైన్సెస్ విభాగం డైరెక్టర్ శక్తి నాగప్పన్, టీజీఐఐసీ సీఈవో మధుసూదన్ పాల్గొన్నారు.