- 2030 నాటికి 1.5 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తే ధ్యేయం
- కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి
- ఒడిశాలో రాష్ట్రాల బొగ్గు, గనులశాఖ మంత్రుల జాతీయ సదస్సు
- మార్చి నుంచి నైనీ బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తి.. సహకరించండి
- ఒడిశా సీఎంకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి
హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): దేశ ఆర్థిక వృద్ధికి మైనింగ్ రంగం ఆయువుపట్టు అని, ఈ రంగం లేకుండా దేశ ఆర్థిక కార్యకలాపాలు దాదాపు అసాధ్యమని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 72 శాతం విద్యుదుత్పత్తి బొగ్గు ద్వారానే జరుగుతున్నదని వెల్లడించారు.
ఒడిశాలోని కోణార్క్‌లో రా ష్ట్రాల బొగ్గు, గనుల శాఖ మంత్రులతో సోమవా రం నిర్వహించిన 3వ జాతీయ సదస్సులో ఆ యన మాట్లాడారు. 2030 నాటికి 1.5 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నదని, రాష్ట్రాల సహకారంతో ఈ లక్ష్యాన్ని అధిగమిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ జీడీపీలో మైనింగ్ రంగం వాటా 2శాతంగా ఉందని స్పష్టం చేశారు.
పారిశ్రామిక అభి వద్ధి, మౌలిక సదుపాయాలు, ఆటోమొబైల్, పునరుత్పాదక విద్యుత్, ఆధునిక సాంకేతికత, తయారీ రంగం వంటి వివిధ రంగాల్లో బొగు, ఖనిజాల పాత్రే కీలకమని వెల్లడించారు. దేశవ్యాప్తంగా విద్యుత్ అవసరాలు పెరుగుతున్నదని, అందుకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి పెంచాల్సిన అవస రం ఉందన్నారు. మైనింగ్ రంగం దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైందన్నారు.
కేంద్రం మైనింగ్ రంగం లో తీసుకొచ్చిన సంస్కరణలతో రాష్ట్రప్రభుత్వాలకూ అదనంగా ఆదాయం వస్తోందని వివరిం చారు. గనుల వేలంతో 2015 నుంచి ఇప్పటివరకు వేలం ప్రీమియం, రాయల్టీ రూపంలో సుమారు 2.69 లక్షల కోట్ల ఆదాయం రాష్ట్రప్రభుత్వాల ఖజానాకు చేరాయని స్పష్టం చేశారు.
2004 14 మధ్య కాలం రాష్ట్రప్రభుత్వాలకు సమకూరిన ఆదాయం రూ.55,636 కోట్లు మా త్రమే అని గుర్తుచేశారు. గని ప్రభావిత ప్రాంతాల ప్రజల సంక్షేమం కోసం డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (డీఎంఎఫ్) పేరిట రూ.లక్ష కోట్లకు పైగా డబ్బు జమ చేశామన్నారు..
సవాళ్లను ఎదుర్కొనేందుకు కార్యాచరణ..
దేశంలో ఖనిజ రంగం స్వయం సమృద్ధి సా ధించే దిశగా కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడిం చారు. రాష్ట్రప్రభుత్వాల సహకారంతో త్వరలోనే దేశం క్రిటికల్ మినరల్స్ రంగంలో గ్లోబల్ డెస్టినేషన్‌గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 2040 నాటికి బొగ్గు వినియోగం మరింతగా పెరగనున్నదని, ఏడాదికి సుమారు 2 బిలియన్ టన్నుల బొగ్గు అవసరం అవుతుందని అంచనా వేశారు.
ఈ డిమాండ్‌కు తగిన బొగ్గు సమీకరణకు రాష్ట్రప్రభుత్వా సహకారం ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ధి, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా అందరికీ ఆమోదయోగ్యమైన మాడల్ అమలు చేస్తామన్నారు. సమావేశంలో ఇతర రాష్ట్రాల బొగ్గు, గనులశాఖ మంత్రులతో పాటు తెలంగాణ తరఫున డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రాతినిథ్యం వహించారు.
తెలంగాణలో సమృద్ధిగా ఖనిజ నిక్షేపాలు: భట్టివిక్రమార్క
తెలంగాణలో లైమ్ స్టోన్, ఐరన్, మాంగనీస్, క్వార్డజ్, గ్రానైట్, మెటల్, డోలమైట్ వంటి ఖనిజ నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు. 2025 లైమ్ స్టోన్, మాంగనీస్ వంటి 32 ఖనిజ బ్లాకులను వేలం వేయాలన్న కార్యాచరణతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,552 ఖనిజ గనులు లీజుకు నడుస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా నది తీరాల్లోని మట్టి/మెట్ట ఖనిజాల కోసం ప్రత్యేకమైన విధానం రూపొందించామని వివరించారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ పర్యావరణ హితంగా కార్యాచరణ అమలు చేస్తున్నదన్నారు.