‘ప్రాణం’ అంటే ‘పరమాత్మ’ నుంచి వాయురూపంలో జనించే శక్తి (life force or bio ‘ప్రాణం’ అంటే ఆత్మ కాదు. ప్రాణాన్నే ‘ముఖ్య ప్రాణం’ అని కూడా అన్నారు. ఈ ‘ముఖ్య ప్రాణం’ తనను తాను పంచప్రాణాలుగా విభజించుకుని ఈ శరీరాన్ని నడిపిస్తుంది. అవి: ప్రాణం, సమానం, అపానం, వ్యానం, ఉదానం అనేవి. వాటి స్వభావ స్వరూపాలిలా ఉంటాయని ‘ప్రశ్నోపనిషత్తు’ వివరించింది (మూడవ ప్రశ్న).
చక్షుఃశ్రోత్రే ముఖనాసి కాభ్యాం ప్రాణః స్యయం ప్రాతిష్ఠతే (ప్ర.ఉ.) -
‘ప్రాణం’ శరీరాన్ని మూడు భాగాలుగా విభజించి పరిపాలిస్తుంది. ముఖ మండలంలో ముఖ్యమైన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, గనుక ప్రాణం (ముఖ్య ప్రాణం) ఆ ప్రాంత పరిపాలన తానే తీసుకుంది. ముఖ మండలంలోనే ఉంటూ నాసికా పుటాలలో, చక్షు యుగ్మంలో, కర్ణ యుగ్మంలో, నోటిలో సంచరిస్తూ అవన్నీ వాటి వాటి కర్మలను సక్రమంగా నిర్వహించేలా చూస్తుంది.
సమానం మధ్యేతు సమానః -
శరీర మధ్య భాగంలో అంటే, నాభి స్థానంలో ‘సమానాన్ని’ నియమించిది. దానికి అప్ప చెప్పిన పని ఉదరంలోకి చేరిన అహారాన్ని జఠరాగ్ని సహాయంతో జీర్ణక్రియ నిర్వహించి శరీరంలోని భాగాలన్నిటికీ బలం చేకూర్చడం (supplying nutrition) దాని పని. శరీరానికి అంతటి కి నిష్పక్షపాతంగా అందిస్తుంది. భారతీయ సంస్కృతిలో ఉదరం ఒక యజ్ఞకుండం లాంటిది. అక్కడ జఠరాగ్ని ఉంటుంది. మనం ఆహారం తినడం హోమం చెయ్య డం లాంటిది. యాగంలో హవ్యాలను దేవతలకు అందించినట్లు ఈ ‘సమానం’ అన్నరసాన్ని శరీర భాగాలకు అందిస్తుందన్న మాట.
‘అపానం’ పాయూపస్థే పానం -
ఇక ‘అపానం’ మల మూత్ర విసర్జన క్రియను నిర్వహిస్తుంది. ఇలా ‘ముఖ్య ప్రాణం’ శరీర కార్యకలాపాల్ని వికేంద్రీకరించి నిర్వర్తిస్తున్నది.
‘వ్యాసం’ః హృదయ కుహరం నుండి నాడీ వ్యవస్థ శరీరంలో వ్యాపిస్తుంది. హృదయంలో ప్రధానమైన నాడులు నూట ఒక్కటి (101) ఉన్నాయి. ఇవి శాఖోపశాఖలుగా వ్యాపించి కోట్లసంఖ్యలో శరీరం అంతా అలుముకున్నాయి. వీటన్నిటిలో ‘వ్యానం’ సంచరిస్తూ వాటిని చైతన్య వంతం చేస్తుంది. ‘వ్యానాని’కి అప్పగించిన పని ఇదే.
ఒక్క విషయం గమనించాలి. ఇక్కడ ‘నాడి’ అనే పదానికి ‘రక్తనాళం’ అని అర్థం చెప్పుకుంటే ఈ ఉపనిషత్తులో చెప్పిన వ్యవస్థ ఆధునిక వైద్య విజ్ఞానశాస్త్రానికి అనుగుణంగా ఉంటుంది. ఈ శాస్త్రంలో గుండెనుండి రక్తనాళాలు వ్యాపించి శరీరంలోని అన్ని భాగాలకి రక్తాన్ని అందించి చైతన్యవంతం చేస్తాయి. ఇలా రక్త ప్రసరణ చేసే శక్తినే ‘వ్యానం’ అనుకుంటే బాగుంటుంది. ఆధునిక వైద్యవిజ్ఞాన శాస్త్రంలో నాడీవ్యవస్థను (nervous system) మెదడు, వెన్నుపాము (brain and spi nal cord) కలిసి నిర్వహిస్తున్నాయి. ఇది ఋజవైంది గనుక, ఈ ఉపనిషత్తులో చెప్పిన ‘నాడి’ పదానికి ‘రక్తనాళం’ అని అర్థం చెప్పుకోవాలి. ఉపనిషత్తులో ‘నాడి’ పదానికి ‘నాడి’ అని, ‘రక్తనాళం’ అని సందర్భాన్నిబట్టి అర్థం చేసుకోవాలని ‘ప్రశ్నో పనిషత్తు’పై వ్యాఖ్యాతలు సెలవిచ్చారు.
ఉదానంః
అథైక యోర్థ్య ఉదానః పుణ్యేన పుణ్యం లోకం
నయతి పాపేన పాపముభాభ్యామేవ మనుష్యలోకం
(ప్ర. ఉ. 3.7)
ఇక, ‘ఉదానం’ అనేది ఊర్ధ్వముఖంగా ఉంటుంది. పాపాత్ములను అథో లోకాలకు, పుణ్యాత్ములను ఉత్తమ లోకాలకు, పాపపుణ్యాలు సమానంగా చేసిన వారిని మళ్ళీ మర్త్యలోకానికి చేర్చడం దీని పని. సుషుమ్న నాడితోపాటే ఇది ఉంటుందని, ప్రాణం శరీరం నుండి నిష్క్రమించేటప్పుడు ఇది జీవాత్మ భవిష్యత్తును నిర్ణయిస్తుందని ‘ప్రశ్నోపనిషత్తు’లో చెప్పబడింది. అంటే, దాని పని కర్మానుగు ణంగా ఉంటుందని అర్థం.
ప్రాణం వల్ల మనిషి బతుకుతున్నాడని అనుకోకూడదు. ప్రాణం, ఇంద్రియాలు అన్నీ ఒక సంఘటిత జీవయంత్రం లాంటి వి. పరస్పరం సహకరించి ఆత్మ చైతన్యం తో పనిచేస్తూ ఉంటాయి.
న ప్రాణేన నా పానేన మర్త్యో
జీవతి కశ్చన
ఇతరేణ తు జీవంతి
యస్మిన్నేతా వుపాశ్రితౌ ॥
(క. ఉ. 2.2.5)
ప్రాణం వల్ల శరీరం జీవిస్తుందనే వాదాన్ని ఉపనిషత్తు తిరస్కరించింది. రాధాకృష్ణ పండితుడిలా వ్యాఖ్యానించాడు. ఈ మంత్రం ఆత్మ శరీర భాగాల సంఘాతం అనే భౌతిక వాదుల సిద్ధాంతాన్ని ఖండిస్తుంది. ఇల్లు, దానిలోని యజమాని వేరు; ఇల్లు కూల్చినంత మాత్రాన యజమాని చనిపోడు. అలాగే, శరీర పతనంతో ఆత్మ నశిస్తుందని అనుకోకూడదు. అయితే, శరీరం నుండి ఆత్మ నిష్క్రమిస్తే, శరీరం వికలమవుతుంది (The Principal Upanishads:- Page 638).
(‘శ్రీ వేదభారతి’ సౌజన్యంతో,
‘వేదాంత పరిభాష’ నుంచి..)